Niranjan Reddy | హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేకాటలో జోకర్లా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరమీదకు తెస్తున్నారు తప్ప ఇంతవరకు ప్రభుత్వం గానీ, ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ దీనిపై ఒక అధికారిక ప్రకటన చేయలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ వైఫల్యాలు తెరమీదకు రాగానే డైలీ సీరియల్లా ఏవేవో లీకులు ఇస్తూ ప్రజల అటెన్షన్‌ను డైవర్ట్ చేస్తున్నారని అన్నారు. తమ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను. బీఆర్ఎస్ను బద్నాం చేయడానికే పదేపదే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరమీదికి తెస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేశారని, అయినా దానిని సిల్లీ అంశంగా తీసుకున్నామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యవస్థలో భాగంగా ఆయా సంస్థల పరిధిలో జరిగేదని, ఇందులో ముఖ్యమంత్రికి, మంత్రులకు సంబంధం ఉండదని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అనేది లీగల్ సెన్స్ లేని నాన్సెన్స్ అని వ్యాఖ్యానించారు. రోజువారీ లీకులతో వార్తలు రాయించడం కూడా నేరమేనని, వార్తలు రాయించడంతోపాటు తీర్పులు కూడా ఇచ్చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను, బీఆర్ఎస్ నేతలను బద్నాం చేయడమే లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తున్నదని మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్‌ను దుర్వినియోగం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని, ఇందిరాగాంధీ హయాంలో సొంత పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని నిరంజన్‌రెడ్డి గుర్తుచేశారు. తన ఫోన్ ట్యాప్ అవుతున్నదని గతంలో సినీనటుడు చిరంజీవి చెప్పారని అన్నారు. తమ ఫోన్ ట్యాప్ చేసి గెలిచారని కొందరు ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, అలా అయితే ఆ పార్టీ అభ్యర్థులు 64 సీట్లు ఎలా గెలిచారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కానీ వారు తీర్పులు ఇస్తున్నారంటూ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం లీకు వార్తలు ఇలాగే కొనసాగితే లీగల్‌గా ముందుకెళ్తామని హెచ్చరించారు.
ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో ప్రజాప్రతినిధిని కొనుగోలు చేయడానికి వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. . కేసీఆర్‌కు లైడిటెక్టర్ పెడితే కాళేశ్వరం విషయాలు బయటకు వస్తాయంటూ రేవంత్ మాట్లాడటం అవివేకమని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉండి మాజీ ముఖ్యమంత్రిపై అలా మాట్లాడతారా అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు, వైఎస్ హయాంలో జరిగిన ఎన్కౌంటర్లు ఫలానా వాళ్లు చెబితే చేశామని ఎవరైనా పోలీసు అధికారులు చెప్పగలరా? అని ప్రశ్నించారు. అభియోగాలను ఎప్పుడూ చట్టపరిధిలో అంగీకరించరని అన్నారు. ఏ ఉత్తర్వులు, ఏ ప్రాతిపదికన వెలువడ్డాయి అన్నది కోర్టులో నిర్ధారణ అవుతుందని అన్నారు. సినిమాకు ముందు న్యూస్ రీల్స్ లాగా ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తున్నదని ఎద్దేవా చేశారు. కొన్ని రోజులు కాళేశ్వరం మీద అబద్ధాలు ప్రచారం చేశారని విమర్శించారు. ఇప్పుడు మల్లన్న సాగర్ నుండి మూసీకి, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు ఏడు టీఎంసీలు తెస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారని, కాళేశ్వరం విఫల ప్రాజెక్టు అయితే మరి నీళ్లెలా తెస్తారని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్, బీఆర్ఎస్ నాయకుడు అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.