హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ఇంటర్ విద్యపై సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ కాలేజీలు ప్రారంభమై మూడు వారాలు కావస్తున్నా విద్యార్థులకు కనీసం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయకపోవటం బాధ్యతారాహిత్యమేనన్నారు. ఈ మేరకు బుధవారం ఎక్స్‌వేదికగా స్పందించారు. రాష్ట్రంలో ఇంటర్ కాలేజీల్లో 1654 మంది గెస్ట్ ఫ్యాకల్టీలను రెన్యువల్ చేయాలని, కొత్తగా మంజూరైన జూనియర్ కాలేజీల్లో పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన అని ప్రచారం చేసుకునే ప్రభుత్వానికి విద్య, విద్యార్థుల భవిష్యత్తుపై ఏమాత్రం చిత్తశుద్ధిలేదని, 422 జూనియర్ కాలేజీల్లో లక్షా 60 వేల మంది పేద, బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్నారని, వారికి నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని కొన్ని జూనియర్ కాలేజీల్లో మొదటి ఏడాది జీరో అడ్మిషన్స్ నమోదవడంపై దృష్టి సారించి ఇంటర్మీడియెట్ విద్యను బలోపేతం చేసేందుకు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలన్నారు.