హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): మానవ మృగాలకు ప్రతిరూపాలు కాంగ్రెస్ పాలకులేనని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. ఎమర్జెన్సీతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఇందిరాగాంధీ మానవ మృగానికి ప్రతీక అని దుయ్యబట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడిన తీరును, ఆయన భాషను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జోగు రామన్న, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, పల్లె రవికుమార్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్రాచారితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అహింసా పద్ధతుల్లో తెలంగాణ తెచ్చిన మరో మహాత్మాగాంధీ కేసీఆర్ అని మధుసూదనాచారి కొనియాడారు. ఢిల్లీలోని టర్క్‌మెన్ గేట్ వద్ద వేలాది పేదల ఇండ్లను ఇందిరాగాంధీ కూల్చారని, 1969 ఉద్యమంలో వందలాదిమందిని పొట్టనపెట్టుకున్న కాంగ్రె స్లోనే అసలైన మృగాలు ఉన్నాయన్నారు.
కేసీఆర్ హయాంలో కట్టిన భవనాలకే రేవంత్‌రెడ్డి రిబ్బన్ కటింగ్ చేస్తున్నారని మాజీమంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్లినా కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, అలాంటి రేవంత్ తెలంగాణ సాధించిన కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు బాధాకరమని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓయూ లాంటి వేదికపై సీఎం పిచ్చి మాటలు మాట్లాడటం సబబు కాదని హితవు పలికారు.
కేసీఆర్ దీక్ష చేస్తున్నప్పుడు ఉద్యమ వ్యతిరేక శిబిరంలో ఉన్నవారే అసలైన మానవ మృగాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓయూలో మాట్లాడిన భాష దుర్మార్గమని, విజ్ఞత లేకుండా మాట్లాడారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ మండిపడ్డారు.
తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, ఆయనను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్చాలని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్రాచారి అన్నారు. మలిదశ ఉద్యమంలో 1,200 మంది చావుకు కారణమైన కాంగ్రెస్సే అసలైన మానవమృగమని పేర్కొన్నారు. కల్వకుర్తి శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల్లో వందసీట్లు గెలుస్తామని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్తున్నారని, అంతకంటే ముందు పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, తిరిగి గెలిపించుకోవాలని సిరికొండ డిమాండ్ చేశారు. బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ కల్పించకుంటే రేవంత్‌రెడ్డికి రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. ప్రగతి భవన్లో కంచెలు తీశామని చెప్తున్న రేవంత్‌రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు కంచెలు వేయించారని నిలదీశారు. ముఖ్యమంత్రి తన స్థాయికి, పదవికి వన్నె తెచ్చేలా మాట్లాడాలని హితవు పలికారు.