మెదక్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ)/దుబ్బాక: ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి జైలుకు పోవడం ఖాయమైందని, అందుకే సాక్ష్యాలు మాయం చేసేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌ను దగ్ధం చేసిండ్రని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, రేవంత్‌రెడ్డి డైరెక్షన్లో జరిగిన ఘటన అని స్పష్టంచేశారు. రేవంత్‌రెడ్డి డైరెక్షన్లో పోలీసులు చేసిన దహన కాండ అని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి శిక్ష తప్పదని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో.. అనంతరం మెదక్ జిల్లా రామాయంపేట, మెదక్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లలో హరీశ్‌రావు మాట్లాడారు.
కాంగ్రెస్ చేసింది గుండు సున్నా
రెండేండ్ల పాలనలో కాంగ్రెస్ చేసింది గుండు సున్నా అని హరీశ్ విమర్శించారు. ‘రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం మిర్యాలగూడ, భూపాలపల్లి, నిజామాబాద్ పోయిండు. కానీ ముఖ్యమంత్రికి మెదక్‌కు వచ్చే ముఖం లేదు. ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు వేసి మాట తప్పిండు కాబట్టి రేవంత్‌రెడ్డికి భయం పట్టుకున్నది. రైతులకు పంట రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పి మోసం చేసిండు. రైతు బంధు ఎగ్గొట్టిండు. ఎరువుల కరువు తెచ్చిండు’ అని నిప్పులు చెరిగారు. బూతులు మాట్లాడటం తప్ప ఒక్క మంచి పనీ చేయడం లేదని విమర్శించారు. ‘ముస్లింకు రంజాన్ తోఫా ఇవ్వడం లేదు. కల్యాణ లక్ష్మీ, షాదీముబాకర్ చెక్కులు రావడం లేదు. కేసీఆర్ మైనారిటీల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి పేద మైనారిటీలకు కార్పొరేట్ విద్య అందించారు. మెదక్‌లో ముస్లింల కోసం షాదీఖాన కట్టిన సెక్యులర్ పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టంచేశారు.
25 గంటలు అన్న గొప్ప ఎమ్మెల్యే
‘మెదక్ ఎమ్మెల్యే చాలా గొప్పోడు.. రోజుకు 24 గంటలుంటే.. అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు 25 గంటలకు కరెంట్ ఇస్తామని చెప్పిన గొప్ప తెలివిమంతుడు మెదక్ ఎమ్మెల్యే అని హరీశ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 12 గంటల కరెంట్ కూడా సరఫరా చేయడం లేదని విమర్శించారు. వ్యవసాయానికి కరెంట్ సక్రమంగా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మెదక్ జిల్లాలో నిత్యం ఎక్కడోచోట రైతులు రోడ్డెక్కుతున్నారని వాపోయారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని మోసం చేశారని, విశ్రాంత ఉద్యోగులు, ఉద్యోగులకు ప్రభుత్వం బెనిఫిట్స్ ఇవ్వడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరుద్యోగులకు ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అధికారంలోకి రాగానే మోసం చేశారని మండిపడ్డారు. పోలీసులు లేకుండా రేవంత్‌రెడ్డి రామాయంపేట చౌరస్తాకు వస్తే ఎవరికి రుణమాఫీ అయిందో తేల్చుకుందామని సవాల్ చేశారు.
రేవంత్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలి
‘కేసీఆర్ ఏం తప్పు చేసిండని రేవంత్‌రెడ్డి తిడుతున్నడు? కేసీఆర్‌ను తిడితే దుబ్బాక ప్రజలు ఊరుకుంటరా? బూతులు మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డికి పోలింగ్ బూత్‌లో మీ ఓట్లతో బుద్ధి చెప్పాలి’ అని హరీశ్ పిలుపునిచ్చారు. అన్ని జిల్లాలు తిరుగుతున్న రేవంత్‌రెడ్డికి ఉమ్మడి మెదక్ జిల్లాకు వచ్చే ముఖం లేదని, మెదక్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదని ముఖం చాటేశాడని ఎద్దేవాచేశారు. ‘కనీసం దోమల నివారణకు ఫాగింగ్ లేదు గానీ కాంగ్రెస్ సర్కార్ మొత్తం ఫ్రాడింగ్లో మునిగింది’ అని దెప్పిపొడిచారు. దుబ్బాకలో ఓట్లు గుద్దితే రేవంత్‌కు దిమ్మ తిరుగాలని చెప్పారు. రేవంత్‌రెడ్డి హార్వర్డ్ పోయినా, అంతరిక్షానికి పోయినా ఆయన బుద్ధి మారదని ఎద్దేవాచేశారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమే మా తండ్లాట అని అన్నారు. దేవుండ్లపై ఒట్టు పెట్టి ఆ దేవుండ్లనే మోసగించిన రేవంత్‌రెడ్డికి ప్రజలో లెక్కనా?’ అని ప్రశ్నించారు. అందర్నీ మోసగించిన రేవంత్‌కు ఈ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రచార కార్యక్రమాల్లో మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతి, మున్సిపల్ మాజీ చైర్మన్లు బట్టి జగపతి, మల్లికార్జున్ గౌడ్, సురేందర్‌గౌడ్, మనోహర్‌రావు, రాజమౌళి, వెంకటనర్సింహారెడ్డి, భూమేశ్ పాల్గొన్నారు.
ఆలోచించి ఓటేయండి : హరీశ్‌రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ‘అబద్ధపు హామీలు..వికారపు మా టలు.. వికృత చేష్టలు..బండ బూతులు..ఇవి తప్ప రేవంత్ తన రెండేండ్ల పాలనలో సాధించింది గుండు సున్నా’ అంటూ హరీశ్‌రావు నిప్పులుచెరిగారు. బీఆర్ఎస్ వికాసానికి కృషి చేస్తే, కాంగ్రెస్ విధ్వంసానికి పాల్పడుతున్నదని మండిపడ్డారు. కేసీఆర్ పోరాడి రాష్ర్టాన్ని సాధించి, ప్రగతిపథంలో నడిపిస్తే, తుగ్లక్ పాలనతో రేవంత్‌రెడ్డి అధోగతి పాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది. పట్టణ ప్రజలరా.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఓటు అనే కొరడాతో కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాల్సిన బాధ్యత మీపై ఉన్నది’ అంటూ పిలుపునిచ్చారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలని, బీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించాలని విజ్ఞప్తిచేశారు. ఎన్నికల పోరులో విశేష కృషి చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.