మహబూబ్‌నగర్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్ లో శనివారం ఎరువుల కోసం వచ్చి.. ఫిట్స్‌తో పడిపోయిన ఆంజనేయులు రైతే కాదని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణల్లో నిజం లేదని బీఆర్ఎస్ నాయకులు, పాలమూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గణేశ్, సీనియర్ నేత ఇమ్రాన్ పేర్కొన్నా రు. సోమవారం మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో వారు మాట్లాడారు. నవాబ్‌పేట మండలం కాకర్లపహాడ్‌కు చెందిన పీ ఆంజనేయులు యూరియా కోసం మహబూబ్‌నగర్‌లోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ఎరువుల విక్రయ కేంద్రం వద్ద యూరియా కోసం క్యూలో నిలబడి మూర్ఛతో సొమ్మసిల్లిపడిపోయారు. అప్పుడే అక్కడికి వెళ్లిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మానవతా దృక్పథంతో రైతును అంబులెన్స్‌లో దవాఖానకు తరలించారు. ఆంజనేయులు రైతు కాదని కాంగ్రెస్ నేతలు ఆరోపించగా.. బీఆర్ఎస్ నేతలు సాక్ష్యాధారాలతో సహా బయపటపెట్టారు. గ్రామ శివారులోని సర్వే నంబర్ 153/ఆ/1/1/1లో ఆంజనేయులుకు 26 గుంటల భూమి ఉన్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన భూమి పట్టా పాస్‌బుక్ జిరాక్స్ చూపెట్టారు. అధికార పార్టీ నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.