సికింద్రాబాద్, జనవరి 22 : డెహ్రడూన్ పర్యటనలో గుండెపోటుకు గురై చికిత్స అనంతరం నగరానికి చేరుకున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌ను బీఆర్ఎస్ పార్టీ నేతలు బుధవారం పరామర్శించారు. మోండా మార్కెట్ టకారాబస్తీలోని ఆయన స్వగృహంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, ఈటల రాజేందర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్‌కుమార్, సలీం, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు వేర్వేరుగా పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్‌రావు, కవిత తదితరులు పద్మారావు ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలని పద్మారావుకు సూచించారు. పద్మారావు త్వరగా కోలుకొని తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ యువనేత, పద్మారావు తనయుడు రామేశ్వర్‌గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ.. పద్మారావుగౌడ్ ఆరోగ్యం మెరుగుపడిందని, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వైద్యుల సూచన మేరకు కొన్నిరోజుల విశ్రాంతి తరువాత తిరిగి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు.
నేను బాగానే ఉన్నా ఎమ్మెల్యే పద్మారావుగౌడ్
నేను బాగానే ఉ న్నాను.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యరీత్యా డాక్టర్ల సూచన మేరకు తనను కలిసేందుకు ఎవరూ రావొద్దని, వారం, పది రోజుల్లో తానే ప్రజల్లోకి వస్తానని తెలిపారు.