హైదరాబాద్, మే 1(నమస్తే తెలంగాణ) : కుల, జనగణన పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని కుట్రలకు తెరలేపాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మండిపడ్డారు. అధికారాన్ని కాపాడుకునేందుకు ఎత్తుగడలు వేస్తూ బలహీనవర్గాలకు అన్యాయం చేస్తున్నాయని నిప్పులుచెరిగారు. కులగణనకు చట్టబద్ధత కల్పిస్తామని ఏడాది నుంచి ఊదరగొట్టిన సీఎం రేవంత్ ఇప్పుడు చేతులెత్తేసి ప్రధాని మోదీకి వంత పాడుతున్నారని దుయ్యబట్టారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కోటాను ఎగ్గొట్టేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. గురువారం తెలంగాణ భవన్లో బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. మధుసూదనాచారి ముఖ్య అతిథిగా హాజరై కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ అవసరాల కోసమే పాలకులు కులగణనను వాడుకుంటున్నారని ఆరోపించారు.
బీసీల అభ్యున్నతిపై బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. దేశంలో 50 శాతం జనాభా ఉన్న బీసీలకు మంత్రిత్వ శాఖ ఎందుకు ఇవ్వలేదు? పదకొండేండ్లుగా అధికారంలోకి ఉన్న మోదీకి ఇప్పుడే కులగణన ఎందుకు యాదికొచ్చింది? అని ప్రశ్నించారు. హామీలను అమలుచేయకుండా ఓ వైపు మోదీ బీసీలను మోసం చేస్తుంటే, మరో వైపు రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ఎన్నికల మ్యానిఫెస్టో వాగ్దానాలను అటకెక్కించి ద్రోహం చేస్తున్నారని తూర్పారబట్టారు. పదేండ్ల కేసీఆర్ పాలనలోనే బడుగు, బలహీనవర్గాలు, కార్మికులకు మేలు జరిగిందని మధుసూదనాచారి తెలిపారు. మ్యానిఫెస్టోలో పెట్టని అనేక పథకాలను అమలు చేసి బీసీల జీవితాల్లో మార్పు తెచ్చారని కొనియాడారు. కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని, ఆయనతోనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈనెల 21, 22 తేదీల్లో తలపెట్టనున్న కార్మికుల సార్వత్రిక సమ్మెకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్టు మధుసూదనాచారి ప్రకటించారు. కేంద్రంలోని మోదీ సర్కారు కార్మిక చట్టాలను కాలరాస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ఎన్నికల హామీలను గాలికొదిలి కార్మికలోకానికి తీవ్ర అన్యాయం చేస్తున్నదని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమంలో ముఖ్యభూమిక పోషించిన కార్మికవర్గాన్ని కేసీఆర్ పాలనలో కంటికిరెప్పలా కాపాడుకున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గుర్తుచేశారు. దేశంలోనే ఎక్కడాలేనివిధంగా ఉద్యోగులకు 73 శాతం పీఆర్సీ ఇచ్చి భారీగా వేతనాలు పెంచిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. క్రమంతప్పకుండా డీఐలు, ఐఆర్‌లు ఇచ్చి ఆదర్శంగా నిలిచినట్టు పేర్కొన్నారు. అంబేద్కర్ సచివాలయంలో మొట్టమొదటి సంతకం చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. ప్రస్తుత రేవంత్ సర్కారు డీఏలు ఎగ్గొట్టినా, పీఆర్సీ మాటెత్తకున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడంలేదని అన్నారు. కేసీఆర్ పన్ను మాఫీ చేసి ఆటో కార్మికుల జీవితాలను గట్టెక్కిస్తే, రేవంత్‌రెడ్డి ఏడాదికి రూ.12 వేలు ఎగ్గొట్టి రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ హయాంలో హోంగార్డుల వేతనాలను రూ.30 వేలకు పెంచారని, శాంతా బయోటెక్‌లో ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేశారని గుర్తుచేశారు. రేవంత్ అస్తవ్యస్త పాలన చూస్తున్న ప్రజలకు కేసీఆర్ విలువ తెలుస్తున్నదని పేర్కొన్నారు. అందుకే మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2014 ముందు పరిస్థితులు పునరావృతమవుతున్నాయని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్యోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన ఘనత కేసీఆర్‌దేనని స్పష్టంచేశా రు. కానీ, అంతాసిద్ధం చేసిన ఫైల్‌పై సంతకం చేసి గొప్పగా చెప్పుకోవడం దుర్మార్గమన్నారు. ఇందుకోసం రూ.50 కోట్లు వెచ్చించి అడ్వైర్టెజ్మెంట్లు వేయించుకోవడం బాధాకరమన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నట్టు తెలిపారు.
సమస్యల కోసం పోరాడే కార్మిక వర్గానికి బీఆర్టీయూ అండగా ఉంటుందని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ భరోసా ఇచ్చారు. హక్కుల సాధనకు వారి తరఫున ఉద్యమిస్తామని స్పష్టంచేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతూ కార్మికలోకాన్ని దగా చేస్తున్నదని విమర్శించారు. అధికారంలోకి రాగానే అంగన్వాడీలు, ఆశ కార్యకర్తల వేతనాలు పెంచుతామని చెప్పిన రేవంత్ సర్కారు ఇప్పుడు ఆ ఊసే మరిచిందని దుయ్యబట్టారు. ఆటోడ్రైవర్ల నుంచి హమాలీల దాకా అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఉద్యోగ సంఘాల నాయకులు దానకర్ణాచారి, బాలకృష్ణ, నారాయణ ఆరోపించారు. కార్యక్రమంలో హమాలీ శ్రీనివాస్, నిర్మలారెడ్డి, కాశిరెడ్డి పాల్గొన్నారు.