హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): నక్సలైట్ల ఏరివేతలో అత్యంత కీలకపాత్ర పోషించిన గ్రేహౌండ్స్ విభాగాన్ని మూసివేయాలని ప్రభుత్వం భావిస్తున్నదా? గ్రౌహౌండ్స్ ఆధీనంలో ఉన్న 550 ఎకరాల భూములను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించిందా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానమే వస్తున్నది. దేశంలో ఈ నెలాఖరుకు (మార్చి 31 డెడ్‌లైన్) నాటికి మావోయిస్టులను సంపూర్ణంగా నిర్మూలించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ లక్ష్యాన్ని దాదాపు పూర్తి చేసింది. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో పలువురు కీలక నేతలు ఎన్కౌంటర్లలో చనిపోవడం, మరి కొందరు అగ్రనేతలు లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ దాదాపు ఉనికి కోల్పోయే స్థితికి చేరుకున్నది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల కదలికలను కట్టడి చేసేందుకు ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్ దళాలతో పనిలేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. గ్రేహౌండ్స్‌లో పనిచేస్తున్న వారిని పోలీసు శాఖలోని ఇతర విభాగాల్లోకి బదిలీ చేయాలని, గ్రేహౌండ్స్‌కు కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వినియోగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.
ఆ భూములను అమ్మేస్తే ప్రభుత్వానికి భారీ మొత్తంలో నిధులు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్న ప్రభుత్వం.. ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. గ్రేహౌండ్స్‌కు రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూములున్నాయి? వాటిలో విలువైన భూములు ఎక్కడ ఉన్నాయనే అంశంపై దృష్టిపెట్టారు. గ్రేహౌండ్స్‌కు హైదరాబాద్ చుట్టుపక్కల అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో మొత్తం 550 ఎకరాల భూమి ఉన్నదని అధికారులు గుర్తించారు. ఈ భూముల విలువ ఇప్పుడు కొన్నివేల కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. సగటున రూ.50 కోట్లకు ఎకరం చొప్పున అమ్మినా రూ.20 వేల కోట్లకుపైగా ప్రభుత్వానికి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో కొంత భూమిని ప్రభుత్వం ఉంచుకున్నా, కనీసం 500 ఎకరాల భూమిని సులువుగా అమ్ముకోవడానికి అనుకూలంగా ఉన్నదని అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కన రూ.20 వేల కోట్లు సమకూరుతాయని భావిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొదలుపెట్టాలని, ఒక ఏడాదిలోపు మొత్తం అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
1989లో గ్రేహౌండ్స్ ఆవిర్భావం
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పీపుల్స్‌వార్ ప్రస్తుత మావోయిస్టుల ప్రాబల్యాన్ని అడ్డుకొనేందుకు ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చొరవతో 1989లో గ్రౌహౌండ్స్ దళాన్ని ఏర్పాటు చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ గ్రేహౌండ్స్ విభాగానికి రూపకల్పన చేశారు. గ్రేహౌండ్స్ దళాలకు శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ శివారులోని ప్రేమావతిపేటలో సుమారు 150 ఎకరాల్లో శిక్షణ కేంద్రం ఏర్పాటుచేశారు. దీంతోపాటు మరో శిక్షణ కేంద్రం, పరిపాలనా కేంద్రం మంచిరేవులలో సుమారు 400 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. నిరంతరం ఇక్కడ పోలీసులకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. 1989 నుంచి ఇప్పటివరకు వేలాది మంది పోలీసులు గ్రేహౌండ్స్‌లో శిక్షణ పొందారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో జరిగిన అనేక కూంబింగ్ ఆపరేషన్లలో గ్రేహౌండ్స్ దళాలు పాల్గొన్నాయి.
మావోయిస్టులు లేనందున మూసేద్దాం!
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న డెడ్‌లైన్ ప్రకారం దేశవ్యాప్తంగా మావోయిస్టుల నిర్మూలన కార్యక్రమం దాదాపు విజయవంతమైన నేపథ్యంలో ఇంకా గ్రేహౌండ్స్‌తో పని ఏమిటని పోలీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రశ్నించారని తెలిసింది. గ్రేహౌండ్స్ పార్టీలు ఇప్పుడు పెద్దగా కూంబింగ్ కూడా చేయడంలేదని, ఇక వీరితో పని ఉండదని, మొత్తానికి మొత్తం గ్రేహౌండ్స్ విభాగాన్ని ఎత్తేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందని సమాచారం. ఇప్పుడు సుమారు పన్నెండు వందల మందికిపైగా ఉన్న సిబ్బందిని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, ఏఆర్, సివిల్ తదితర విభాగాలకు పంపించివేస్తున్నారు. చాలామంది కానిస్టేబుళ్లు, ఇతర అధికారులను పోలీసు శాఖలోని వివిధ విభాగాల నుంచి గ్రేహౌండ్స్‌కు గతంలో పంపించారు. అలాంటివారిని వారివారి మాతృవిభాగాలకు పంపించివేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
విభాగాన్ని మూసేయొద్దు
గతంలో గ్రేహౌండ్స్‌లో పనిచేసిన అధికారులు, సిబ్బంది మాత్రం గ్రేహౌండ్స్‌ను పూర్తిగా మూసివేయొద్దని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా గ్రేహౌండ్స్‌ను పోలీసు అధికారులు తీర్చిదిద్దారని, దేశంలోనే తెలంగాణ గ్రేహౌండ్స్‌కు మంచి పేరున్నదని, అలాంటిది ఇప్పుడు మావోయిస్టులు లేరన్న పేరుతో ఇప్పటికిప్పుడు తీసివేయడం తగదని చెప్తున్నారు. ఇదే గ్రేహౌండ్స్‌ను మరో విధంగా వాడుకోవచ్చని, దీనిపై ప్రభుత్వ స్థాయిలో చర్చ జరగాలని భావిస్తున్నారు. అంతేకాకుండా, గ్రౌహౌండ్స్‌కు ఉన్న విలువైన భూమిని ప్రైవేట్‌పరం చేయొద్దని, భవిష్యత్‌లో పోలీసు అవసరాలకు భూమి దొరకడం కష్టమని, దీనిని పోలీసు శాఖకు సంబంధించిన భవిష్యత్ అవసరాలకు ఉపయోగిస్తే మంచిదని, ఇతరత్ర శిక్షణ కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించాలని సూచిస్తున్నారు.