హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ‘ప్రధాని నరేంద్ర మోదీ చెప్తేనే సీఎం రేవంత్రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ అంటూ మరో కొత్త డ్రామాకు తెరలేపారు. బడే భాయ్, ఛోటే భాయ్ బంధంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని బీఆర్ఎస్ మైనారిటీ నేత ఆజం అలీ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన ఇతర మైనారిటీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
కాళేశ్వరం.. అద్భుతమైన ప్రాజెక్టు అని, తెలంగాణకు అది జీవధార అని, అలాంటి ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించడమా? అని నిలదీశారు. సీఎం రేవంత్రెడ్డి తన స్కూల్ ఆర్ఎస్ఎస్ అని, టీడీపీ తన కాలేజీలాంటిదన్న విషయాలను ఈ ఘటనతో నిరూపించుకున్నారని ధ్వజమెత్తారు. తన కాలేజీ ప్రిన్సిపాల్ అయిన చంద్రబాబు ఆదేశాలతోనే, విద్యార్థి రేవంత్రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారన ఎద్దేవా చేశారు. అసలు సీబీఐ విచారణ జరుపాల్సింది కాళేశ్వరంపై కాదని, రైతులకు కావాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్ చేస్తున్న వారిపై అని స్పష్టం చేశారు. కేసీఆర్ వల్ల పెరిగిన తెలంగాణ ప్రతిష్ఠను, రేవంత్రెడ్డి తన వైఖరితో దిగజార్చుతున్నార విమర్శించారు.
మైనారిటీలకు రక్షణ కరవు
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని మైనారిటీలకు రక్షణ కరువైందని ఆజం అలీ ఆందోళన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అమలైన ప్రజా సంక్షేమ పథకాలను రేవంత్రెడ్డి బంద్ పెట్టారని విమర్శించారు. క్యాబినెట్లో మైనారిటీలకు స్థానం కల్పించలేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ పదవిని సైతం మజాక్ చేశారని మండిపడ్డారు. కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలకు దిగడాన్ని మైనారిటీలు హర్షించడం లేదని తేల్చిచెప్పారు. కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేయడానికి బదులు.. ప్రజా సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
ప్రతీకార రాజకీయాలు మానుకోవాలి
కాంగ్రెస్ నేతలు ప్రతీకార రాజకీయాలను మానుకోకపోతే ఆ పార్టీ భూస్థాపితం కాక తప్పదని ఆజం అలీ హెచ్చరించారు. తెలంగాణను సాధించిన మహానేతగా, అద్భుతంగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దిన తొలి తెలంగాణ సీఎంగా కేసీఆర్పై ప్రజలకు ఎనలేని అభిమానం ఉన్నదని, అలాంటి నేతపై అసత్య ఆరోపణలతో వేధించాలని చూడటం మానుకోకుంటే కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెప్తారని తెలిపారు. సీబీఐ విచారణను అక్టోబర్ 7 దాకా చేయొద్దని న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. అర్షద్ అలీఖాన్, అక్బర్ హుస్సేన్, మహ్మద్ మోయిద్ఖాన్, ఎండీ యూసుఫ్, మహ్మద్ ఖలీం, ఖాజా బద్రుద్దీన్, అబ్దుల్ బాసిత్ తదితరులు పాల్గొన్నారు.