నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూన్ 30 (నమస్తే తెలంగాణ): మహాన్యూస్ టీవీ కార్యాలయంపై దాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌తోపాటు 12 మందికి నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ భారతి సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులను అరెస్టు చేసిన అనంతరం ఆదివారం రాత్రి మేజిస్ట్రేట్ ఇంటివద్ద హాజరుపరిచారు. అయితే మేజిస్ట్రేట్ వారిని వెంటనే వ్యక్తిగత బాండ్‌పై విడుదల చేస్తూ సోమవారం కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు. దీంతో 13 మంది నిందితులు సోమవారం కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా సుమారు గంటసేపు నిందితుల తరఫు న్యాయవాది కిరణ్‌కుమార్ వాదనలు వినిపించారు.
హత్యాయత్నం సెక్షన్‌తో పాటు బలవంతంగా చొరబడి నష్టం కల్పించారని 10 సంవత్సరాలలోపు శిక్షలు పడే సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని తెలిపారు. మహాన్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ డాక్టర్ కే అజిత ఇచ్చిన ఫిర్యాదులో ఆ విషయాలను పొందపర్చలేదని చెప్పారు. ఫిర్యాదులో లేని అంశాల ఆధారంగా సెక్షన్లు ఎలా నమోదు చేశారని పోలీసుల అధికారులను మేజిస్ట్రేట్ ప్రశ్నించారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఫిలింనగర్, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్లతోపాటు నిందితుల తరఫు న్యాయవాది కిరణ్‌కుమార్‌తో ఈ కేసు తీర్పు గురించి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫిర్యాదులోలేని అంశాలకు సెక్షన్లు ఎలా నమోదు చేస్తారని మేజిస్ట్రేట్ పోలీసు అధికారులను అడిగారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఈ కేసులో కొన్ని సెక్షన్లు వర్తించవని పేర్కొంటూ బెయిల్ మంజూరు చేశారు. పోలీసులు సెక్షన్లు 331(5), 331(7), 109 (1), 118 (1), 126 (2), 324 (5), 324 (6), 351(3) 238, 49 79 రెడ్‌విత్ 3(5) బీఎన్ఎస్ కింద నమోదు చేసిన కేసు డైరీని కోర్టుకు సమర్పించారు. నిందితులు నేరుగా కోర్టునుంచి విడుదలయ్యారు.
ప్రభుత్వ ఒత్తిడితోనే మాపై కేసు: గెల్లు శ్రీనివాస్
ప్రభుత్వ ఒత్తిడితోనే పోలీసు అధికారులు అక్కసుతో బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసు బనాయించారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆరోపించారు. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. న్యాయం నిలుస్తుందని, చట్టాలపై తమకు నమ్మకముందని తెలిపారు. భవిష్యత్తులో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవితపై మరోసారి తప్పుడు వార్తలు ప్రసారం చేయరాదనే సంకేతం ఈ తీర్పు ద్వారా వెల్లడైందని అన్నారు. మహాన్యూస్‌పై తామిచ్చిన ఫిర్యాదులను పోలీసు అధికారులు పక్కనబెట్టి తర్వాత ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు చేపట్టడం చట్ట వ్యతిరేకమని అన్నారు. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.