BRS | హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): ఫార్మా క్లస్టర్ ఏర్పాటుతో తమ భూములు పోతాయ ని కడుపుమండిన రైతులు అధికారులపై తిరగబడితే దానిని తమ పార్టీకి అంటగడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వికారాబా ద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మం డలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఇతర అధికారులతో కలిసి ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లగా, వారిపై రైతులు ఒక్కసారిగా తిరగబడ్డారు. అయితే, బీఆర్ఎస్ నేతలే అధికారులపై దాడి చేసినట్టుగా కాంగ్రెస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు సైతం ఈ ఘటనను బీఆర్ఎస్కు చుట్టేందుకు ప్రయత్నించడాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం తప్పుపడుతున్నారు. ‘రైతుల సమస్యలను పరిష్కరించకుండా రాజకీయం చేయడమేమి టి? ఉద్రిక్త పరిస్థితుల్లో అక్కడికి కలెక్టర్ వెళ్లాల్సిన అవసరం ఏమిటి? క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో ఎందుకు అంచనా వేసుకోలేదు’ అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యంపై పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.
కలెక్టర్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?
కొడంగల్ నియోజకవర్గంలో ప్రభుత్వం ఫార్మా క్లస్టర్ ఏర్పాటు కోసం భూసేకరణ ప్రారంభించింది. అక్కడ కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలే అక్కడికి వెళ్లిన ఒక అధికారిని రైతులు నిర్బంధించారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని, రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ప్రభుత్వానికి, కలెక్టర్‌కు తెలుసు. అయినప్పటికీ కలెక్టర్ అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది రాజకీయ విశ్లేషకుల ప్రశ్న. ఒకవేళ ప్రజాభిప్రాయ సేకరణ కోసం తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అనే అంశంపై కలెక్టర్ ఎందుకు ఆరా తీయలేదనేది మరో ప్రశ్న.
పరిస్థితులను ఎందుకు చక్కదిద్దలేదు?
ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రాంతానికి కలెక్టర్ వస్తుంటే, స్థానిక యంత్రాంగం అంతకుముందే అక్కడ పరిస్థితులను పూర్తిగా అదుపులోకి తీసుకోవాలి. గ్రౌండ్ప్రిపేర్ చేయాలి. కలెక్టర్ రావడానికి కన్నా ముందే రైతులతో మాట్లాడి, ప్రశాంత వాతావరణంలో కలెక్టర్‌తో చర్చలు జరిపేలా రైతులను ఒప్పించాలి. ఇలాంటి చర్యలు తీసుకోవడంలో స్థానిక రెవెన్యూ యంత్రాంగం విఫలమైంది.
పరిస్థితి తెలిసీ కలెక్టర్ వెళ్లారా?
ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి కలెక్టర్ ప్రతీక్‌జైన్ కూడా సరిగ్గా వ్యవహరించలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే అంశంపై ఆయన పోలీస్ శాఖను రిపోర్ట్ కోరాలి కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఆయన పోలీస్ రిపోర్ట్ ఎందుకు కోరలేదు? ఒకవేళ కోరితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా ఎందుకు వెళ్లారు? అని ప్రశ్నిస్తున్నారు.
ఇంటెలిజెన్స్, పోలీస్ శాఖ వైఫల్యం కాదా?
ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రాంతానికి కలెక్టర్ వస్తున్నారంటే అక్కడి పరిస్థితులపై ఇంటెలిజెన్స్, పోలీస్ శాఖ ముందుగా సమాచారం సేకరించాల్సిన అవసరం లేదా? అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని, అక్కడికి రావొద్దని కలెక్టర్‌కు ముందే ఎందు కు సూచించలేదు? ఒక కలెక్టర్‌పై రైతులు తిరగబడే పరిస్థితి వచ్చే వరకు ఇంటెలిజెన్స్, పోలీస్ శాఖ ఏం చేస్తున్న? ఇది ఇంటెలిజెన్స్, పోలీస్ శాఖ వైఫల్యం కాదా? అని విశ్లేషకులు ప్రశ్నలు సంధిస్తున్నారు.
రావొద్దని ముందే హెచ్చరించిన రైతులు
అభిప్రాయ సేకరణకు కలెక్టర్ వస్తున్నారని రైతులకు అధికారులు సమాచారం అందజేశారు. భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులు ఇక్కడికి ఎవరూ రావొద్దని ముందే హెచ్చరించారు. ఫార్మా క్లస్టర్ కోసం గజం భూమినీ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. రైతుల హెచ్చరికలను, అల్టిమేటమ్‌ను పట్టించుకోకుండా కలెక్టర్, అధికారులు అక్కడికి భూసేకరణకు కోసం వెళ్లారు. అప్పటికే ప్రభుత్వంపై పీకల్లోతు కోపంతో ఉన్న రైతులకు అధికారులను చూడగానే పుండు మీద కారం చల్లినట్టయ్యింది. భూమిని రక్షించుకోవాలనే ఆలోచనతో వచ్చింది కలెక్టర్ అని చూడకుండా తిరగబడినట్టు స్పష్టమవుతున్నది.
రైతులను రెచ్చగొట్టిన రేవంత్ అనుచరులు
భూములు ఇచ్చేది లేదని రైతులు భీష్మించుకూర్చున్నారు. రైతులకు నచ్చజెప్పాల్సిన ప్రభుత్వం వారిపైకి తమ అనుచరులను వదిలినట్టు తెలిసింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి అనుచరులు కొంతమంది రైతులపై బెదిరింపులకు దిగినట్టు తెలిసింది. ‘మీరు భూములు ఎట్లా ఇవ్వరో చూస్తాం. ఏం చేసైనా సరే భూములు తీసుకోవడం ఖాయం’ అంటూ హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో రైతుల్లో మరింత ఆగ్రహం పెరిగింది. ‘మా ప్రాణాలు పోయి నా సరే భూమిని ఇచ్చేది లేదు’ అంటూ రైతులు మొండికేసినట్టు తెలిసింది. రైతులను రెచ్చగొట్టడం, బెదిరించడంతోపాటు ఉద్రిక్త పరిస్థితులున్న సమయంలో కలెక్టర్, అధికారులు అక్కడికి వెళ్లారు. ఇన్ని తప్పులు ప్రభుత్వం వైపు పెట్టుకొని రైతులు తిరగబడితే దానిని బీఆర్ఎస్కు అంటగట్టే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.
బీఆర్ఎస్కు ఏం సంబంధం?
కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల ను బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ఎండగడుతున్నది. రైతుల పక్షాన పోరాడుతున్నది. అయితే ఇది ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. తమ పార్టీని బద్నాం చేయాలనే కుట్రపూరిత ఆలోచనలకు కాంగ్రెస్ తెరతీసిందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇందులో భాగంగానే కొడంగల్‌లో ఫార్మా క్లస్టర్ భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు అధికారులపై తిరగబడితే ఈ ఘటనను బీఆర్ఎస్కు ఆపాదించే ప్రయత్నం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రైతులు తిరగబడితే బీఆర్ఎస్కు ఏం సంబంధం అనే ప్రశ్న ఎదురవుతున్నది? ఇది ముమ్మాటికీ బట్ట కాల్చి మీదేసే విధానమే తప్ప మరొకటి కాదని విశ్లేషకులు చెప్తున్నారు.