తెలంగాణలో బీఆర్ఎస్కు ఒక రాజ్యాంగం.. కాంగ్రెస్, బీజేపీకి ఒక రాజ్యాంగం ఉందా అని రాష్ట్ర డీజీపీని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ పుట్టిన రోజు ఒక్క రోజు కూడా ఫ్లెక్సీలను ఉంచకుండా తీసేసిన మున్సిపల్ అధికారులకు, పోలీసులకు.. నేడు ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే కోసం కాంగ్రెస్ నాయకులు పెట్టిన ఫ్లెక్సీలు కనిపించడం లేదా అని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ప్రశ్నించారు. నాలుగు రోజుల నుంచి ఉన్న బీజేపీ ఫ్లెక్సీలు కనిపించడం లేదా అని నిలదీశారు.
ట్రాఫిక్ సిగ్నల్ కనపడకుండా ఫ్లెక్సీలు పెడితే కూడా పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని వై.సతీశ్ రెడ్డి అన్నారు. దీన్ని బట్టి చూస్తే అధికార పార్టీ కోసమే అధికారులు పనిచేస్తున్నట్లు ఉందని తెలిపారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని, కలిసి పనిచేస్తున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు.