హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తేతెలంగాణ): రాష్ట్ర శాసనసభను రేవంత్ సర్కార్ కౌరవ సభలా మార్చివేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు మండిపడ్డారు. సోమవారం తెలంగాణభవన్‌లో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శాసనసభ చరిత్రలోనే ఇది చీకటి రోజని అభివర్ణించారు. కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు, పింఛన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులు, ఉద్యోగుల సమస్యలపై తాము నిలదీస్తామనే భయంతోనే ప్రజాప్రతినిధులను అడ్డుకొని, అమానుషంగా సభ వెలుపలికి మెడపట్టి నెట్టివేశారని ఆయన మండిపడ్డారు.
మహిళా ప్ర జాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత హేయమని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి చీర లాగడం, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి గొంతు నొకడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. తమ చెల్లెమ్మలు, అకల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన ఏ ఒక పోలీ సు అధికారినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. హోం మంత్రి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న రేవంత్ ఈ పాలనకు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
లోక్‌సభలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ నల్ల టీషర్టులు ధరించి నిరసన తెలిపినప్పుడు తప్పు కానిది.. తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపితే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. తాము రేవంత్ తరహాలో బెదిరింపులకు దిగలేదని, ప్రజాస్వామ్య పద్ధతిలోనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేశామని స్పష్టంచేశారు.
శాసనసభలో కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫి క్సింగ్ చేసుకొని కుమ్మకు రాజకీయాలు చేస్తున్నాయని హరీశ్‌రావు మండిపడ్డారు. కీలక అంశాలపై మొకుబడి చర్చ నిర్వహించేందుకు బీఆర్ఎస్ను ఉద్దేశపూర్వకంగానే సభలో లేకుండా చేశారని విమర్శించారు. ఒక పథకం ప్రకారమే బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయించే కుట్ర పన్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కుంభకోణాలు, వైఫల్యాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన తీరును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. ఈ సోమవారం ప్రజాస్వామ్య చరిత్రలోనే చీకటి రోజని అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలన చేతగాక, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షం లేవనెత్తే ప్రజా సమస్యలకు సమాధానం చెప్పే ధైర్యం లేకనే బీఆర్ఎస్ కీలక నేతలను పథకం ప్రకారమే అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వకుండా అక్రమంగా అరెస్టు చేయించారని ఆరోపించారు.
ప్రజాసమస్యలపై శాసనసభలో చర్చించే ధైర్యం లేకనే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అక్రమంగా అరెస్ట్ చేయించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్ ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం ప్రతిపక్ష సభ్యుల పట్ల పోలీసులు అత్యంత దౌర్జన్యంగా, అమర్యాదగా ప్రవర్తించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల పోలీసుల దౌర్జన్యం దుర్మార్గమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. శాసనసభ ప్రాంగణంలో మహిళా ఎమ్మెల్యే సునీ తా లక్ష్మారెడ్డి చీరను పోలీసులు లాగి అవమానించడం అత్యంత శోచనీయమని ఆగ్రహం వ్యక్తంచేశారు. అమానుషంగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై తక్షణమే ఉన్నతస్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సర్కార్ అసమర్థ పాలనపై అసెంబ్లీలో నిలదీస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే విజయుడుతో కలిసి ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రశ్నించకుండా స్పీకర్ మైక్ లు కట్ చేసి తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల చుట్టూ మార్షల్స్‌ను మోహరించి రేవంత్ ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని మండిపడ్డారు.
దుర్యోధన పాలనలో దుశ్శాసన పర్వంలా తెలంగాణ అసెంబ్లీ పరిస్థితి మారిందని, గౌరవసభ కాస్త కౌరవసభలా తయారైందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి ఆలయంగా భావించే అసెంబ్లీలో ప్రజాప్రతినిధులపై వ్యవహరిస్తున్న తీరు అత్యంత దురదృష్టకరమని అన్నారు. మహిళా ఎమ్మెల్యేలు, ఇతర మహిళా ప్రజాప్రతినిధుల పట్ల అనుచిత, దురుసు ప్రవర్తన ప్రజాస్వామ్యంలో ఏమాత్రం సరికాదని పేర్కొన్నారు.
మహిళా ప్రజాప్రతినిధులు సబితాఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించడం, దాడికి పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి ఖండించారు. ప్రజాసమస్యలపై గళమెత్తుతున్న మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల ద్వారా దౌర్జన్యాలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని మండిపడ్డారు.
శాసనసభ ప్రాంగణంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత అమానుషమని, ఇది ముమ్మాటికీ క్షమించరాని నేరమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళా ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పోలీసులు వ్యవహరించారని, ఇది ముమ్మాటికీ వారిపై జరిగిన వివక్షాపూరిత దాడి అని మండిపడ్డారు.
మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత అవమానకరమని, ఇది ముమ్మాటికీ ‘దుశ్శాసన పర్వమే’నని వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి ధ్వజమెత్తారు. కనీస గౌరవం లేకుండా పోలీసులు మహిళా ఎమ్మెల్యేల జుట్టు పట్టుకొని లాగడం, గ్రిల్స్‌పై పడేలా తోసేయడం వంటి చర్యలు యావత్ మహిళా లోకానికి తీరని అవమానమని మండిపడ్డారు.
బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడం.. వారి గొంతు పట్టుకొని నెట్టేయడం అమానవీయమని ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పవిత్రమైన గౌరవసభను కౌరవసభగా మార్చిందని దుయ్యబట్టారు. రాజ్యాంగం గురించి గొప్పలు చెప్పే కాంగ్రెస్ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పవిత్రమైన శాసనసభను రేవంత్ సరార్ దుశ్శాసన సభగా మార్చివేసిందని బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి కోలేటి దామోదర్ ప్రకటనలో మండిపడ్డారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనా వైఫల్యాలను నిరసిస్తూ శాసనసభ సమావేశాలకు నల్ల దుస్తులతో హాజరయ్యేందుకు వచ్చిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో చేయించిన అణచివేత చర్యలపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై నిలదీస్తున్న బీఆర్ఎస్ నాయకులను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర భయాందోళనకు గురవుతున్నదని, ఆ అసహనంతోనే ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలపై నిరంకుశంగా విరుచుకుపడుతున్నదని ఆమె మండిపడ్డారు.
కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు ముఖ్య ప్రజాప్రతినిధులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం సోమవారం ప్రకటనలో ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజాసమస్యలను సభ దృష్టికి తెచ్చేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాంతియుతంగా నల్లదుస్తులతో అసెంబ్లీకి వస్తే నిర్బంధించడం దుర్మార్గమని మండిపడ్డారు.
శాంతియుతంగా నిరసన తెలిపిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి కాసర్ల ఖండించారు. ప్రతిపక్ష సభ్యులు ప్రజాసమస్యలపై లెవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇలాంటి దుర్మార్గానికి దిగిందని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనను బీఆర్ఎస్ దక్షిణాఫ్రికా నాయకుడు నాగరాజు గుర్రాల తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సభ్యులపై బలప్రయోగం చేయడం, మహిళా ప్రజాప్రతినిధుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం సభ్యసమాజం తలదించుకునే చర్యని పేర్కొన్నారు.