హైదరాబాద్: వరంగల్ (Warangal ) సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. అక్రమ కేసులో అరెస్టయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి బీఆర్ఎస్ నేతలు దాస్యం వినయ్ భాస్కర్, రాకేశ్ రెడ్డి తదతరులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని లోపలికి వెళ్లకుండా స్టేషన్ బయటే అడ్డుకున్నారు. పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు వాగ్వాదం చోటుచేసుకున్నది. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
మనోజ్ రెడ్డి అనే వ్యాపారిని బెదిరించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. అనంతరం వరంగల్‌కి తరలించారు. ఎమ్మెల్యే తరచూ బెరదింపులకు దిగుతున్నాడని, రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని మనోజ్‌రెడ్డి భార్య కట్టా ఉమాదేవి హనుమకొండ సుబేదారి పోలీసులకు ఏప్రిల్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై 308(2), 308(4), 352 బీఎన్ఎస్ సెక్షన్ల కింద సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మరికాసేపట్లో వైద్య పరీక్షల నిమిత్తం ఎంజీఎం దవాఖానకు కౌశిక్ రెడ్డిని తరలించనున్నారు. అక్కడి నుంచి జడ్జి ముందు హాజరుపరుచనున్నారు.