ఉద్యోగుల పక్షాన ప్రభుత్వంపై సమరశంఖం పూరించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కమిటీల పేరుతో కాలయాపనచేస్తూ ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్న రేవంత్ సర్కారుకు బుద్ధిచెప్తామని పేర్కొంది. ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది.
BRS | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, పెన్షనర్ల హక్కులు, డిమాండ్లపై స్పందించడం ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత అని బీఆర్ఎస్ భావిస్తున్నది. ప్రభుత్వంపై ఉద్యమించేందుకు త్వరలోనే పూర్తిస్థాయి కార్యాచరణ ప్రకటించనున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. హైదరాబాద్‌లోని హరీశ్‌రావు నివాసంలో కేటీఆర్, హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు సమావేశమయ్యారు. గత 18 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఉద్యోగుల సమస్యల పరిషారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి చేపట్టాల్సిన పకడ్బందీ కార్యాచరణ రూపకల్పనపై లోతుగా సమాలోచనలు జరిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, డీఏ బకాయిలు, పీఆర్సీ వంటి ప్రధాన డిమాండ్లను పట్టించుకోకపోవడం, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను అందించకుండా సతాయించడం, హామీలపై నిలదీస్తున్న ఉద్యోగులపై వేధింపులు వంటి అంశాలను ఆయా సంఘాల నేతలు సమావేశంలో కేటీఆర్, హరీశ్‌రావు దృష్టికి తీసుకొచ్చారు. రిటైర్డ్ ఉద్యోగులు వృద్ధాప్యంలో తమకు రావాల్సిన బెనిఫిట్స్‌పై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పడుతున్న ఇబ్బందులను ఏకరవు పెట్టారు. తమ హకులు, ఆకాంక్షల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం నెలకొన్నదని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలవాల్సిన అవసరాన్ని బీఆర్ఎస్ నాయకత్వం గుర్తించింది. ప్రధాన ప్రతిపక్షంగా, లక్షల మంది ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని కేటీఆర్, హరీశ్‌రావు స్పష్టంచేశారు.
బీఆర్ఎస్ ఎల్లవేళలా ఉద్యోగుల ఆకాంక్షలు, హకుల పట్ల సానుభూతితో ఉంటుందని కేటీఆర్, హరీశ్‌రావు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం లక్షల మంది ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తుంటే వారికి అండగా నిలవడం ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత అని అన్నారు. సమావేశం అనంతరం ఉద్యోగుల ఆకాంక్షల సాధన కోసం స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలకు నాయకత్వం వహిస్తున్న నేతలకు మద్దతుగా నిలవాలని, పార్టీలోని ఉద్యోగ సంఘాల మాజీ నాయకులు, గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రిటైర్డ్ నేతలను ఈ కార్యక్రమంలో కలుపుకోవాలని సూచించారు. ప్రధాన ప్రతిపక్షంగా, ఉద్యోగులకు అండగా ఉంటూ, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి సహకరిస్తామని వెల్లడించారు.