హైదరాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి వచ్చినట్టు లేదని.. తెలంగాణపై తన కడుపులోని విషాన్ని కక్కడానికి వచ్చినట్టు ఉన్నదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మోదీ చెప్పిన ప్రతిమాట సత్యదూరమేనని, పచ్చి అబద్ధాలేనని ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ట్వీట్ చేశారు. తన వల్లే డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) మొదలైనట్టు మోదీ చెప్పడం పచ్చి అబద్ధమని, తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్, రైతుబంధు వంటివి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తున్నదని గుర్తుచేశారు. రైతు బంధును కాపీ కొడితే పీఎం కిసాన్ యోజన అయ్యిందని, పీఎం కిసాన్ వల్లే మొదటిసారి రైతులకి లబ్ధి అని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. రైతు బంధుతో పోల్చితే పీఎం కిసాన్ సాయమెంతో చెప్పాలని నిలదీశారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు చేయూత అని చెప్పడం పూర్తిగా అవాస్తమని ధ్వజమెత్తారు.
అదానీ పైనుంచి ప్రజల దృష్టిని మళ్లించే కుట్ర
రాష్ర్టానికి కేటాయించిన ఐటీఐఆర్‌ను మోదీ సర్కార్ బెంగళూరుకు తరలించిందని, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన వెంటనే గుజరాత్లో ఆర్బిట్రేషన్ సెంటర్ పెట్టిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. తెలంగాణ ధాన్యాన్ని కొనకుండా రైతుల కంట కన్నీరు పెట్టించింది మీ ప్రభుత్వం కాదా మోదీ గారు? అని ప్రశ్నించారు. అదానీ వివాదం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి.. లేని పరివారవాదం గురించి మాట్లాడటం మోదీకే చెల్లిందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందించడం లేదని మోదీ చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన గిరిజన వర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉకు పరిశ్రమ, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, జాతీయ హోదా వంటివి ఇవ్వకుండా తెలంగాణను కేంద్రం వేధిస్తున్నదని ధ్వజమెత్తారు. మోదీ చెప్పినవన్నీ మాటలకే పరిమితమని, కేంద్రం తెలంగాణకు ఎలాంటి సహకారం అందించడం లేదని స్పష్టంచేశారు.