Telangana | హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): 30% కమీషన్ వసూళ్లపై అసెంబ్లీ బుధవారం అట్టుడికింది. తమ వద్ద 20% కమీషన్లు వసూలు చేస్తున్నారంటూ సాక్షాత్తు సచివాలయంలోనే కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తున్నారని, ఏ పని కావాలన్నా 30% చెల్లించుకోవాల్సి వస్తున్నదంటూ అధికార పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆరోపించారని ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు విరుచుకుపడ్డారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ తరఫున జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. పల్లా మాట్లాడుతున్నంత సేపు అధికార పార్టీ సభ్యులు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. రన్నింగ్ కామెంట్రీ చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ జోక్యం చేసుకున్నారు. ‘రెచ్చగొట్టేలా మాట్లాడాలంటే మేమూ ఎంతైనా మాట్లాడతాం. సభ్యులు మాట్లాడుతుంటే మంత్రులకు, ప్రభుత్వానికి ఓపిక, సహనం ఉండాలి. ఇన్నిసార్లు అంతరాయం కలిగిస్తారా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
స్పీకర్ రికార్డులను పరిశీలించాలని, మంత్రు లు ఎంతసేపు మాట్లాడారో చూడాలని విజ్ఞప్తి చేశా రు. ప్రతిపక్షంగా తాము అడుగుతామని, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. డిస్కషన్, డిబేట్ జరగడం ప్రజాస్వామ్య గొప్పదనమని చెప్పారు. తాము కొత్తగా ఏమీ అనలేదని, 30% కమీషన్ అని మీ అధికార పార్టీ ఎమ్మెల్యేనే అంటున్నారని, 20% కమీషన్ అంటూ కాంట్రాక్టర్లు సచివాలయంలోనే ధర్నాలు చేస్తున్నారని, ప్రభు త్వం దీనిపై సమాధానం చెప్పాలని కేటీఆర్ సవాల్ చేశారు. ఊహించనివిధంగా కమీషన్ల దందా గురిం చి కేటీఆర్ మాట్లాడటంతో, అధికారపక్షానికి ఏం మాట్లాడాలో తోచలేదు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కేటీఆర్ మాటలతో తీవ్ర అసహనానికి గురయ్యారు. మైక్ తీసుకొని ఆవేశంతో ఊగిపోయా రు. మరోవైపు, ప్రభుత్వ అవినీతిపై మాట్లాడుతున్న కేటీఆర్ వద్ద ఉన్న మైక్ కట్ అయ్యింది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మైక్ తీసుకొని, కేటీఆర్‌కు సమాధానం చెప్పే క్రమంలో ఏదిపడితే అది తమ గురించి మాట్లాడవద్దని, ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని తీవ్ర పదజాలంతో, పరుషంగా వ్యాఖ్యానించారు. ఆవేశంగా ఉన్న డిప్యూటీ సీఎం ఒకింత అసహనంతో ‘ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు’ అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి బెదిరింపులకు దిగారు.
డిప్యూటీ సీఎం బెదిరింపులపై బీఆర్ఎస్ సభ్యుల ఆగ్రహం
నిండు సభలో డిప్యూటీ సీఎం బెదిరింపు ధోరణిలో మాట్లాడటంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. భట్టి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, భట్టి మాటలను రికార్డుల నుంచి తొలగించాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. మరోవైపు, అధికారపక్షం కూడా కేటీఆర్ మాటలను రికార్డుల నుంచి తొలగించాలని, కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. దీంతో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ స్థానంలో ఉన్న ప్యానల్ స్పీకర్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. దీంతో భట్టి వ్యాఖ్యలను కూడా రికార్డుల నుంచి తొలగించాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. కేటీఆర్‌ను, బీఆర్ఎస్ను ఉద్దేశించి డిప్యూటీ సీఎం మాట్లాడినందున, తమకు కూడా అవకాశం ఇస్తే తమ వాదన కూడా చెప్తామని బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్‌ను కోరారు. ప్యానల్ స్పీకర్ ప్రకాశ్‌రెడ్డి బీఆర్ఎస్కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బీజేపీకి ఇచ్చారు. దీనిపై బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్‌కు తన నిరసన తెలిపారు. అనంతరం భట్టి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీఆరఎస్ సభ్యులు పెద్ద ఎత్తున నినదిస్తూ, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు, భట్టి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలతో మళ్లీ భగ్గు
కొద్దిసేపటి తర్వాత బీఆర్ఎస్ సభ్యులు మళ్లీ సభలోకి వస్తుండగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రసంగిస్తూ, మరోసారి బీఆర్ఎస్పై, కేసీఆర్‌పై వ్యంగ్యంగా మాట్లాడారు. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో 2009 నుంచి కలిసి సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నామని, ఆయనను పెద్దన్నలాగా గౌరవిస్తామని చె ప్పారు. తాము ఏదో అన్నట్టుగా ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ‘ఓటుకు నోటు దొంగ రేవంత్‌రెడ్డి అని మేము అనలేమా? 30% కమీషన్లు తీసుకుంటున్నారని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. దానిపై చర్య తీసుకోవాలని రెవె న్యూ మినిస్టర్‌ను కోరుతున్న. 20% కమీషన్లు తీ సుకుంటున్నారని కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేశారు. దాని మీద చర్య తీసుకోవాలని అడుగుతున్న. రేవంత్‌రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్న మాటలు మేము అనలేమా?’ అంటూ కేటీఆర్ చురకలంటించారు.
మేము కొత్తగా ఏమీ అనలేదు. 30% కమీషన్ అని మీ అధికార పార్టీ ఎమ్మెల్యేనే అంటున్నారు. 20% కమీషన్ అంటూ కాంట్రాక్టర్లు సచివాలయంలోనే ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పాలి. -కేటీఆర్