సీఎం రేవంత్‌కు బ్యాగులపై ఉన్న నాలెడ్జ్ బేసిన్లపై లేదు. అందుకే దేవాదుల, బనకచర్ల ఎక్కడ, ఏ బేసిన్లలో ఉన్నయో తెలుస్తలేదు. దేవాదుల ఏ బేసిన్లో ఉన్నదని అధికారులను అడుగుతున్నడు. నల్లమల తెలంగాణకే చెందుతదా అంటడు.. ఇంత బాధ్యతలేని, అవగాహన లేని, సోయిలేని వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉండటం దౌర్భాగ్యం. అజ్ఞానంతో ఆయన తెలంగాణకు చేస్తున్న ద్రోహానికి ఉరి తీసినా తప్పులేదు.
2020, అక్టోబర్ 2న అప్పటి కేంద్ర జలవనరుల మంత్రికి కేసీఆర్ లేఖ రాసిండ్రు. గోదావరిలో 968 టీఎంసీలు అప్పటికే కేటాయించిండ్రు. అందులో 946 టీఎంసీలకు అన్ని అనుమతులు సాధించినం. 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నయని సీడబ్ల్యూసీ చెప్తున్నందున.. వరద జలాల్లోనూ తెలంగాణకు 1950 టీఎంసీలు కావాలని కేసీఆర్ కోరిండ్రు. మా లెక్క ఇట్లుంటే రేవంత్ మాత్రం 1000 టీఎంసీలు చాలని మన హక్కులను ఆంధ్రాకు అప్పగిస్తున్నరు. కృష్ణాలోనూ అంతే. 750 టీఎంసీల నీళ్లు రావాలని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదించినం. అడిగినంత ఇయ్యకపోతే 763 టీఎంసీల కోసం సుప్రీంకోర్టుకు పోయినం. అఫిడవిట్ దాఖలు చేసినం. ఇప్పుడు రేవంత్ కృష్ణా జలాల్లో 500 టీఎంసీలు చాలు అంటున్నడు. బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఇంత అజ్ఞానంతో ముఖ్యమంత్రే మాట్లాడితే మన వాదనకు విలువ ఉంటదా?
-హరీశ్‌రావు
హైదరాబాద్, జూన్ 19 (నమస్తేతెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ నీళ్ల ద్రోహి అని, గోదావరి, కృష్ణానీటి హక్కులను చంద్రబాబుకు ధారాదత్తం చేస్తున్నారని, గురువుకు దాసోహమంటూ రాష్ర్టానికి శఠగోపం పెడుతున్నారని ఆయన అంతులేని అజ్ఞానం.. మూర్తీభవించిన మూర్ఖత్వంతో రాష్ర్టానికి తీరని నష్టం జరుగుతున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘రేవంత్‌రెడ్డి నల్లమల పులిబిడ్డ కాదు.. వెకిలిమాటల వట్టి వెర్రిబిడ్డ’ అని దెప్పిపొడిచారు . సీఎంకు బ్యాగులపై ఉన్న నాలెడ్జ్ బేసిన్లపై లేదని, అందుకే దేవాదుల, బనకచర్ల ప్రాజెక్టులు ఏ బేసిన్లలో ఉన్నాయో ఆయనకు తెలియడం లేదని చురకలంటించారు.
రేవంత్ అజ్ఞానాన్ని అర్థం చేసుకోవచ్చు గాని, ఆయన విషపూరిత వికృతాన్ని మాత్రం అర్థం చేసుకోలేమని విమర్శించారు. మొన్న అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్ల సమావేశంలో బనకచర్లను అడ్డుకోవాలని బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర అడిగితే సూటిగా సమాధానం ఇవ్వకుండా బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టే ప్రయత్నం చేశారని, మిడిమిడి జ్ఞానంతో దేశం ముందు మన పరువుతీశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్లను ఆరు నెలల నుంచి కడుతున్నా ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూ కేంద్ర ఆర్థిక, జల్‌శక్తి శాఖల మంత్రులను కలుస్తున్నా సీఎం రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏం చేస్తున్నారని నిలదీశారు.
బనకచర్లపై తాను ప్రెస్‌మీట్ పెట్టి మొద్దునిద్ర లేపితేగాని ఉత్తమ్‌కు సోయిరాలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ తట్టిలేపిన తర్వాతే ఆయన ఢిల్లీకి పోయి దరఖాస్తు పెట్టారని చెప్పారు. బీఆర్ఎస్కు రాజకీయాలు అవసరం లేదని రాష్ట్రమే ముఖ్యమని స్పష్టంచేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, చింతా ప్రభాకర్, పార్టీ నేతలు జాన్సన్ రాథోడ్, రాకేశ్‌రెడ్డితో కలిసి తెలంగాణ భవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
సమగ్ర వివరాలతో అన్నిరకాల పత్రాలు, ఆధారాలను చూపుతూ తెలంగాణ నీటి హక్కులను కాంగ్రెస్ సర్కారు ఎలా కాలరాస్తున్నదనే విషయాలను వివరించారు. గోదావరిలో 1000, కృష్టాలో 500 టీఎంసీలు చాలు.. మిగిలిన నీళ్లు ఏపీ వాడుకున్నా ఫర్వాలేదు అని సీఎం రేవంత్‌రెడ్డి పరోక్షంగా బనకచర్ల ప్రాజెక్టుకు, ఏపీ జల దోపిడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్లను ఆరు నెలల నుంచి కడుతూ ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూ కేంద్ర ఆర్థిక, జల్‌శక్తి మంత్రులను కలుస్తుంటే సీఎం రేవంత్, నీటి పారుదల శాఖ మంత్రి ఏం చేసిండ్రు? బనకచర్లపై నేను ప్రెస్‌మీట్ పెట్టి మొద్దునిద్ర నుంచి లేపితేగాని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కు సోయి రాలేదు. రెండుసార్లు ప్రెస్మీట్లు పెట్టిన గంటల్లోనే పాత తేదీలతో లేఖలు విడుదల చేసిండ్రు. బీఆర్ఎస్ తట్టిలేపినంకనే ఆయన ఢిల్లీకి పోయి దరఖాస్తు పెట్టిండు.
-హరీశ్‌రావు
‘ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోండి.. అఖిలపక్ష సమావేశాన్ని గాంధీ భవన్‌గా మార్చకండి.. రాజకీయ వేదిక చేయకండి..అసెంబ్లీ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చెయ్యండి..అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లండి.. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సహకరిస్తుంది అని మా ఎంపీ రవిచంద్ర చెప్తే రేవంత్ పెడచెవిన పెట్టిండ్రు.. అడ్డూఅదుపూ లేకుండా అబద్ధాలను ప్రవహింపజేసిండ్రు’ అని హరీశ్ మండిపడ్డారు. ఆరు నెలల నుంచి ఆయన ఏపీ అక్రమ ప్రాజెక్టుల విషయంలో ఎంత శ్రద్ధ పెట్టిండో, ఆయనకున్న కమిట్మెంట్ ఏమిటో ఆ సమావేశంలో తెలిసిపోయిందని ఎద్దేవాచేశారు.
‘రేవంత్ కుసంస్కారి, వదురుబోతు, మాట్లాడితే సొల్లు, ఎదుటి వారిపై బురదజల్లడం ఆయన నైజం’ అని నిప్పులు చెరిగారు. ఆ మీటింగ్‌లో రాష్ట్ర ప్రయోజనాలను వదిలిపెట్టి రాజకీయ వేదికగా మార్చారని విమర్శించారు. ఆయనలా తాము తప్పుడు మాటలు మాట్లాడబోమని, ఆయనలా తాము అడ్డదారిలో రాలేదని, ఉద్యమాల నుంచి వచ్చామని, వాస్తవాలనే చెప్తామని స్పష్టంచేశారు. తెలంగాణ దోపిడీకి గురవుతుంటే బీఆర్ఎస్ సహించబోదని హెచ్చరించారు.
ఏపీ సీఎం చంద్రబాబు దయాదాక్షిణ్యాల కోసం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీలు చాలని అంటున్నారని, తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా అడుక్కొనే బుద్ధి పోలేదని హరీశ్ ఫైర్ అయ్యారు. అయినా నీళ్లు ఇచ్చేందుకు చంద్రబాబు ఎవరని, తెలంగాణకు వెయ్యి టీఎంసీలు ఆయన ఇచ్చేదేమిటని, అడుక్కోవాల్సిన దౌర్భాగ్యమెందుకు? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
‘2020, అక్టోబర్ 2న అప్పటి కేంద్ర జలవనరుల మంత్రి షెకావత్‌కు కేసీఆర్ లేఖ రాసిండ్రు. గోదావరిలో 968 టీఎంసీలు అప్పటికే కేటాయించిండ్రు.. అయితే, గోదావరి నుంచి 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సీడబ్ల్యూసీ లెక్కలు చెప్తున్నాయి..అందులో ఇదే పద్ధతిలో తెలంగాణకు 1950 టీఎంసీలు కావాలి.. ఎందుకుంటే మా హైదరాబాద్ జనాభా కోటి ఉన్నది.. 30 లక్షల మంది ఇతర రాష్ట్రాల వారున్నరు..పారిశ్రామిక, తాగునీరు, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ వాటా అడిగారు’ అని హరీశ్ గుర్తుచేశారు. కేసీఆర్ గోదావ రిలో 968 టీఎంసీలకు అనుమతులు సాధించడమే కాదు..వరద జలాల్లో మరో 1950 టీఎంసీలు కావాలని అడిగారని, మా లెక్క ఇట్ల ఉంటే రేవంత్ మాత్రం 1000 టీఎంసీలు చాలంటూ తెలంగాణ నీళ్ల హక్కులను ఆంధ్రాకు అప్పగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కృష్ణా నీళ్ల విషయంలోనూ రేవంత్ ఇదే అజ్ఞానాన్ని చాటుకుంటున్నరని హరీశ్ మండిపడ్డారు..‘కృష్ణా నది గడ్డపై పుట్టినవ్..ఆ నది పరీవాహక ప్రాంతంలో పుట్టి పెరిగినవ్.. జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన రేవంత్‌కు కృష్ణా నదిపై అవగాహన లేకపోవడం..అందులో మన వాటా తెలియకపోవడం విడ్డూరం.. ఆయన సోయి ఉండి మాట్లాడుతున్నారో? లేక అకల్ కోల్పోయి మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదు’ అని హరీశ్ మండిపడ్డారు. గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీలకు బ్లాంకెట్ ఎన్వోసీ ఇవ్వండి..మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి అని రేవంత్‌రెడ్డి మాట్లాడిన వీడియో ప్రదర్శించారు. ‘ముఖ్యమంత్రిగా ఉండి బాధ్యాతారహితంగా మాట్లాడవచ్చా? కోట్లాది మంది జీవితాలతో ఆడుకుంటూ ఇంతటి ద్రోహానికి పాల్పడ్డ రేవంత్‌ను ఉరితీసినా తప్పులేదు’ అని తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ ప్రతిపాదనలకు చంద్రబాబు సులభంగానే ఒప్పుకొంటారని చెప్పారు.
నిత్యం సమైక్య రాష్ట్రంలోనే పని బాగా జరిగిందని చెప్పడం ఒక్క రేవంత్‌రెడ్డికే సాధ్యమైందని హరీశ్ దెప్పిపొడిచారు. ‘అసలు తెలంగాణలో ఒక్క ప్రాజెక్టూ కట్టలేదని అంటుండు. సమైక్య రాష్ట్రంలోనే బాగా పని జరిగిందని అంటుండు. ఎంతసేపూ చంద్రబాబు ఆలోచనలకెళ్లి బయటకు రావడం లేదు. 2004-14 వరకు కాంగ్రెస్, ఆ తర్వాత బీఆర్ఎస్ ఉన్నది. అప్పుడు సీఎంగా ఉన్న వైఎస్ జలయజ్ఞం మొదలుపెడితే టీడీపీలో ఉన్న రేవంత్‌రెడ్డి.. అది జలయజ్ఞం కాదు.. ధనయజ్ఞం అని పొల్లుపొల్లు తిట్టిండు. సోనియా గాంధీని బలి దేవత అన్నడు.. ఇప్పుడేమో ఆమెను దేవత అంటున్నడు. ఇక ఆయన నోటికి మొక్కాలె’ అని హరీశ్ ఎద్దేవాచేశారు.
కేసీఆర్ పాలనలో గోదావరిపై 968 టీఎంసీల ప్రాజెక్టులకు రూపకల్పన జరిగింది. 946 టీఎంసీలకు సీడబ్ల్యూసీ హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చింది. వార్ధా, తమ్మిడిహట్టికి సంబంధించి 20 టీఎంసీలకు కూడా సూత్రప్రాయంగా అనుమతులిచ్చేందుకు ఒప్పుకొన్నది.. సీఎం మాత్రం అవగాహనారాహిత్యంతో రాజకీయాలు మాట్లాడిండ్రు. సీఎంకు తెలియకుంటే పక్కనున్న ఉత్తమ్‌కుమార్ కూడా చెప్పలేదాయె! ఈయనకు తెలియదాయె..ఆయన చెప్పడాయె.
-హరీశ్‌రావు
2004-14 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో 6.64 లక్షల ఎకరాల ఆయకట్టుకే నీరందినట్టు హరీశ్ చెప్పారు. అదే 2014- 23 మధ్య బీఆర్ఎస్ హయాంలో రెండేండ్లు కరోనాను మినహాయించినా 48.74 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు వచ్చాయని గుర్తుచేశారు. ఇది నక్కకు నాకలోకానికి ఉన్నం త తేడా అని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో 5.71 లక్షల కొత్త ఆయకట్టు వస్తే.. 93 వేల ఎకరాల స్థిరీకరణ జరిగిందని తెలిపారు. అదే బీఆర్ఎస్ హయాం లో 17.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వస్తే 31.50 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగిందని, మొత్తంగా మూడు రెట్లు పెంచామని, అవి తాను చెప్తు న్న లెక్కలు కాదని, ఇరిగేషన్ శాఖ ఇచ్చిన రిపోర్టు అని తెలిపారు.
‘గోదావరిపై మన హక్కును, నీళ్లను కాపాడుకోవాలని గోదావరి మీద కేసీఆర్ అనేక ప్రాజెక్టులు కట్టారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క శ్రీరాంసాగర్ తప్ప ఏదీ పూర్తికాలేదు. కేసీఆర్ వచ్చాక సదర్మాట్ కట్టిండ్రు. అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లిని కట్టి, నీళ్లు నింపిండ్రు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ, సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్ వంటివి గోదావరిపై కట్టిండ్రు. మన జలహక్కులను కాపాడిండ్రు. ప్రాజెక్టులకు హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చిండ్రు’ అని గుర్తుచేశారు.
తెలంగాణలోని ప్రాజెక్టులు బీఆర్ఎస్ హయాంలోనే ఊపిరిపోసుకున్నాయని హరీశ్ తెలిపారు. ‘తుమ్మిళ్ల ఎత్తిపోతలు పూర్తికాలేదా? భక్తరామదాసు ద్వారా నీళ్లు అందించలేదా? మిడ్ మానేరు కట్టలేదా? శ్రీరాంసాగర్ రెండోదశ కాల్వలు పూర్తి చేయలేదా? కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ పూర్తిచేసి 6.50 లక్షల ఎకరాలకు నీళ్లివ్వలేదా? ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పూర్తిచేయలేదా? బాగారెడ్డి సింగూరు కాల్వలు పూర్తి చేయలేదా? కిన్నెరసాని కాల్వలు పూర్తి చేయలేదా? గొల్లవాగు, మత్తడి వాగు, పాలెంవాగు, ర్యాలీ వాగు, గడ్డెన్న, సుద్దవాగు, చౌటుప్పల్ హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం, గూడెం ఎత్తిపోతల పథకం, బేతుపల్లి వరద కాల్వ, గట్టుపొడ్చిన వాగు పూర్తి చేయలేదా? సమ్మక్కసాగర్ బరాజ్ కట్టి దేవాదులకు సంవత్సరం పాటు నీళ్లివ్వలేదా? చనాక-కొరాట బరాజ్‌ను ఆదిలాబాద్‌లో కట్టలేదా? ఇవ్వన్నీ నీకు కనపడకపోతే ఏం చెయ్యాలె రేవంత్‌రెడ్డీ’ అంటూ హరీశ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
దేవాదుల ఏ బేసిన్లో ఉన్నది కూడా సీఎం రేవంత్‌కు తెలియడం లేదు. సామాన్య రైతునో, స్కూల్ పిల్లాడినో అడిగినా దేవాదుల గోదావరిపై ఉన్నదని చెప్తరు. వారికున్న జ్ఞానం కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు.. బనకచర్ల విషయంలోనూ ఇదే అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నరు.. బూతులు తెలుసుకున్నంత సులువు కాదు..బేసిన్ల గురించి తెలుసుకోవడం.. చిల్లర మాటలతో రాష్ట్ర ప్రజల ముందు పరువు తీసుకున్నవ్.
-హరీశ్‌రావు
తమ్మిడిహట్టి నుంచి గ్రావిటీతో ఎల్లంపల్లికి నీళ్లు వస్తయని సీఎం చెప్పడంపై హరీశ్ విస్మయం వ్యక్తం చేశారు. ‘వీళ్లకు అసలు ఏం జెప్పాల్నో అర్థమైతలేదు. ఎక్కడి కథ ఇది? తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు రావాలంటే రెండు లిఫ్టులు ఉంటయి. 1వ లిఫ్టు 74వ కిలోమీటరు దగ్గర 29 మీటర్ల లిఫ్టు.. 2వ లిఫ్టు 92వ కిలోమీటరు దగ్గర 19 మీటర్ల లిఫ్టు ఉన్నది. గ్రావిటీతో నీళ్లు వస్తాయని రేవంత్ అంటున్నరు. నువ్వు కొత్తవాడివి కూడా కాదు.. ఇంకెప్పుడు నేర్చుకుంటవు? ఏడాదిన్నర అయినా నీ అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటూనే ఉంటె ఎట్ల? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు ఎటు మాట్లాడినా చెల్లింది. ఇప్పుడు నువ్వొక ముఖ్యమంత్రివి. బాధ్యతగల వ్యక్తివి. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవ్. మాట్లాడేటప్పుడు ఆచితూచి, ఒకటికి రెండుసార్లు చూసుకొని మాట్లాడాలి మిస్టర్ రేవంత్‌రెడ్డీ’ అంటూ హరీశ్ హితవు పలికారు.
‘ప్రాణహిత దగ్గర అంత పనిచేసినం, ఇంతపని చేసినం.. ప్రాణహిత కడితే అయిపోతుండె’ అని ఇప్పుడు రేవంత్‌రెడ్డి అనడం విడ్డూరంగా ఉన్నదని హరీశ్‌రావు దుయ్యబట్టారు. అదే ప్రాణహిత గురించి ఇదే రేవంత్‌రెడ్డి 2014 అసెంబ్లీలో పలికిన మాటలను ఆయన మీడియాకు విపిపించారు. ‘ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. నీటి పారుదలలో ఆంధ్రాకు 31,360 కోట్లు ఖర్చుపెడితే.. రాయలసీమకు 25,855 కోట్లు, తెలంగాణకు 44,150 కోట్లు అని చెప్పారు. 1960లో ఖర్చు చేసిన వేల కోట్లకు, ఈనాటి వేల కోట్లకు సమానమా అధ్యక్షా? ఆయనే ఒక వెయ్యి కోట్లు పెడితే.. నాగార్జునసాగర్ కట్టి ఉండొచ్చు. ఈరోజు 5 వేల కోట్లు ప్రాణహిత-చేవెళ్లలో ఖర్చు పెడితే.. కనీసం గ్రావెల్స్ కూడా వైదొలగలేదు.
మట్టి కూడా పక్కన పొయ్యలేదు అంటే తెలంగాణలో ఖర్చు చేసిన వేలకోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్లినయో ఆలోచించాల్సిన అవసరం, బాధ్యత లేదా? అధ్యక్షా?’ అని 2014 అసెంబ్లీలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలను హరీశ్ మీడియాకు వినిపించారు. నాడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమని, నాడు రూ.4000 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్స్, సర్వేల పేరుతో కాంగ్రెస్ నేతలు ఎత్తుకున్నారని తెలిపారు. ‘ఆ రోజు ఆ 4 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయని అన్నవు.. ఇప్పుడేమో ప్రాజెక్టులను పడావు పెట్టింది బీఆర్ఎస్ అంటున్నవు.
కాంగ్రెస్ పార్టీయే ప్రాజెక్టులను పూర్తి చేసిందని, బాగా పనిచేసిందని, బీఆర్ఎస్ పదేండ్లలో ఏమీ చేయలేదని అనడం నీ ఆత్మ వంచనకు పరాకాష్ఠ కాదా? ఇది ఆత్మవంచన కాదా? ఏ రోటికాడ ఆ పాట పాడుతవా? ఏది పడితే అదే మాట్లాడుతవా? ఆ రోజు కాంగ్రెస్సే పైసలు మెక్కింది, మింగింది అన్నవ్.. ఇప్పుడేమో కాంగ్రెస్ చేసింది అంటున్నవు. బీఆర్ఎస్ ఏమీ చేయలేదంటున్నావు.. అది నోరా మోరా? మాట్లాడేముందు ఆలోచన చేయాలి కదా’ అంటూ హరీశ్ నిప్పులు చెరిగారు.
తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీతో ఎల్లంపల్లికి నీళ్లు వస్తయని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉన్నది. వీళ్లకు అసలు ఏం జెప్పాల్నో అర్థమైతలేదు. ఎక్కడి కథ ఇది? తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు రావాలంటే రెండు లిఫ్టులు ఉంటయి. 1వది 74వ కిలోమీటరు దగ్గర 29 మీటర్ల లిఫ్టు.. 2వది 92వ కిలోమీటరు దగ్గర 19 మీటర్ల లిఫ్టు. మరి గ్రావిటీతో నీళ్లు వస్తయని ఎట్లంటున్నవ్ రేవంత్?. నువ్వు కొత్తవాడివి కాదు.. ఇంకెప్పుడు నేర్చుకుంటవు? ఏడాదిన్నర అయినా నీ అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటూనే ఉంటె ఎట్ల?
–హరీశ్‌రావు
రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే పదేండ్లు తాము ప్రాజెక్టులను కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీకి అప్పజెప్పకుండా కృష్ణా నదిలో ట్రిబ్యునల్ అవార్డు పూర్తయ్యే వరకూ, మన వాటా తేలే వారకూ పోరాడామని హరీశ్ గుర్తుచేశారు. తాము ప్రాజెక్టులు అప్పజెప్పేది లేదని ఆరోజుల్లోనే తెగేసి చెప్పినట్టు తెలిపారు. కానీ, కాంగ్రెస్ అధికారంలో వచ్చాక 2024, జనవరి 17న రెండు రాష్ర్టాల ఇరిగేషన్ సెక్రటరీలు, రెండు రాష్ర్టాల ఈఎన్సీలు పాల్గొని ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇస్తూ సంతకాలు చేశారని చెప్పారు. పదేండ్లు బీఆర్ఎస్ ఆపిందని, కానీ వారంలో ప్రొటోకాల్ పూర్తి చేస్తామని, నెల రోజుల్లో ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి అప్పగిస్తామని కాంగ్రెస్ చెప్పినట్టు గుర్తుచేశారు.
అదే సమయంలో కేసీఆర్ గర్జించి.. నల్లగొండలో సభ పెట్టినట్టు తెలిపారు. ‘బిడ్డా నువ్ ఎట్లా అప్పజెప్తవ్?’ అని హెచ్చరించారని గుర్తుచేశారు. ‘కృష్ణాలో మన వాటా తేలలేదని పోరాటం చేస్తే.. నాల్కగర్సి అందతా తూచ్ అని అసెంబ్లీలో చెప్పిండు. తీర్మానం చేసిండు, లేఖ రాసిం డు. కేసీఆర్ పోరాడితే, బీఆర్ఎస్ ప్రశ్నిస్తే చేసిండే తప్ప.. మరొకటి కాదు. నాడు ప్రాజెక్టులను కాపాడుకున్నది ప్రతిపక్షంలో బీఆర్ఎస్సే. అధికారంలో పదేండ్లు కాపాడినం. అధికారంలో నువ్ తప్పు చేస్తే నిన్ను ప్రశ్నించి, నీ మెడలు వంచి, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతం’ అని హరీశ్ దుయ్యబట్టారు.
తెలంగాణ కోసం తాము ఎన్నో ఏండ్ల పాటు పేగులు తెగేదాకా కొట్లాడామని హరీశ్ గుర్తుచేశారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కోసం జలపోరాటం చేశామని చెప్పారు. ‘ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్ నాయకత్వంలో మేమందరం బ్రిగేడియర్లుగా ఒక్కొక్కరం ఒక్కో మండలంలో తెలంగాణ కోసం పోరాటం చేసినోళ్లం. తెలంగాణ ప్రజలకు చుక్క చుక్క మీద, నదుల మీద, బేసిన్ల మీద అవగాహన కల్పించి, మన హక్కుల మీద ప్రజలను సమాయత్తం చేసి, పోరాటానికి సిద్ధం చేసింది కేసీఆర్. నీకు బేసిన్ తెల్వదు, ఏమీ తెల్వదు. కేసీఆర్ తెలంగాణ సాధకుడు.
నీళ్ల విలువ తెల్సినోడు’ అంటూ హరీశ్ వివరించారు. పోతిరెడ్డిపాడు అక్రమంగా కడుతుంటే ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నాడు పోరాడింది కేసీఆర్ అని గుర్తుచేశారు. ‘రాష్ట్ర క్యాబినెట్ నుంచి ఆరుగురు మంత్రులకు కేసీఆర్ ఒక్క ఫోన్ చేస్తే.. ఆరుగురు మంత్రులం రాష్ట్ర నీళ్ల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పదవులను గడ్డిపోచల్లా వదులుకున్నం. రాజీనామా చేసినం. ఆ చరిత్ర మాది.. జిరాక్స్ కాగితాలు ఇచ్చిన ద్రోహ చరిత్ర నీది. నీ వెర్రి మాటలతో, పిచ్చి కూతలతో, చరిత్రను మకిలిపర్చలేవు మిస్టర్ రేవంత్‌రెడ్డీ.
చరిత్రలో ఎప్పటికైనా తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులం మేము.. తెలంగాణ కోసం వెన్నుపోటు పొడిచిన ద్రోహివి నువ్వు. నాటి నుంచి నేటి వరకు నీది ద్రోహ చరిత్రనే. ఆ నాడు ఉద్యమంలో ద్రోహం చేసినవ్.. ఈరోజు నీళ్ల విషయంలో తెలంగాణకు ద్రోహం చేసున్నవ్’ అంటూ హరీశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రాష్ట్రం ప్రయోజనాల విషయంలో చిత్తశుద్ధితో కృషి చేస్తే తాము సహకరిస్తామని, లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్తుందని స్పష్టంచేశారు.
గోదావరి వరద జలాల్లో 1951 టీఎంసీలు కావాలని, కృష్ణాలో 750 టీఎంసీలు కావాలని గతంలో కేసీఆర్ డిమాండ్ చేసిండ్రు. కృష్ణాలో వాటాల గురించి బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించిండ్రు.. పాదయాత్ర చేసి నాగర్జునసాగర్ ఎడమ కాల్వ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే చూసేలా కృషిచేసిండ్రు.
-హరీశ్‌రావు
కృష్ణా జలాల్లో 299 టీఎంసీల వాటాకు బీఆర్ఎస్ ఒప్పుకొన్నదని సీఎం రేవంత్ బద్నాం చేస్తున్నారని హరీశ్ చెప్పారు. ప్రాజెక్టులు నిర్మించకుండా కాంగ్రెస్ చేసిన పాపానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సూచనల మేరకు 299 టీఎంసీలకు తాత్కాలిక ఒప్పందం మాత్రమే చేసుకున్నామని గుర్తుచేశారు. ఆ తర్వాత కృష్ణాలో నీటి హక్కుల కోసం అధికారం చేపట్టిన తొలి నెల నుంచే పోరాడిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. ఆర్డీఎస్, సాగర్ ఎడమకాల్వ కోసం పాదయాత్ర చేశారని చెప్పారు. ఆయన ఒత్తిడితోనే సమైక్యాంధ్ర ప్రభుత్వం దిగొచ్చి సాగర్ ఎడమ కాల్వ లిఫ్ట్‌ల నిర్వహణకు ఒప్పుకొన్నదని గుర్తుచేశారు.
సుప్రీంకోర్టుకు వెళ్లి సెక్షన్-3ని సాధించిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్‌దేనని స్పష్టంచేశారు. అణువణువూ, క్షణక్షణం నీళ్ల కోసం తపించిన వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. ‘పోలవరం ద్వారా 80 టీఎంసీల్లో 45 టీఎంసీలు, 75 శాతం ప్రాజెక్టుల డిపెండబులిటీ కింద 555 టీఎంసీలు, సగటున 120 టీఎంసీలు, 65 డిపెండబిలిటీ కింద 43 టీఎంసీలు, పోలవరం నుంచి వాటర్ డైవర్షన్ కింద 45 టీఎంసీలు, మొత్తంగా కృష్ణా బేసిన్లో 763 టీఎంసీల నీళ్లు రాబట్టాలని లాయర్లకు సూచించారు.
కానీ రేవంత్‌రెడ్డి బేసిక్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నరు.. గోదావరి, కృష్ణా జలాలు మీ అయ్య సొమ్ము అనుకుంటున్నవా? తెలంగాణకు నువ్వు కాపలాదారువు మాత్రమే.. రాష్ట్ర జల హక్కులను ఆంధ్రాకు రాసిస్తా అంటే ప్రజలు ఊరుకోరు..చంద్రబాబు అడుగులకు మడుగులొత్తితే సహించబోరు’ అని హెచ్చరించారు. నాడు రాయలసీమ అక్రమ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడిన తెలంగాణ వాళ్లను జైల్లో వేస్తామని హెచ్చరించిన వ్యక్తి ఆదిత్యనాథ్‌ను సీఎం రేవంత్ సలహాదారుగా పెట్టుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
అజ్ఞానంతో, అనుభవలేమితో కేసీఆర్‌పై దుమ్మెత్తిపోయడం తప్ప ఏడాదిన్నరలో కాంగ్రెస్ సర్కారు సాధించిందేమీలేదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో గోదావరిపై 968 టీఎంసీల ప్రాజెక్టులకు రూపకల్పన జరిగిందని, అందులో 946 టీఎంసీలకు సీడబ్ల్యూసీ హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చిందని చెప్పారు. వార్ధా, తమ్మిడిహట్టికి సంబంధించి 20 టీఎంసీలకు కూడా సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చేందుకు ఒప్పుకున్నదని గుర్తుచేశారు. ‘ఈ విషయాన్ని మీ ఇంజినీర్ సుబ్రహ్మణ్య ప్రసాద్ కూడా తన ప్రజెంటేషన్‌లో చెప్పిండ్రు. సీఎం మాత్రం అవగాహనారాహిత్యంతో రాజకీయాలు మాట్లాడిండ్రు’ అని మండిపడ్డారు. గోదావరి వరద జలాల్లో 1951 టీఎంసీలు కావాలని, కృష్ణాలో 750 టీఎంసీలు కావాలని కేసీఆర్ గతంలోనే డిమాండ్ చేశారని, కృష్ణాలో వాటాల గురించి బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించారు.. పాదయాత్ర చేసి నాగర్జునసాగర్ ఎడమ కాల్వ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే చూసుకునేలా కృషి చేశారని గుర్తుచేశారు.
దేవాదుల ఏ బేసిన్లో ఉన్నది కూడా సీఎం రేవంత్‌కు తెలియడం లేదని, సామాన్య రైతును, స్కూల్ పిల్లాడిని అడిగినా దేవాదుల గోదావరిపై ఉన్నదని చెప్తారని హరీశ్ చురకలంటించారు. రేవంత్‌రెడ్డి బూతులు తెలుసుకున్నంత సులువు కాదు..బేసిన్ల గురించి తెలుసుకోవడం అని దెప్పిపొడిచారు. ‘ఇగ ఈయన ఇట్లుంటే ఆయన సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్ కూడా బనకచర్ల ఎక్కడున్నదంటే ప్రకాశం జిల్లాలో ఉన్నదంటున్నరు. అసలు ఆ ప్రాజెక్టు ఉన్నది పాత కర్నూలు జిల్లాలోని నంద్యాలలో..దున్నపోతు ఈనిందంటే దుడ్డెను కట్టెయ్యమన్నట్టు ముఖ్యమంత్రి తీరు ఉన్నది. ఆయనకన్నా ఆయన సలహాదారుడు అంతకంటే ఘనుడు’ అని ఎద్దేవాచేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సుమారు 19 నెలలు అవుతున్నదని, ఇన్ని నెలల్లో రేవంత్‌రెడ్డి ఏం చేశారని హరీశ్ ప్రశ్నించారు. ‘19 నెలల్లో ఒక ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసినవా? ఒక చెరువు కట్టినవా? ఒక్క చెక్‌డ్యాం కట్టినవా? ఒక్క ఎకరానికి నీళ్లిచ్చినవా? చెప్పు మిస్టర్ రేవంత్‌రెడ్డీ’ అంటూ నిలదీశారు. ‘పెద్దవాగు కొట్టుకుపోయింది, ఎస్ఎల్బీసీ కూలిపోయింది. పాలమూరులో వట్టెం పంపు మునిగింది. కూలగొట్టినవ్, మునగ్గొట్టినవ్.. తెగ్గొట్టినవ్. పెద్దవాగు తెగ్గొట్టినవ్.. ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను కూలగొట్టినవ్, వట్టెంను మునగ్గొట్టినవ్? ఇంతకు మించి నువ్వు చేసిందేంది? ఏదో పీకి, పొడిచినట్టు మాట్లాడుతున్నవ్? నోరు తెరిస్తే అబద్ధాలే’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
‘నిన్ను ప్రశ్నిస్తే సిగ్గు లేకుండా పైశాచికం అంటున్నవు. నువ్వు క్షమాపణ చెప్పాలె. నీ తొందరపాటు తనం, ఆగమాగం చర్యల వల్ల, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎస్ఎల్బీసీ కుప్పకూలింది. అది కుప్పగూలిపోవడానికి కాంగ్రెస్‌పార్టీ కారణం, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వైఫల్యమిది. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ రాజీనామా చేయాలి’ అని హరీశ్ డిమాండ్ చేశారు. ‘ఆ ప్రాజెక్టు ఏంటో అర్థంకాదు. ఆ టన్నెల్ బోర్ మిషన్ లోపలికి పోదు.. బయటికి రాదు. దాని ఉపయోగం ఎలా? ఆ ప్రాజెక్టుపై ఇప్పటికే 4 వేల కోట్లు ఖర్చు చేసినం. అదంతా ఏం కావాలో అర్థం కాని పరిస్థితి. ఉల్టా బుకాయిస్తున్నడు. తప్పిదాన్ని కప్పి పుచ్చుకోవడానికి బీఆర్ఎస్పై నిందలేస్తుండు. కూలింది మీ కాలంలో కాదా? మీ తొందరపాటు వల్ల కాదా? జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కాదా? ఇప్పటికీ శవాల ఆనవాళ్లు కూడా బయటికి రాలేదు. ఇప్పటికీ నీకు సోయిలేదు. దొంగే దొంగా దొంగా అన్నట్టు ఉన్నది నీ యవ్వారం’ అంటూ హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మిస్టర్ రేవంత్‌రెడ్డీ.. నీళ్ల హక్కులను రాసిచ్చేందుకు తెలంగాణ ఏమైనా నీ జాగీరా? నువ్వేమైనా రాజువా? ఇన్ని టీఎంసీలే చాలని చెప్పే హక్కు నీకు ఎక్కడిది? ఇది ప్రజాస్వామ్యం.. స్టేట్ ఆఫ్ తెలంగాణ.. హూ ఆర్ యూ?..తెలియకుంటే తెలుసుకొని మాట్లాడు..అంతేతప్ప ఇష్టమొచ్చినట్టు చెప్పి తెలంగాణను ముంచకు.. నీ మూర్ఖత్వం వల్ల రాష్ట్రం నష్టపోయే ప్రమాదమున్నది.
-హరీశ్‌రావు
‘పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 66:34 రేషియోలో ఏ రోజూ నీళ్లను తక్కువగా వాడుకోలేదు. కానీ మొన్న కాంగ్రెస్ అధికారంలో వచ్చాక కృష్ణాకు మంచిగా నీళ్లు వచ్చాయి. వీళ్ల చేతగాని తనం వల్లనో, చంద్రబాబుకు భయపడో, గురు దక్షిణ కిందనో తెలియదు గాని, మనకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 34 శాతం నీళ్లు వాడుకునే అవకాశం ఉంటే.. కేవలం 28 శాతం మాత్రమే ఈ రాష్ట్రం వాడింది’ అని నీటి వినియోగంపై సీఎం రేవంత్‌రెడ్డి కుట్రను హరీశ్ బయటపెట్టారు. 2014 నుంచి 2023 వరకూ ఎప్పుడూ ఇంత తక్కువగా వాడుకోలేదని చెప్పారు.
‘2024-25లోనే చాలా తక్కువగా కాంగ్రెస్ పాలనలోనే వాడారు. ఇది మీ వైఫల్యం కాదా? దీనికి సమాధానం చెప్పవెందుకు? ఇది మీ చేతకాని తనం కాదా? ఎందుకు ఇంత అతి తక్కువ నీటిని తెలంగాణ వినియోగించింది. దీనికి సమాధానం చెప్పండి?’ అంటూ నిలదీశారు. ‘అటు ఎస్ఎల్బీసీ కుప్పకూలిపోతది, పెద్దవాగు తెగిపోతది, వట్టెం మునిగిపోతది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తవ్. ఉన్న కృష్ణావాటాలో తక్కువగా వాడి, 65 టీఎంసీలు ఏపీకి పంపుతవ్.
ఏపీకి పంపిన నీళ్లతో 6.50 లక్షల ఎకరాలకు నీళ్లు పారించవచ్చు. మరోవైపు నీళ్లు లేవని, రెండో పంటకు నెట్టెంపాడు కింద క్రాఫ్ హాలిడే ప్రకటిస్తవ్.. నీళ్లు ఉంటేనే కిందికి వదులుతవ్.. నీ సొంత మహబూబ్‌నగర్ జిల్లాకు క్రాఫ్ హాలిడే ప్రకటిస్తవ్. ఇదీ నీ అసమర్థత’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఎస్ఆర్బీసీ రైట్ మెయిన్ కెనాల్‌కు లైనింగ్ అవుతున్నదని హరీశ్ చెప్పారు. అయితే, కేసీఆర్ ఉన్నప్పుడు దానికి లైనింగ్ ఆపించారని గుర్తు చేశారు. ‘ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ మొదలైంది. దాని లైనింగ్ మొదలైతే ఇప్పుడు రోజుకు 40 వేల క్యూసెక్కుల నీళ్లు తీసుకొని పోతారు. అదే పూర్తయితే రేపు 90 వేల క్యూసెక్కుల నీళ్లు తీసుకొని పోతారు. దానిని ఆపాల్సిన బాధత్య రేవంత్‌రెడ్డికి లేదా? దాన్ని కూడా మేమే గుర్తు చేయాలా? దానిమీద నువ్వు స్పందించవెందుకు? నాడు కేసీఆర్ పోరాటం చేసి ఆ పనులు ఆపించిండ్రు. రేవంత్ రాగానే ఆ పనులు ముమ్మరంగా ఎందుకు నడుస్తున్నయి? ముందు దానిమీద దృష్టిపెట్టు’ అంటూ చురకలంటించారు.
కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నాయని హరీశ్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగితే.. మూడో రోజే ఎన్డీఎస్ఏ వచ్చిందని, అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికలకు మధ్యంతర నివేదిక, మా పార్టీ సిల్వర్ జూబ్లీ జరుపుకొంటే తుది నివేదిక వచ్చిందని చెప్పారు. ‘ఎస్ఎల్బీసీ కూలిపోయి దాదాపు 4 నెలలు అవుతున్నది. ఎన్డీఎస్ఏ ఎందుకు వస్తలేదు? ఎందుకో నివేదిక ఇస్తలేదు? రెండు పిల్లర్లు కుంగితే రెండొద్దులకే వచ్చి, మూడొద్దులకే రిపోర్టు ఇచ్చినవు. ఇప్పుడెందుకు ఎన్డీఎస్ఏ రాదు? బీజేపీ పంపదెందుకు? రిపోర్టు ఎందుకు ఇవ్వదు?’ అని హరీశ్ నిలదీశారు. ఎస్ఎల్బీసీ కుప్పకూలి దాని భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని, ఇంకా రేవంత్‌రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడున్నారని, పైగా బీఆర్ఎస్ వాళ్లే పైశాచిక ఆనందం పొందుతున్నారని అనడం గర్హనీయమని మండిపడ్డారు.