బోధన్/బాన్సువాడ, జనవరి 9: ఆరు గ్యారంటీల పేరిట రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. బోధన్‌లో సబ్ కలెక్టరేట్‌ను ముట్టడించగా, బాన్సువాడలో ధర్నా నిర్వహించారు. రైతు భరోసాలో కోత విధించడంతో పాటు రైతులు ప్రమాణపత్రం ఇవ్వాలంటూ షరతు విధించటంపై మండిపడతూ బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేశారు.
మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ సతీమణి, బీఆర్ఎస్ నాయకురాలు ఆయేషా ఫాతిమా మాట్లాడుతూ.. రైతుబంధు కావాలంటే రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలంటూ షరతు విధించటం విమర్శించారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ బాన్సువాడలో ఎడ్లబండితో నిరసన తెలిపారు.