Vidyasagar Rao | హనుమకొండ : తెలంగాణ జల సిద్ధాంతకర్త ఆర్. విద్యాసాగర్ రావు వర్ధంతి కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లా బాలసముద్రలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్.. విద్యాసాగర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆర్. విద్యాసాగర్ రావు గారు తెలంగాణ తాగునీటి తండ్లాటను తీర్చడంలో విశేష కృషి చేశారు. ఆయన కేంద్ర జల కమిషన్‌లోని జలవనరుల మంత్రిత్వ శాఖకు చీఫ్ ఇంజనీర్‌గా పని చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఆయన తెలంగాణ ప్రభుత్వానికి నీటిపారుదల సలహాదారుగా పని చేశారు. ఆయన తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టులపై విశేషమైన అవగాహన, రూపకల్పనలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి నీటి కేటాయింపులో అన్యాయాలను ఎత్తిచూపడంలో కీలకపాత్ర పోషించారు అని తెలిపారు.
తెలంగాణలో నీటిపారుదల రంగానికి ఆయన చేసిన అపారమైన కృషికి గాను డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి “ఆర్. విద్యాసాగర్ రావు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం” అని పేరు పెట్టారు. ఫ్లోరైడ్ ప్రభావిత నల్గొండ జిల్లాకు సురక్షితమైన తాగునీటి కోసం, తెలంగాణ ప్రాంతంలోని శుష్క భూములకు నీటిని అందించాలని ఆయన పోరాడారు. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సర్, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌లతో కలిసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన పనిచేశారని వివరించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి సాగునీటి రంగంలో జరిగిన అన్యాయాలను వ్యాప్తి చేయడం ద్వారా ఆయన ఉద్యమానికి బలమైన పునాది వేశారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు, కంతనపల్లి ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు సహా పలు ప్రాజెక్టుల ప్రణాళిక, పునఃరూపకల్పనలో, మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందాలను సమన్వయం చేయడంలో, చెరువుల పునరుజ్జీవనం, పునరుద్ధరణ, మిషన్ కాకతీయ, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు నిర్వహణ మరియు నిర్వహణ మార్గదర్శకాలను రూపొందించడంలో ఆయన సహకారం అపారమైనదని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్, కార్పొరేటర్ చెన్నం మధు, డివిజన్ ప్రెసిడెంట్ అనిల్, మైనార్టీ నాయకులు నాయీముద్దీన్, నాయకులు వెంకన్న, వినీల్ రావు, రమేష్, రాకేష్ యాదవ్, శ్రీకాంత్ చారి, రఘు, సంపత్, మహేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.