హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): హైడ్రా పేరిట సర్కార్ పెద్దలు దందాలకు పాల్పడుతున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పెద్దోళ్లకు దాసోహమవుతున్న హైడ్రా.. పేదలపై ప్రతాపం చూపుతున్నదని ధ్వజమెత్తారు. నిర్దాక్షిణ్యంగా పేదల గూడుపైకి బుల్డోజర్లు పంపడం దుర్మార్గమని మండిపడ్డారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశించిందంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నదని వ్యాఖ్యానించారు. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైడ్రాను బీఆర్ఎస్ వ్యతిరేకించడంలేదని.. కానీ దాన్ని బూచిగా చూపి అక్రమాలకు పాల్పడడాన్ని మాత్రమే తప్పుబడుతున్నామని స్పష్టంచేశారు. హైడ్రాతో లక్షల కోట్ల ఆస్తులు కాపాడామని కమిషనర్ రంగనాథ్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు.
తన ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఐదారు కోట్ల విలువైన స్థలానికి ఫెన్సింగ్ వేసి.. రూ.200 కోట్ల విలువైన స్థలాన్ని రక్షించామని చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. లక్షల కోట్ల ఆస్తులు కాపాడడం దేవుడెరుగు.. లక్షలాది మంది పేదల కుటుంబాలను రోడ్డునపడేసిందని దుయ్యబట్టారు. ‘ఎన్కన్వెషన్షన్ను నేలమట్టం చేశామని గొప్పలు చెప్పుకున్న రంగనాథ్.. ఇప్పుడు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? ఆయనకు చిత్తశుద్ధి ఉంటే దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన నెకార్ గార్డెన్‌లోని ముఖ్యమంత్రి సోదరుడు, ఇతర ముఖ్యుల నివాసాలను ఎందుకు ముట్టుకోవడంలేదు? ఫాతిమా కాలేజీ జోలికి వెళ్లడంలేదు ఎందుకు..?’ అని సూటిగా ప్రశ్నించారు. కోర్టును కొందరు తప్పుదోవ పట్టించారని హైడ్రా కమిషనర్ చెప్పడం దారుణమని, ఆయన వ్యాఖ్యలను కోర్టు సుమోటోగా తీసుకొని, ధిక్కరణగా భావించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. రంగనాథ్ మాత్రమే ప్రజలను బాగా ఇబ్బందులు పెడుతారని భావించే ముఖ్యమంత్రి ఆయనను కొనసాగిస్తున్నారని చురకలంటించారు.
కేసీఆర్‌పై నిందలు మాని పాలనపై దృష్టిపెట్టండి
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలాడానికి ప్రధాన కారణం హైడ్రానేనని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం వాస్తవాలు గుర్తు ఎరుగడంలేదని దెప్పి పొడిచారు. నిత్యం కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ గురించి ఆలోచిస్తేగానీ వారికి నిద్ర రావడంలేదని దెప్పిపొడిచారు. ఇప్పటికైనా కేసీఆర్‌పై నిందలు మాని పాలనపై దృష్టిపెట్టాలని హితవుపలికారు.