BRS | హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ఐదు నెలల క్రితంతో పోల్చితే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయిందా? స్వల్ప తేడాతో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. 150 రోజుల్లోనే మళ్లీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందా? ఇవాళ జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించబోతున్నదా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, పాత్రికేయులు. ఇవాళ పోలింగ్ జరగనున్న 17 లోక్‌సభ సీట్లలో దాదా పు పదమూడింటిని కారు పార్టీ కైవసం చేసుకోనే అవకాశం ఉం దని వారు అంచనా వేస్తున్నారు. స్వయంకృతాపరాధాల కారణంగా కాంగ్రెస్‌కు పెనుదెబ్బ తగలబోతున్నదని, అది రెండు సీట్లకే పరిమితమయ్యే అవకాశం ఉన్నదని వారు పేర్కొంటున్నారు. ఇక, సోషల్ మీడియా హైప్లో చిక్కుకున్న బీజేపీకి కేవలం ఒకే ఒక స్థానంలో పరిస్థితి మెరుగ్గా ఉన్నదని, యథాప్రకారం మజ్లిస్‌కు ఒక్కసీటు దక్కబోతున్నదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తమ్మీద చూస్తే బీఆర్ఎస్కు 13, కాంగ్రెస్‌కు 2, బీజేపీకి 1, మజ్లిక్‌కు 1 స్థానాలు దక్కే అవకాశం ఉన్నదని అభిప్రాయపడుతున్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల్లో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం.. కేవలం కాంగ్రెస్, బీజేపీ మధ్య కేంద్రీకృతమైనట్టు ఒక ప్రచారం ముమ్మరంగా సాగింది. బీఆర్ఎస్ అసలు సీనులో లేదని నిరూపించటానికి రెండు జాతీయ పార్టీలు చేయని ప్రయత్నం లేదు.
అయితే, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ డేట్ దగ్గరయ్యేకొద్దీ అసలు విషయం నెమ్మదిగా తేటతెల్లమైంది’ అని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇక, కేవలం 1.8 శాతం ఓట్ల తేడాతో బొటాబొటి మెజారిటీతో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్.. అంతేవేగంగా ప్రజాదరణ కోల్పోయిందని అభిప్రాయపడుతున్నారు. ‘నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పెద్దగా పెరిగిందీ లేదు. బీఆర్ఎస్ అంతగా తగ్గిందీ లేదు. ఆ రెండు పార్టీల మధ్య అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం తేడానే ఇందుకు నిదర్శనం. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతమంది నాయకులు కాంగ్రెస్ వైపు వెళ్లటం, సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం బీఆర్ఎస్ను కొంత డిఫెన్స్‌లోకి నెట్టాయి. ఒక్కసారిగా కేసీఆర్ బయటకు రావటంతో ఆ పార్టీ తిరిగి బెబ్బులిలా విజృంభించింది. ఆత్మరక్షణ నుంచి ఎదురుదాడిలోకి వెళ్లిపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలవబోతుండటానికి కారణమిదే’ అని ఓ రాజకీయ పరిశీలకుడు పేర్కొన్నారు. ‘కొందరు పేరుగొప్ప నాయకులు బీఆర్ఎస్ను వీడి ఉండొచ్చు.. కానీ, బీఆర్ఎస్ క్యాడర్ ఎక్కడా చెక్కుచెదరలేదు. నేడు జరిగే పోలింగ్‌లో బీఆర్ఎస్ క్యాడరే ఆ పార్టీ వెన్నెముకగా, బలంగా నిలబడబోతున్నది’ అని ఆయన విశ్లేషించారు.
బీఆర్ఎస్ తన ఓటుబ్యాంకును యాజ్ ఇట్ ఈజ్‌గా నిలుపుకున్నదని, ఈ క్రెడిట్ కేసీఆర్‌కే దక్కుతుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ప్రొఫెసర్ నాగేశ్వర్ తన విశ్లేషణలో పేర్కొన్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని సామాన్య ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని మరో రాజకీయ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు కూడా నిర్దంద్వంగా పేర్కొన్నారు. ఇక ప్రముఖ ఆంగ్లదినపత్రిక ది స్టేట్స్‌మెన్ అయితే ‘రీసెర్జెంట్ బీఆర్ఎస్.. స్పాయిల్డ్ ది చాన్సెస్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ’ అనే పేరుతో ఒక విశ్లేషణనే ప్రచురించింది. ఐదు నెలల కాలంలోనే బీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకున్నదని, లోక్‌సభ సీట్లపై కాంగ్రెస్, బీజేపీ పెట్టుకున్న ఆశలకు భారీగా గండి పడనున్నదని స్టేట్స్‌మన్ విశ్లేషించింది. దక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలు కూడా లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ ప్రధాన పోటీదారు స్థాయికి వచ్చిందని విశ్లేషణలు ప్రచురించాయి. బీఆర్ఎస్ మెజారిటీ స్థానాల్లో గెలవబోతున్నదని చెప్పడానికి వివిధ వ్యక్తులు, సంస్థలు స్వతంత్రంగా నిర్వహించిన విశ్లేషణలే సాక్ష్యమని పరిశీలకులు భావిస్తున్నారు.
‘బీఆర్ఎస్ గ్రాఫ్ భారీగా పెరిగిందని కాంగ్రెస్, బీజేపీకి చెందిన ముఖ్య నాయకులు కూడా సంకోచం లేకుండా అంగీకరిస్తున్నారు. బీఆర్ఎస్ గ్రాఫ్ పెరగడానికి బీజేపీయే కారణమని, ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ఇటీవల పేర్కొనగా, రేవంత్ తప్పిదాల వల్లే బీఆర్ఎస్ తిరిగి లేచి కూర్చున్నది’ అని బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. ఇద్దరు ముఖ్యనేతలు.. బీఆర్ఎస్ ముందంజలోకి వచ్చిందని చెప్పకనే చెప్పారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను వదులుకోవాలని అనుకోలేదు. స్థానిక కారణాలు, ఇతరత్ర సమస్యలతో వారు కాంగ్రెస్‌కు ఒక అవకాశం ఇద్దామని అనుకున్నారు. కానీ, అది తప్పుడు నిర్ణయమని, దానివల్ల తెలంగాణ, ప్రజలు.. తీవ్ర నష్టం ఎదుర్కొనబోతున్నారని 5 నెలల్లోనే గ్రహించారు. అందుకే ఓటర్లు ప్రస్తుతం కరెక్షన్ మోడ్ (దిద్దుబాటు చర్యలోకి)లోకి మళ్లారు’ అని ఓ పాత్రికేయుడు అభిప్రాయపడ్డారు. ‘గత 60 ఏండ్లుగా కాంగ్రెస్, 30 ఏండ్లుగా బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని, కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే రాష్ట్ర సమస్యల గురించి, ప్రజల సమస్యల గురించి పట్టించుకోవటం, పరిష్కరించటం మొదలైందని, ఈ ట్రాక్ ఒకసారి తప్పితే ఇక తెలంగాణ మళ్లీ వెనుకటి రోజులకు మళ్లిపోతుందని, ప్రజల్లో ఒక నిశ్చితాభిప్రాయం వచ్చింది. అందుకే రైతులు, మహిళలు, పింఛనుదారులు ఏకపక్షంగా బీఆర్ఎస్ వైపు తిరుగుతున్నారు.
కరెంటు కోతలు, మంచినీళ్ల సమస్య ఓటర్ల మనోగతంలో పెను మార్పునకు కారణమయ్యాయి’ అని ఆ పాత్రికేయుడు విశ్లేషించారు. ‘కేవలం 16 రోజుల ప్రచారంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న దాదాపు 10 సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించేలా ఒత్తిడి తేగలిగారు. కేసీఆర్ బయటకు వచ్చి గొంతు విప్పిన తర్వాతే ప్రభుత్వం నుంచి ఎంతో కొంత స్పందన మొదలైంది. అది రైతుబంధు ఇవ్వడమైనా, రుణమాఫీ డేట్ రావడమైనా, పంటలకు పరిహారమైనా, ఓయూ హాస్టళ్లు తెరవడమైనా, నేత కార్మికుల బకాయిలు విడుదల చేయడమైనా! కేసీఆర్ లేకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తమను మళ్లీ గాలికొదిలేస్తుందనే విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైంది. అందుకే అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ను గెలిపించటం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ప్రెషర్గ్రూప్ను తయారు చేయాలని ఓటర్లు నిర్ణయించుకున్నట్టే కనిపిస్తున్నది’ అని గత 40 ఏండ్లుగా తెలంగాణ రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్న సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్, బీజేపీ మధ్య ముఖాముఖి పోరు అన్నది ఉత్త మాట. ఇప్పుడు కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా హైదరాబాద్ మినహా అన్ని సీట్లలో బీఆర్ఎస్తోనే పోటీ పడనున్నాయి. బీఆర్ఎస్కు ఉన్న స్థానికత, తెలంగాణపై ఉన్న కన్సర్న్, కేసీఆర్‌కు ఉన్న ప్రజాదరణ వల్ల కాంగ్రెస్, బీజేపీలు రెండో స్థానం కోసమే కొట్లాడకతప్పదు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.