హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): పరిపాలనాపరమైన అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వటం వల్ల ప్రజలతో తమకు కొంత గ్యాప్ వచ్చిందని, కర్ణుని చావుకు అనేక కారణాలు అన్నట్టు తమ ఓటమికి అనేక కారణాలున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత టీ హరీశ్‌రావు పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఈ ఇద్దరు అగ్రనేతలు మంగళవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నామని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చటం వల్లే ఓటమిపాలయ్యామనేది సరైన నిర్ధారణ కాదని పేర్కొన్నారు. తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పుకోలేకపోయామని అన్నారు. తమ వైఖరి కొంత మార్చుకోవాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. తాము చేసిన అభివృద్ధి వల్లె హైదరాబాద్‌లో అన్ని సీట్లను గెలిచామని కేటీఆర్ అన్నారు.
తాము చేసిన అభివృద్ధి, ప్రజా అనుకూల విధానాల వల్లనే తమకు 39 సీట్లు వచ్చాయని చెప్పారు. మరో 14 స్థానాల్లో 6 వేల ఓట్లతో ఓడిపోయామని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తమకు కేవలం 4 లక్షల ఓట్ల తేడాయే ఉన్నదనే విషయాన్ని గమనించాలని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్రెడ్డి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసినా ఓటమి పాలయ్యారని ఆయన ఉదహరించారు. ఏపీలో పవన్‌కల్యాణ్ విడిగా పోటీచేసి ఉంటే ఫలితాలు వేరుగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఏపీలో ప్రతిరోజూ జనంలో ఉండే కేతిరెడ్డి ధర్మవరంలో ఓటమి పాలైన ఉదంతాన్ని గుర్తుచేశారు. ఏపీలో జగన్‌ను ఓడించేందుకు షర్మిలను పావులా ఉపయోగించారని అభిప్రాయపడ్డారు.
పార్టీ ఫిరాయింపులతో లాభం కన్నా నష్టమే ఎక్కువ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. గతంలో పార్టీ ఫిరాయింపుల వల్ల బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా లాభం జరగలేదని, తమ పార్టీలో చేరిన 10 మంది ఓడిపోయారని గుర్తుచేశారు. పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నదని, ఆ తీర్పు ప్రకారం స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.
పార్టీ ఫిరాయింపులపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలన వదిలేసి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అధికారులు తమ చేతుల్లో ఉన్నారని పేర్కొనటం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనమేనని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో పారిశుద్ధ్యం ఎక్కడికక్కడ పేరుకుపోవడం వల్ల ప్రజలు డెంగ్యూ, మలేరియా బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు నెలలుగా పింఛన్లు ఇవ్వడం లేదని, గ్రామ పంచాయతీల్లో సిబ్బందికి జీతాలు రావటం లేదని, రైతులకు రైతుబంధు వేయటం లేదని, రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ సమస్యలు తీవ్రం అవుతున్నాయని, ప్రజలు మళ్లీ ఇన్వర్టర్లు, జనరేటర్లు కొంటున్నారని, ఇలా ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. మార్పు వస్తుందని ఊదరగొట్టిన ప్రచారం పుణ్యమా అని కాంగ్రెస్‌కు పట్టం కడితే తమను ఏమార్చే రోజులు వచ్చాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
తమ ఆత్మవిశ్వాసాన్ని అహంకారమని ప్ర చారం చేస్తున్నారని, అభివృద్ధిలో తమతో పోటీపడలేక కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పాలనపై సీఎం రేవంత్‌రెడ్డికి పట్టురాలేదని పేర్కొన్నారు. డబ్బు సంచులతో దొరికినవాడు తెలంగాణలో సీఎం అయ్యారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డికి అర్థబలం, అంగబలం అన్నీ ఉన్నా తమమీద పడి ఏడుస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు రెండేండ్ల సమ యం ఇస్తామని, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన అని గొప్పగా చెప్పుకుంటున్న రేవంత్‌రెడ్డి.. సర్కారును ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వ్య తిరేక పోస్టులు పెడితే పోలీసులతో ఫోన్లు చే యించి వాటిని డిలీట్ చేయిస్తున్నారని మండిపడ్డారు.
తమకు ఉన్నది ఆత్మవిశ్వాసం అని, దురదృష్టవశాత్తు అహంకారమని ప్రచా రం చేయడం ఎంతవరకు సమంజసమని ప్ర శ్నించారు. సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి సమావేశం వల్ల వచ్చే ఫలితాలను బట్టి తమ స్పందన ఉంటుందని అన్నారు. తెలంగాణకు చంద్రబాబు ఉపయోగపడితే మంచిదేనని అంటూ నే.. గతంలో ఆయన వైఖరినీ పరిశీలించాలి కదా? అని వ్యాఖ్యానించారు.