BRS | గతవారం కాంగ్రెస్ నేతల కరెంటు వ్యాఖ్యలపై నిరసనల్లో నిమగ్నమైన బీఆర్ఎస్.. చిరుజల్లులు పడగానే రైతుల ఆందోళనలకు విరామం ప్రకటించింది. ప్రజలకు అండగా నిలువాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆ మేరకు గులాబీ శ్రేణులు రంగంలోకి దిగి సహాయ చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఇందుకు భిన్నంగా వరదల్లోనూ బురద రాజకీయానికి వెంపర్లాడుతున్నది. ఒకవైపు రాష్ట్రం, ప్రజలు భారీ వర్షాల్లో, వరదల్లో చిక్కుకుని వణుకుతుంటే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ మాత్రం జీహెచ్ఎంసీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇదీ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి. ఇక బీజేపీ జాడే లేదు. విపత్తువేళ ఆ పార్టీకి చెందిన కేంద్రమంత్రి, నేతలు ఎక్కడున్నారని జనం నిలదీస్తున్నారు.
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపిలేకుండా కుండపోతగా కురుస్తున్న వానలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. మంత్రి కేటీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ నేతలు అండగా నిలబడ్డారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, శ్రేణులు ఎక్కడికక్కడ రంగంలోకి దిగి, చేయూత అందించారు. ప్రజాప్రతినిధులే కాకుండా పార్టీ ప్రతినిధులు, అనుబంధ సంఘాల బాధ్యులు వరద సహాయక చర్యల్లో మమేకమం అవుతున్నారు. సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని, మంత్రులను సమన్వయం చేస్తూ ప్రగతిభవన్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షప్రభావ జిల్లాలకు చెందిన మంత్రులతో సంప్రదింపులు చేస్తూ తక్షణ చర్యలకు ఆదేశించడంతో హైదరాబాద్ సహా ఆయా జిల్లా కేంద్రాల్లో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండాయపల్లి వద్ద వరదను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
అండగా నిలవండి.. శ్రేణులకు కేటీఆర్ పిలుపు
వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు అండగా నిలవాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వరంగల్లాంటి జిల్లాలో నీట మునిగిన ప్రాంతాలు, గ్రామాల్లో సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. నిత్యావసర సరుకులు అందించటం నుంచి మొదలుకొని తమకు తోచిన ఇతర మార్గాల్లో సహాయం చేయాలని సూచించారు. భారీ వర్షాలతో తలెత్తుతున్న పరిస్థితులను చకదిద్దేందుకు ప్రభుత్వ యంత్రాంగం నిబద్ధతతో కృషి చేస్తున్నదని, ఈ నేపథ్యంలో అధికారులకు పార్టీ అండగా నిలవాల్సిన అవసరం ఉన్నదని వెల్లడించారు.
సహాయక చర్యల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ జ్యోతి, కలెక్టర్ భవేష్, ఎస్పీ కరుణాకర్
కాంగ్రెస్ బురద రాజకీయం
ప్రజలు వరదల్లో చిక్కుకొని సహాయం కోసం అర్థిస్తుంటే, కాంగ్రెస్ నేతలు బురదల్లో రాజకీయం వెతుక్కుంటున్నారు. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవాల్సిందిపోయి, కాంగ్రెస్ నేతలు రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సహాయక చర్యలు అడ్డుకునేందుకే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ జీహెచ్ఎంసీ ముట్టడికి పిలుపునిచ్చారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. మానవీయతను చాటాల్సిన బాధ్యతాయుత విపక్ష నేతలు రాజకీయమే పరమావధిగా ఉంటారా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముంపు ప్రాంతాల బాధితులతో మాట్లాడుతున్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా
ఖమ్మం జిల్లా జలగంనగర్లో నీటమునిగిన ఇండ్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ తాతా మధు