హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): దీక్షా దివస్ సందర్భంగా ఈ నెల 29 నుంచి వచ్చే నెల 9 వరకు పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్టు బీఆర్ఎస్ మైనారిటీ నేతలు చెప్పారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ముఖీబ్ చాందా మాట్లాడుతూ కేసీఆర్ దీక్ష వల్లనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ సీఎంగా తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని వెల్లడించారు.
ఈ నెల 29న (శనివారం) చార్మినార్ వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తామని చెప్పారు. తరువాత వరుసగా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు, రైతు సమస్యలపై ఆందోళనలు, అమరులకు శ్రద్ధాంజలి, బస్తీ దవాఖానల పరిస్థితిపై సర్వే, ప్రార్థనలు, రక్తదాన శిబిరాలు చేపడుతామని వెల్లడించారు. ఇనాయత్‌అలీ బాక్రీ మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమం కేసీఆర్ పాలనలోనే కనిపించిందని తెలిపారు. వహీద్అహ్మద్ స్పంది స్తూ కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లయ్యిందన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.