భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని కొత్తగూడెం క్లబ్లో గురువారం జరిగిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ స్కామ్‌ల పార్టీ అయిందని, జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులూ రాష్ర్టాన్ని దోచుకుతింటున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో ఒక్క పథకం అమలు చేయలేదని, బీఆర్ఎస్ ప్ర భుత్వం అమలుచేసిన పథకాలకే రంగులు వేసి ప్రారంభిస్తున్నట్టు విమర్శించారు. రైతుభరోసా ఇవ్వలేక చేతులెత్తేసిందని, పండించిన వడ్లు కూడా కొనలేకపోయిందని ధ్వజమెత్తారు. చివరికి అధికారులు కూడా పాలకుల మాట వినే పరిస్థితి లేదని అన్నారు. చేతకాని ప్రభుత్వానికి తెలంగాణను పాలించే హక్కులేదని తెలిపారు. ఉమ్మడి జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. ఓటర్ల రివిజన్లో బూత్‌లెవల్ ఏజెంట్లు దగ్గరుండి పనిచేస్తేనే ఓట్లు తొలగకుండా ఉంటాయని సూచించారు.