Harish Rao | హైదరాబాద్ : ఈ రాష్ట్రానికి శనిలాంటి సీఎం రేవంత్ రెడ్డిని దించేదాకా.. కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసేదాకా నేను, కేటీఆర్ పోటీ పడి పని చేస్తామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తేల్చిచెప్పారు. మా మధ్య ఎలాంటి కుమ్ములాటలు లేవు అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
ప్రతిపక్ష పదవి కోసం నేను కేటీఆర్ కొట్లాడుతున్నామట. మేం ఉద్యమకారులం. కేసీఆర్ ఆదేశాలతోని మంత్రి పదవికి రాజీనామా చేశాను. రెండుసార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను. కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ గల కార్యకర్తలం మేమిద్దరం. నీకు అలవాటు.. కాంగ్రెస్ పార్టీలో చేరి ఒక్కొక్కరిని తొక్కుకుంటూ, సీనియర్ల మీద సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి.. రూ. 50 కోట్లకు పదవి కొనుక్కున్నవ్. ఈ విషయం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పిందే అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
అడ్డదారిన, దొడ్డిదారిన పదవులను కొనుక్కోవడం నీకు అలవాటు రేవంత్ రెడ్డి. మాకు అలవాటు లేదు. మేమిద్దరం పోటీ పడుతాం.. శనిలా ఈ రాష్ట్రానికి పట్టిన నీ పీడను తొలగించడానికి, నిన్ను దించడానికి పోటీ పడుతాం. పదవుల కోసం పోటీ పడం. ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయడం కోసం, న్యాయం చేయడం కోసం, నీవు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసేదానికి పోటీ పడుతాం. నీ ముక్కు పిండి మహాలక్ష్మి పథకం కింద 2500 ఇప్పించేందుకు నీ వెంట పడుతం. రైతు రుణమాఫీ పూర్తయ్యేదాక నీ వెంట పడుతాం. రైతుబంధు వేసే దాకా పోటీ పడి నీ వెంట పడుతాం. మాకు కుమ్ములాటలు లేవు.. దింపుడుకళ్లం ఆశలు పెట్టుకోకు. వి ఆల్ ఆర్ వన్.. బీఆర్ఎస్ నాయకులది, కార్యకర్తలది ఒకే మాట, ఒకే బాట.. మా మాట కేసీఆర్ మాట.. మా బాట కేసీఆర్ బాట. మా అందరి ఆశయం తిరిగి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడమే. నువ్వు దింపుడకళ్లం ఆశలు పెట్టుకోకు రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
స్టేట్ ఫ్యూచర్ గురించి ఆలోచించేవాడివి ఇలాంటి పనులు చేయవు. ఇలాంటి వెకిలి మాటలు మాట్లాడవు. కమీషన్ల కోసం బిల్లులు ఇస్తివి. కానీ మెయింటెన్సెన్కు డబ్బులు ఇవ్వక పంటలు ఎండబెడుతున్నవ్. ఇదేనా స్టేట్ ఫ్యూచర్. ఇదేనా నీకుండే బాధ్యత. స్టేట్ ఫ్యూచర్ పట్ల కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి బాధ్యత ఉంది. తలసరి ఆదాయంలో, విద్యుత్ వినియోగంలో, వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను నంబర్ వన్ చేశాం. ప్రతి ఇంటికి తాగునీరు అందించి దేశానికి ఆదర్శంగా నిలిచాం. మాకు స్టేట్ ఫ్యూచర్ పట్ల బాధ్యత ఉంది కాబట్టి మేం పని చేశాం. మీకు బాధ్యత లేదు కనుక అగ్గిపెట్టెల్లాగా ప్రాజెక్టులు కూలిపోతున్నయ్, నీ నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోతున్నయ్, రైతుల, చేనేత, ఆటో కార్మికులు రోజుకు ఒకరు పిట్టల్లా రాలిపోతున్నారు.. అన్ని చిల్లర మాటలు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.