హైదరాబాద్ : గెలిచినప్పుడు పొంగిపోవటం.. ఓడినప్పుడు కుంగిపోవటం రాజకీయ నాయకుల లక్షణం కాదు అని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి(BRS MLA Devi Reddy Sudhir Reddy) పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలకు ప్రజల వైపు ఉండాలనే సూత్రీకరణకు అనుగుణంగా తాము ఉంటామని, ఈ క్రమంలో గెలిచిన ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీగా తాము నిర్మాణాత్మక సూచనలు తప్పకుండా చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సూచించారు.
గెలిచినా ఓడినా ప్రజల యోగక్షేమాలే పరమాధిగా పనిచేస్తామని ఆయన వెల్లడించారు. తొందరపడి ఎవరూ వ్యాఖ్యలు చేయడం సరియైంది కాదన్నారు. ఓటమిని హుందాగా స్వీకరిద్దామన్నారు. కొత్త ప్రభుత్వానికి కనీసం నాలుగైదు నెలల సమయం ఇచ్చి వేచి చూశాక.. హామీలు అమలు చేయకపోతే ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వ్యాఖ్యలను ఆయన తిప్పి కొట్టారు. ప్రజా సేవకు పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు.