నమస్తే తెలంగాణ, నెట్వర్క్: మాటమార్చిన కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ కన్నెర్రజేసింది. అన్నదాతలకు అండగా రోడ్డెక్కింది. ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామన్న హామీపై కాంగ్రెస్ సర్కారు మాటమార్చి, సన్నవడ్లకు మాత్రమే వర్తింపజేస్తామన్న ప్రకటనపై భగ్గుమన్నది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు నిర్వహించారు.
నియోజకవర్గ కేం ద్రాల్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు రైతులతో కలిసి నిరసన తెలిపారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ రూ.500 ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా ప్రకటించడానికి నిరసనగా దీక్షలు చేపట్టారు. అన్ని రకాల వడ్లకు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు సమర్పించాయి. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నాయకులు మండిపడ్డారు.
కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో, చొప్పదండి, మానకొండూర్‌లో మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో, హుజూరాబాద్‌లో జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ నేతృత్వంలో, పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు నిరసనలు తెలిపారు.
గోదావరిఖనిలో బీఆర్ఎస్ జిల్లా అ ధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో, మంథనిలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. సిరిసిల్ల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వేములవాడలో బీఆర్ఎస్ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహరావు ఆధ్వర్యంలో, జగిత్యాలలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్‌కుమార్ నేతృత్వంలో బీ ఆర్ఎస్ శ్రేణులు, రైతులు నిరసన దీక్ష చేపట్టారు. ధర్మపురిలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఖానాపూర్ హైవేపై రైతుల రాస్తారోకో
ఆదిలాబాద్‌లో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ధర్నా నిర్వహించారు. బోథ్‌లో తహసీల్దార్‌కు వినతి పత్రంసమర్పించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో నిర్మల్-ఖానాపూర్-జగిత్యాల రహదారిపై చేపట్టిన రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోయాయి.
భైంసాలో పార్టీ నేత విలాస్ గాదేవార్ ఆధ్వర్యంలో నిరసనకు తెలిపి, ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. నిర్మల్‌లో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు రాము ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ప్రధాన రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, చెన్నూర్‌లో బీఆర్ఎస్ నాయకులు, రైతులు ధర్నా నిర్వహించారు. ఆసిఫాబాద్‌లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.
రైతులతో కలిసి ఆందోళనలు
ఉమ్మడి మెదక్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో జోగిపేటలోని హన్మాన్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులతో కలిసి ధర్నా నిర్వహించాయి. సంగారెడ్డిలోని ఆర్డ్డీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టాయి. కొత్త బస్టాండ్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయ ఏవోకు వినతిపత్రం అందజేశారు.
నారాయణఖేడ్‌లో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతుదీక్ష చేపట్టారు. నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. నర్సాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి అం బేద్కర్ చౌరస్తాకు ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో మానవహారం చేపట్టారు. మెదక్‌లో బీఆర్ఎస్ జిల్లా నేత మల్లికార్జున్‌గౌడ్ తదితరుల ఆధ్వర్యంలో ఆదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్ వద్ద రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి నిరసన చేపట్టారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులకు మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. మక్తల్‌లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, వనపర్తిలో గులాబీ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో నల్ల్ల కండువాలతో బీఆర్ఎస్ నేతలు నిరసనలో పాల్గొన్నారు. కొల్లాపూర్, పెబ్బేరు, గద్వాల, దేవరకద్రలోనూ బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు.
మిన్నంటిన నిరసనలు
ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా పలుచోట్ల రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. దేవరకొండలో నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, హాలియాలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలోనూ రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేశారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాలతోపాటు మండలాల్లోనూ రైతులు ఆందోళనలు చేశారు. కామారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. బాన్సువాడ, బాల్కొండ, ఆర్మూర్ తదితర ప్రాంతాల్లోనూ అన్నదాతలు నిరసన తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా నిరసన తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని మార్కెట్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు ధర్నా నిర్వహించారు.
వరంగల్ జిల్లా ఖానాపురంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు.