నల్లగొండ : నాగార్జునసాగర్(Nagarjunasagar) నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్ష పూరిత రాజకీయాలు చేస్తు న్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. బుధవారం హాలియాలోని మాజీ ఎమ్మెల్యే నోముల భగవత్ కుమార్ నివాసంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి(MLA Jaiveer Reddy), మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సాగర్ హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఇంటిని సీజ్ చేయించారన్నారు.
పార్లమెంట్ ఎన్నికలవేళ నాగార్జునసాగర్‌లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు మాజీ ఎమ్మెల్యే ఇంటిని సీజ్ చేశారన్నారు. సాగర్ ఎన్ఎస్పీ క్వాటర్స్‌లో మాజీ ఎమ్మెల్యే జానారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాసం ఉండగా, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఎందుకు నివాసం ఉండకూడదని ప్రశ్నించారు.
నోముల కుటుంబం నియోజకవర్గంలో నివాసం ఉంటే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అన్న దురుద్దేశంతో ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, జానారెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తూ నోముల కుటుంబాన్ని ఇబ్బందుల గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఏదో గాలి వాటంలో ఎమ్మెల్యేగా గెలిచిన జయవీర్ రెడ్డి అధికారం ఎప్పటికీ ఎవరికి శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
జానా రెడ్డి కుటుంబం నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధి చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. జానా రెడ్డి కుటుంబం అంత నిజాయితీపరులైతే హాలియా ఐటీఐ కళాశాల స్థలాన్ని ఎందుకు ఆక్రమించుకున్నారని ప్రశ్నించారు. 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రైతు విశ్రాంతి భవనానికి దారేదని నిలదీశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు, చైతన్యవంతులు సమయం వచ్చినప్పుడు జానా కుటుంబానికి కర్రు కాల్చి వాత పెట్టడం తథ్యమన్నారు.