సంగారెడ్డి జూన్ 21 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో కేడీల రాజ్యం.. బేడీల రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. రైతులకు బేడీలు వేసి, జైళ్లలో పెట్టి వారి ఆత్మగౌరవాన్ని రేవంత్ దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుకు బేడీలు వేస్తున్న రేవంత్‌రెడ్డికి ప్రజలు, రైతులు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని రెండు లక్షల మంది రైతులకు రైతుభరోసా డబ్బులను నిలిపివేయడం దారుణమని మండిపడ్డారు. వెంటనే రైతుభరోసా డబ్బులు వేయకుంటే ఓఆర్ఆర్ దిగ్బంధించి వంటావార్పు చేస్తామని హెచ్చరించారు.
లగచర్లలో గిరిజన రైతులకు, ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకించిన రైతులకు రేవంత్ సర్కార్ బేడీలు వేసి జైలులో వేసింది. రైతులకు బేడీలు వేయడమే రైతు రాజ్యమా? దేశానికి అన్నంపెట్టే రైతుల చేతులకు బేడీలు వేసిన రేవంత్‌రెడ్డికి రైతులు గుణపాఠం చెప్పాలి.
– హరీశ్‌రావు
రాష్ట్రంలోని అన్ని సర్వేలన్నీ బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్తున్నాయని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ రైతులకు రైతుభరోసా డబ్బులు నిలిపివేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిన్నారంలో రైతు ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ధర్నాలో పాల్గొన్న ఆయన రైతులనుద్దేశించి ప్రసంగించారు. రైతులపై రేవంత్ పగబట్టారని అన్నారు.
రెండు లక్షల మంది రైతులకు రైతుభరోసా కోత పెట్టడమే కాకుండా కేసీఆర్ కిట్, న్యూట్రిషన్కిట్, ఫీజు రీయంబర్స్మెంట్, పెన్షన్లకు కోతలు పెట్టారని ఆరోపించారు. అందుకనే ఆయనను కోతల రేవంత్‌రెడ్డి అంటున్నామని చెప్పారు. ఇలా అన్నందుకు తమపై కేసులు పెడతారేమోనని అనుమానం వ్యక్తంచేశారు. కేసీఆర్ నాట్లకు నాట్లకు మధ్య రైతుబంధు వేస్తే రేవంత్‌రెడ్డి ఓట్లకు ఓట్లకు మధ్య రైతుభరోసా డబ్బులు జమచేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఎంపీ ఎన్నికలకు ముందు ఒకసారి రైతుభరోసా వేశారని, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మరోమారు రైతుభరోసా డబ్బులు వేశారని విమర్శించారు. రెండు దఫాలుగా ఎగ్గొట్టిన రైతు భరోసా డబ్బులు కూడా వేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని, లేదంటే గుణపాఠం చెప్పాలని రైతులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏ సర్వే చూసినా కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తారని చెప్తున్నాయని తెలిపారు. బీఆర్ఎస్, కేసీఆర్ పేరు ఎత్తకుండా రేవంత్‌రెడ్డి ఎక్కడా ఉపన్యసించడం లేదని, ఆయనకు కూడా మళ్లీ గులాబీ జెండా వస్తుందని అర్థమైందని పేర్కొన్నారు. రేవంత్‌కు నిద్రలో కూడా కేసీఆరే యాదికి వస్తున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ నాట్లకు నాట్లకు మధ్య రైతుబంధు వేస్తే రేవంత్‌రెడ్డి ఓట్లకు ఓట్లకు మధ్య రైతుభరోసా డబ్బులు జమచేస్తున్నారు. అప్పట్లో ఎంపీ ఎన్నికలకు ముందు ఒకసారి రైతుభరోసా వేస్తే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మరోమారు రైతుభరోసా డబ్బులు వేశారు.
– హరీశ్‌రావు
లగచర్లలో గిరిజన రైతులకు, ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకించిన రైతులకు రేవంత్ సర్కార్ బేడీలు వేసి జైలులో వేసిందని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు బేడీలు వేయడమే రైతు రాజ్యమా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో రైతురాజ్యం నడిచిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేసీఆర్ రైతులకు రైతుబంధు ద్వారా నగదు బదిలీ చేశారని, ఉచిత కరెంటు, రైతురుణమాఫీ, రైతుబీమా లాంటి ఎన్నో పథకాలు అమలు చేశారని వివరించారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్‌రంగం ఆకాశాన్ని తాకిందని, ఇప్పుడు పిల్లల పెండ్లి కోసం, దవాఖాన ఖర్చుల కోసం ఆపదలో భూములు అమ్ముకుందామంటే కొనేందుకు ఎవ్వరూ ముందుకురావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్ పాలనలో రైతు పతారా ఖతమైందని ధ్వజమెత్తారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్‌రంగం ఆకాశాన్ని తాకింది. ఇప్పుడు పిల్లల పెండ్లి కోసం, దవాఖాన ఖర్చుల కోసం, ఆపదలో భూములు అమ్ముకుందామంటే కొనేందుకు ఎవ్వరూ ముందుకురావడం లేదు.
-హరీశ్‌రావు
రేవంత్‌రెడ్డి సీఎం కుర్చీ పరువు తీస్తున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేవారు. మిల్లెట్స్‌కు, పప్పుధాన్యాలకు ఆయనకు తేడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రసంగించిన రేవంత్‌రెడ్డి కందులు, పెసర్లు మిల్లెట్స్ అని చెప్పడంతో విద్యార్థులు విస్తుపోయారని చెప్పారు. బేసిన్ల గురించి కూడా రేవంత్‌రెడ్డికి తెలియదని, ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో దేవాదుల ఏ బేసిన్లో ఉంది? బనకచర్ల ఏ బేసిన్లో ఉంది? నల్లమల్ల ఎక్కడ ఉందంటూ పరువుతీశారని మండిపడ్డారు. ఇటీవల తనకు జ్వరం వస్తే రేవంత్‌రెడ్డి విమర్శలు చేయడం విడ్డూరంగా అనిపించిందని పేర్కొన్నారు. తనపై ఎత్తుపైనా రేవంత్‌రెడ్డి అప్పుడప్పుడూ వ్యాఖ్యలు చేస్తారని తెలిపారు.
‘నువ్వుపొట్టిగా ఉన్నందుకు నేనేమి చేయాలి రేవంత్.. నిన్ను గుంజినా పెద్దగా కావు’ అని ఎద్దేవా చేశారు. ధర్నాలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర నాయకులు ఎర్రొళ్ల శ్రీనివాస్, పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, బీఆర్ఎస్ జిల్లా నేతలు జైపాల్‌రెడ్డి, మఠం బిక్షపతి, రాధాకృష్ణశర్మ, వెంకటేశ్‌గౌడ్, ప్రకాశ్‌చారి, బాల్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మెట్టుకుమార్, శ్రీకాంత్‌గౌడ్, సోమిరెడ్డి, అంజయ్యయాదవ్, రాములుగౌడ్ పాల్గొన్నారు.
జిన్నారం రైతు ధర్నాలో పుష్ప 2 సినిమాలోని ‘రప్ప..రప్ప’ డైలాగ్‌లతో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రదర్శించిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావుకు స్వాగతం పలుకుతూ జిన్నారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. వీటిలో కేసీఆర్, కేటీఆర్‌తోపాటు హరీశ్‌రావు ఫోటోలు ఉన్నాయి. ఫోటోల దిగువన ‘2028లో రప్ప..రప్ప 3.0 లోడింగ్’ అనే డైలాగులు ముద్రించారు. బాలగౌని సాయిచరణ్‌గౌడ్ చేయించిన ఈ ఫ్లెక్సీలు ముద్రించారు.