KTR | వరంగల్, నవంబర్ 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పేదలు, రైతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పని చేయడంలేదని.. సొంత అన్న, అదానీ, సొంత అల్లుడు, సొంత తమ్ముడి కోసమే పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఫార్మా విలేజీ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి సొంత అల్లుడి ఫార్మా దుకాణం కోసం పేద రైతుల భూములను గుంజుకుంటున్నాడని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి సీఎం కుర్చీలో కూర్చొని మరో పది రోజులైతే ఏడాదవుతుందని, అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. గ్యారెంటీల అమలులో విఫలమైనందుకు రాష్ట్ర ప్రజలకు రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు వచ్చేదని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాత రైతు బంధు ఎగ్గొటిండని, రైతు బీమా బంధు పెట్టిండని, వడ్లకు బోనస్ బోగస్ అయ్యిందని మండిపడ్డారు. మహాలక్ష్మీ పథకం పేరు చెప్పి రేవంత్‌రెడ్డి మహారాష్ట్రలో తన్నులు తిన్నాడని ఎద్దేవాచేశారు.
తెలంగాణలో ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఇస్తున్నామని మహారాష్ట్రలో అబద్ధం చెప్పినందుకు అక్కడి ఆడబిడ్డలు గట్టిగా బుద్ధి చెప్పారని దెప్పిపొడిచారు. ‘తెలంగాణ ఆడబిడ్డలను మోసం చేసిండు.. మమ్మల్ని కూడా మోసం చేయడానికే వచ్చిండు అని మహారాష్ట్ర ఆడబిడ్డలు ముందే గమనించిండ్రు.. అందుకే చైతన్యంతో కాంగ్రెస్‌ను తన్ని తరిమికొట్టిండ్రు’ అని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోకవర్గం కొడంగల్‌లోని లగచర్ల గిరిజన, దళిత, పేద రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు నిరసనగా మహబూబాబాద్‌లో సోమవారం నిర్వహించిన గిరిజన మహాధర్నాలో కేటీఆర్ ప్రసంగించారు. ‘14 ఏండ్ల కిందట ఇదే మానుకోట ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద మలుపునకు కారణమైంది. మానుకోట రాళ్ల మహత్యమేమిటో తెలంగాణను అడ్డుకున్న ప్రతి ఒక్కడికీ తెలుసు’ అని హెచ్చరించారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములను గుంజుకుంటం.. ఏం చేసుకుంటారో చేసుకోండి అని నియంతలా విర్రవీగుతున్న రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా మానుకోట మహాధర్నాకు పెద్దఎత్తున గిరిజనులు, పేద రైతులు తరలివచ్చిండ్రు’ అని చెప్పారు. ‘రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని దుద్యాల మండలం లగచర్లలో తొమ్మిది నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల భూములను గుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నరు.. అందుకే అక్కడి రైతులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తిరగబడ్డరు.
పేద, చిన్న, సన్నకారు రైతులకు చెందిన మూడు వేల ఎకరాల భూములను ఫార్మా విలేజీ కోసం తీసుకుంటామని సీఎం, కాంగ్రెస్ ప్రభుత్వం కాగితాల మీద కాగితాలు కదుపుతుంటే అక్కడ ఉండే మన లంబాడా గిరిజనులు, బంజారా ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిండ్రు. భూముల కోసం అక్కడి రైతులు 9 నెలలుగా టెంట్ వేసుకుని ధర్నా చేస్తున్నరు’ అని వివరించారు. వారితో మాట్లాడేందుకు ముఖ్యమంత్రికి 9 నెలలుగా సమయం దొరకడం లేదని విమర్శించారు. మానుకోటలో ధర్నా కోసం డీజీపీకి ఫోన్ చేస్తే 30 మంది రైతుల కోసం సంఘీభావంగా మానుకోటలో ధర్నా ఎందుకు అన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ పేదలు, దళిత, గిరిజన, బలహీన అన్నదమ్ములున్నారో వారందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టంచేశారు.
నాలుగేళ్లు గట్టిగా కొట్లాడుదాం
పేదలు, రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కారుపై నాలుగేండ్లు గట్టిగా కొట్లాడుదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌పై పోరాటంలో మానుకోట ధర్నా మొదటి అడుగేనని ఊరూరా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతు కూడగడుతామని చెప్పారు. తెలంగాణలో గిరిజనులకు అండగా ఉండేది బీఆర్ఎస్ ఒక్కటేనని స్పష్టంచేశారు. ‘తెలంగాణఏర్పడిన తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ గిరిజనుల రిజర్వేషన్ కోటాను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచారు. గిరిజనులు సాగు చేసుకునే పోడు భూములకు పట్టాలిచ్చారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారు. అయినా కాంగ్రెస్ చెప్పిన కొన్ని మాయమాటలు నమ్మి మోసపోయినం. కానీ, రేపటి రోజున రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మానుకోటలోనే కాదు ఊరూరా ఉరికించి ఓట్లతో తరిమే బాధ్యత మీరే (గిరిజనులు) తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా మా కొడంగల్ ఆడబిడ్డల కోసం మద్దతు కూడగడతాం. మానుకోట మొదటి అడుగుతో రాష్ట్రమంతా తిరుగుతాం. రాష్ట్రంలోని ప్రతి తండా, ప్రతి పల్లె నుంచి పెద్దఎత్తును రైతులను కూడగడతాం. తెలంగాణ ఉద్యమంలో, ఇప్పుడు లగచర్ల గిరిజనుల కోసం మానుకోటలో కదంతొక్కి మాకు శక్తిని, ఉత్సాహాన్ని, స్ఫూర్తినిచ్చారు. మీ పోరాటాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. మానుకోటకు రుణపడి ఉంటాం.
తప్పుకుండా మా గిరిజనులకు ఎక్కడ కష్టం వచ్చినా అండగా ఉంటాం. బీఆర్ఎస్ అంటే బంజారా రాష్ట్ర సమితి అనే విధంగా మీ కోసం కదులుతాం. రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా గొంతు విప్పుదాం. మొన్న లగచర్లలో 30 మంది రైతులను జైల్లో పెడితే అక్కడి ఆడబిడ్డలు, బంజారా ఆడబిడ్డలు భయపడలేదు. జ్యోతి అనే ఆడబిడ్డ 9 నెలల కడుపుతో ఉన్నది. వద్దులేమ్మా నువ్వు ఉండు, ఢిల్లీకి వద్దు అంటే.. అన్నా నేను బంజారా బిడ్డను కొట్లాడుతా.. తప్పకుండా రేవంత్‌రెడ్డి భరతం పడతా అని ఢిల్లీ దాకా వచ్చింది. అక్కడ మానవహక్కుల కమిషన్, మహిళా కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలిసి ఒక జ్యోతి, ఒక దేవి, ఒక సోనిబాయి, ఒక కిష్టిబాయి, మిగతా ఆడబిడ్డలు వారి బాధ చెప్తుంటే అక్కడున్న కమిషన్ సభ్యుల కండ్లల్లో న్నీళ్లు తిరిగినయి. వాళ్లకు కన్నీళ్లు వస్తున్నాయి కానీ ఇక్కడ ఉన్న రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాత్రం గిరిజనబిడ్డల కష్టాలు కనిపిస్తలేవు. లగచర్లలో జరిగింది రేపు మనదగ్గర కూడా జరగొచ్చు. రేపు మానుకోటలో, మిర్యాలగూడలో, సాగర్‌లో, రాష్ట్రంలో ఎక్కడైనా జరగవచ్చు. అందుకే ఒక దగ్గర ఒకరికి అన్యాయం జరిగినా కొట్లాడాలె’ అని పిలుపునిచ్చారు
హైకోర్టు అనుమతితో విజయవంతంగా ధర్నా
లగచర్ల బాధితులకు అండగా మహబూబాబాద్‌లో ఈ నెల 21న మహాధర్నా నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు అనుమతితో సోమవారం మహాధర్నాను విజయవంతంగా నిర్వహించింది. బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అధ్యక్షతన జరిగిన మహాధర్నాలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జీ జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, రెడ్యానాయక్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ శంకర్‌నాయక్, హరిప్రియానాయక్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, సండ్ర వెంకటవీరయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, జడ్పీ మాజీ చైర్పర్సన్ అంగోతు బిందు పాల్గొన్నారు.
అన్యాయాన్ని చీల్చి చెండాడుతాం: శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి
రాష్ర్టాన్ని కేసీఆర్ అన్ని విధాలా అభివృద్ధి చేసి దేశంలో నంబర్‌వన్‌గా నిలిపితే రేవంత్‌రెడ్డి పాలనలో ఏడాది గడవక ముందే రాష్ర్టాన్ని మళ్లీ పదేండ్లు వెనక్కి తీసుకెళ్లాడని, కాంగ్రెస్ పాలనలో ప్రజలను నానా ఇబ్బందులు పడుతున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తంచేశారు. దళిత, గిరిజనులకు అన్యాయం చేస్తే చీల్చి చెండాడుతామని హెచ్చరించారు. కేసీఆర్ పాలన స్వర్ణయుగాన్ని తలపిస్తే.. రేవంత్ పాలన రాక్షస పాలనను తలపిస్తున్నదని మండిపడ్డారు. లగచర్లలో తరతరాలుగా సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న దళిత, గిరిజన రైతుల భూములను లాకోవాలని చూడడం రేవంత్‌రెడ్డి అవివేకమని, క్రూర మృగాలు వాటి పిల్లలను అవే తిన్నవిధంగా తనకు ఓట్లు వేసిన దళిత, గిరిజనులను రేవంత్‌రెడ్డి అతలాకుతలం చేస్తున్నాడని, ఈ దుర్మార్గానికి చరమ గీతం పాడాలని పిలుపునిచ్చారు.
కేటీఆర్‌ను చూసి రేవంత్ గుండెల్లో రైళ్లు : ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్
యువ నాయకుడు కేటీఆర్‌ను చూసి కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, అందుకే గిరిజన ధర్నాకు అనుమతి ఇవ్వకుండా చేశాడని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ చెప్పారు. ‘కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇక్కడ భారత్ జోడోయాత్ర చేసుకొవచ్చు.. రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేసుకోవచ్చు. కానీ మేం గిరిజన ధర్నా నిర్వహిస్తామంటే ఎందుకు అనుమతి ఇవ్వలేదు. కేటీఆర్ అంటే ఎందుకు నీకు అంత భయం? నువ్వు మా నాయకుడు కేటీఆర్‌కే గజగజ వణికిపోతున్నవు. మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ లేస్తే నువ్వు తట్టుకోగలవా? రేవంత్’ అని నిప్పులు చెరిగారు. గిరిజనులు, గిరిజన భూములకు కేసీఆర్ రక్షణ కవచంలా పనిచేస్తే రేవంత్‌రెడ్డి భక్షకుడిలా వచ్చి భూములను గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కుట్ర పన్నుతున్నాడని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి పని అయిపోయింది : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌రెడ్డికి ఓట్లు వేసి తప్పు చేశామని ఇప్పటికే తండాలు, గ్రామాల్లో చర్చ ప్రారంభమైందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. 420 హామీలు ఇచ్చి అమలు చేయని రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీకి పదే పదే పిలిచి కర్రు కాల్చి వాత పెడుతున్నా బుద్ధి రావడం లేదని విమర్శించారు. హామీలు అమలు చేయని రేవంత్‌రెడ్డిని త్వరలోనే తెలంగాణ ప్రజలు తరిమికొడతారని, రేవంత్‌రెడ్డి పని అయిపోయిందని ఎద్దేవాచేశారు.
రేవంత్‌ది.. రియల్ ఎస్టేట్ ఎజెండా : మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
లగచర్లలో దళిత, గిరిజన పేద రైతుల భూములను గుంజుకుంటున్న ప్రభుత్వం.. రానున్న రోజుల్లో మానుకోట, ములుగు, అదిలాబాద్, ఆసిఫాబాద్ ఎకడైనా ఇదే ఇబ్బంది సృష్టిస్తుందని, భూములు గుంజుకోవడం రియల్ ఎస్టేట్ చేయడమే ఎజెండాగా రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నాడని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ‘420 హామీలు పకకు పెట్టి భూమి కనిపిస్తే చాలు లాకోవడం.. అమ్ముకోవడం చేస్తున్నాడు. పేద రైతుల భూములను గుంజుకోవడం, ఎదురు తిరిగిన వారిని, మద్దతిచ్చిన వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టడమే పనిగా పెట్టుకున్నాడు. లగచర్ల ఘటనతోనే రేవంత్‌కు ఫుల్స్టాప్ పడింది. మానుకోట గడ్డ పోరాటాల అడ్డా.. తెలంగాణ వ్యతిరేకులను తరిమికొట్టి చరమ గీతం పాడింది ఇకడే. నువ్వు పోలీసులను పెట్టినా.. మిలటరీని దింపినా మా పోరాటం ఆగదు. లగచర్ల రైతులకు అండగా నిలిచిన మానుకోట దళిత గిరిజన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని చెప్పారు.
భూమి కోసం పోరాటం ఆగదు : ఆరెస్పీ
‘ఈ పోరాటం మన భూమి కోసం చేస్తున్నది. మన బిడ్డల భవిష్యత్తు కోసం పోరాటం చేయక తప్పదు. తెలంగాణ ఉద్యమంలో బహుజన గిరిజన బిడ్డలు ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన భూములను సీఎం రేవంత్‌రెడ్డి గుంజుకునుడు మొదలుపెట్టిండు. తండాలను కేసీఆర్ గ్రామ పంచాయతీలు చేశాడు. పోడు భూములకు పట్టాలిచ్చిండు. రేవంత్‌రెడ్డి వచ్చి భూములను గుంజుకుంటుండు. హాస్టల్లో ఉండే విద్యార్థులకు కేసీఆర్ సన్న బియ్యం ఇస్తే.. రేవంత్‌రెడ్డి వచ్చాక మన బిడ్డలు కలుషిత ఆహారం తిని చచ్చిపోతున్నరు. అయినా రేవంత్‌రెడ్డికి కనికరం లేకుండా పోయింది. కేసీఆర్ చూపిన ఒకే మాట ఒకే బాటలో మనం పయనిద్దాం. తమ భూమి ఇవ్వము అన్నందుకు జ్యోతిబాయి అనే 8 నెలల గర్భిణి జైల్లో ఉండి పోరాటం చేస్తున్నది. మనం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఏకమై పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు.
గులామీ చరిత్ర కాంగ్రెస్‌ది: కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టుపెట్టే చరిత్ర కాంగ్రెస్ పార్టీదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘పెండ్లికిపోతున్నవో.. పేరంటానికి పోతున్నవో.. 28 సార్లు డిల్లీకి పోయినవు.. 28 రూపాయలు కూడా తీసరాలేదని అడగటం మా బాధ్యత’ అని ఎక్స్‌వేదికగా పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా రాష్ర్టానికి హక్కుగా రావాల్సిన సొమ్ము మినహా ఈ ఏడాదిలో అదనంగా కేంద్రం నుంచి రేవంత్‌రెడ్డి రూపాయి కూడా తెచ్చింది లేదని దెప్పిపొడిచారు. ‘ఈడీ దాడుల నుండి తప్పించుకోవడానికి ఫైవ్‌స్టార్ హోటల్లో చీకట్లో కాళ్లు పట్టుకున్నదెవరో? ఆ దాడులను బయటకు ప్రకటించకుండా ఎవరి కాళ్లు పట్టుకుని తప్పించుకున్నారో? మీ బడేభాయ్..చోటే మియాల వ్యవహారం ఎవరికి తెలుసు పిట్టలదొరా?’ అని దెప్పిపొడిచారు. పోరాటం తెలంగాణ రక్తంలో ఉన్నదని, తాము సీఎం రేవంత్‌రెడ్డిలా ఏనాడూ ఢిల్లీకి గులాములం కాదని స్పష్టంచేశారు. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర కాంగ్రెస్‌దని, కొట్లాడి తెచ్చిన తెలంగాణను తెర్లు చేయాలని ప్రయత్నించి పట్టుబడిన ఓటుకు నోటు చరిత్ర రేవంత్‌రెడ్డిదని విమర్శించారు. తమ జెండా.. ఎజెండా ఎప్పటికీ తెలంగాణ అభివృద్ధేనని స్పష్టంచేశారు.
డీజీపీ..మాపైనే కేసులా?
రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ బీఆర్ఎస్ వాళ్లపైనే కేసులు పెడుతున్నాయని, దాడులు చేస్తామని బెదిరించిన కాంగ్రెస్ వాళ్లను మాత్రం ఏమీ అనడం లేదని కేటీఆర్ చెప్పారు. ‘మానుకోటకు నేను వస్తుంటే రాళ్లతో కొడతామని కొందరు ఎమ్మెల్యేలు అంటున్నరు. ఆ ఎమ్మెల్యేలు గిరిజన బిడ్డలే. లగచర్ల గిరిజనుల కోసం మేము ఇక్కడ కార్యక్రమం పెట్టుకుంటే దాడులు చేస్తామని బెదిరిస్తున్నరు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడుతామంటే మహబూబాబాద్ ఎస్పీ, రాష్ట్రంలో డీజీపీ ఏం చేస్తున్నారు? డీజీపీ.. కేసులు మా మీద మాత్రమే పెడుతారా? కాంగ్రెసోళ్ల మీద ఉండయా?’ అని నిలదీశారు. ‘కాంగ్రెసోళ్లు రాళ్లు, పెట్రోల్ పోసి తగులపెడతామంటే భయపడతామనుకున్నరా? ఇది కేసీఆర్ తయారు చేసిన బృందం.. కేసీఆర్ దళం, ఎవరికీ భయపడం’ అని స్పష్టంచేశారు.
మానుకోట రాళ్ల మహత్యమేమిటో తెలంగాణ రాష్ర్టాన్ని అడ్డుకున్న ప్రతి ఒక్కడికీ తెలుసు. మానుకోటలో 14 ఏండ్ల కిందనే నిప్పుపుట్టింది. తర్వాత తెలంగాణ వచ్చింది. ఇవ్వాళ మీరు వద్దంటే కోర్టుకు పోయినం. మీరు పర్మిషన్ ఇవ్వకుంటే కోర్టుకుపోయి తెచ్చుకున్నం. కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజల్లో ఎంత కోపమున్నదో.. ఎంత వ్యతిరేకత ఉన్నదో ఈ మానుకోట మహాధర్నా చూస్తుంటే తెలుస్తున్నది.
-కేటీఆర్
సొంత నియోజకవర్గంలో ఓటు వేసి గెలిపించిన అక్కడి గిరిజన ఆడబిడ్డలను, దళిత అన్నదమ్ములను కలుసుకునేందుకు ముఖ్యమంత్రికి తీరిక దొరుకుతలేదు. ఎక్కే విమానం, దిగే విమానం. ఢిల్లీకి పోవాలె రావాలె. 28 సార్లు పోయిండు.. 28 రూపాయలు కూడా తేలేకపోయిండు. అసోంటి ముఖ్యమంత్రి ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే తిరుగుబాటు ఎదుర్కొంటున్నడు.
-కేటీఆర్
లగచర్లలో అయిపోయింది కదా మళ్లీ మానుకోటలో ధర్నా ఎందుకు అంటున్నడు. ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్‌రెడ్డీ.. రాష్ట్రంలో ఎక్కడెక్కడ బీదవాళ్లు, ఎక్కడెక్కడ దళిత, గిరిజన, బలహీన అన్నదమ్ములున్నారో వాళ్లందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటది. అవసరమైతే మొత్తం 119 నియోజకవర్గాల్లో కొడంగల్ బక్కచిక్కిన రైతుల కోసం ధర్నా చేస్తది. కదం తొక్కుతది.. కదులుతది.. నీ ప్రభుత్వాన్ని, అధికారాన్ని కూకటివేళ్లతో పెకిలించివేస్తది.
-కేటీఆర్
లగచర్లలో మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేక ప్రదర్శన కాదు. అధికారులు వెళ్తే రైతులు నిరసనే తెలిపిండ్రు.. అదే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోతే ఉరికించి కొడుతరు. ఇదే వాస్తవం. భారతదేశంలో చాలా గొప్పోడిననుకునే ప్రధానమంత్రి నరేంద్రమోదీయే రైతుల ఆందోళనతో నల్లచట్టాలను వెనక్కితీసుకున్నడు. అలాంటి రైతులతోనే
రేవంత్‌రెడ్డి పెట్టుకున్నడు.
– కేటీఆర్