హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు ఇటీవల పాదయాత్రకు పిలుపునిచ్చారు. దీంతో రేవంత్‌రెడ్డి సర్కార్‌లో కదిలిక మొదలైంది. గులాబీశ్రేణుల పోరుబాట నినాదంతో కాంగ్రెస్ సర్కార్ హడావుడి చేస్తున్నది. మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నది. ఆగమేఘాల మీద అధికారులకు ఆదేశాలను జారీ చేస్తున్నది. మంగళవారం ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మరోవైపు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వేర్వేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహించడం గమనార్హం.
ఇటీవల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్‌రెడ్డి, సురభి వాణీదేవి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి తదితర ముఖ్యనేతలందరూ సమావేశమయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తదితర సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్ర భుత్వం నిర్లక్ష్యం చేస్తున్న తీరుపై చర్చించారు.
ప్రాజెక్టు పనులను పూర్తి చేసే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పో రుబాట పట్టాలని నిర్ణయించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని మొదటిదైన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉద్దండాపూర్ వరకు పాదయాత్ర చేపట్టాలనే అభిప్రాయానికి వచ్చా రు. యాత్రకు కేటీఆర్, తదితర నేతలను పాదయాత్ర ముగింపు సభకు కేసీఆర్‌ను ఆహ్వానించాలని నిర్ణయించారు.
బీఆర్ఎస్ నేతల పిలుపుతో కాంగ్రెస్ నేతల్లో వణుకు మొదలైంది. అందుకు కారణం లేకపోలేదు. పాలమూరు జిల్లాలో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ హయాంలో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ హయాంలోనే 90% పనులు పూర్తయ్యాయి. మిగిలిన 10% పనులను కాంగ్రెస్ సర్కార్ పెండింగ్‌లో పెట్టింది. ఆయా పనులను పూర్తి చేసి ఉంటే నార్లపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు కృష్ణా జలాలను తరలించే అవకాశముండేది. దాదాపు 65 టీఎంసీలకుపైగా జలాలను నిల్వ చేసుకొనే వెసులుబాటు తెలంగాణకు కలిగేది. తద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు తాగు, సాగునీటికి పూర్తి భరోసా లభించేది. కానీ, మిగిలిపోయిన కొద్దిపాటి పనులను పూర్తి చేయకుండా రేవంత్ సర్కార్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. దీనిపై జిల్లా రైతులు ఇప్పటికే తీవ్ర అసహనంగా ఉన్నారు. తాజాగా ప్రాజెక్టు పనుల విషయంలో బీఆర్ఎస్ శ్రేణులు పిలుపునివ్వడంతో జిల్లా కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైంది. ప్రాజెక్టులకు సంబంధించిన పనులపై హడావుడి ప్రారంభించారు.
గతంలోనూ కాంగ్రెస్ పెద్దలు, జిల్లా పార్టీ నేతలు ఇదే తీరుగా వ్యవహరించారు. బీఆర్ఎస్ శ్రేణులు పోరాటానికి దిగడమే ఆలస్యం.. వెంటనే హడావుడి చేయడం కాంగ్రెస్ నేతలకు పరిపాటిగా మారింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నీటి కోటాను 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు కాంగ్రెస్ సర్కార్ కుదించగా, ఇది పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయమని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో ఉక్కిరిబిక్కిరైన ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ప్రాజెక్టులు, నీటివాటాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ను ఏర్పాటు చేసింది.
అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మోటర్లను ఆన్ చేసి నీళ్లు ఇవ్వాలని, లేదంటే రైతులతో తరలివచ్చి మోటర్లను ఆన్‌చేస్తామని బీఆర్ఎస్ అల్టీమేటం జారీ చేసింది. దీంతో కాంగ్రెస్ ప్ర భుత్వం వెంటనే మోటర్లను ఆన్ చేసింది. తాజాగా పాలమూరు ప్రాజెక్టు పనులపై బీఆర్ఎస్ నిలదీసిన వెంటనే సీఎం రేవంత్, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇలా ప్రతి అంశంలోనూ బీఆర్ఎస్ నిలదీయడం, కాంగ్రెస్ సర్కార్ కదలడం పరిపాటిగా మారింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెం దిన కాంగ్రెస్ మంత్రులు, నేతలతో కలిసి సచివాలయంలో మంత్రి ఉత్తమ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దేవాదుల, ఎస్ఎల్బీసీ, సీతారామ ప్రాజెక్టులతో సరి సమానంగా పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసి సమృద్ధిగా సాగునీరు, తాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. జూరాల ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు డ్రిప్న కు ప్రతిపాదనలు పింపినట్టు వెల్లడించా రు. మరో 15 రోజుల్లో ప్రత్యేక సమీక్షా ఏర్పాటు చేస్తామని, పనుల పురోగతిపై సమగ్రమైన నివేదికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి, కే రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితోపాటు సీఎస్ రామకృష్ణారావుతో ఎంసీహెచ్ఆర్డీలోని క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయ్యా రు.
జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై చర్చించి, కీలకమైన సూచనలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రాజెక్టుల భూసేకరణ నిధుల విషయంలో జాప్యం లేకుం డా వెంటనే చెల్లింపులు జరిగేలా చర్య లు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పెండింగ్ బిల్లులను చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల విషయంలో కూడా భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.