నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 14: ధాన్యం, మక్కల కొనుగోలు తీరుపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. పంటలు కొనుగోలు చేయడంలో తాత్సారం చేయడంపై మండిపడ్డారు. నెలన్నర దాటినా కాంటా పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కార్కు ముందుచూపు లేదని, కావాలనే రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. గురువారం పలు జిల్లాల్లో రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సందర్శించారు. ధాన్యం నిల్వలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కేంద్రాలకు ధాన్యం తెచ్చి 45 రోజులు గడిచినా ప్రభుత్వం కొనకపోవడం దారుణమని అన్నారు. వెంటనే కొనకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెంలోని ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో రైతుల ఇబ్బందులను తెలుసుకొన్నారు. రైతులకు బస్తాలు ఇవ్వాలని, హమాలీలతో కాంటా వేయించాలని ఆయన డిమాండ్ చేశారు. వారం రోజుల్లో ధాన్యం, మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం మన్నెగూడెం కొనుగోలు కేంద్రం వద్ద రోడ్డుపై బైఠాయించారు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్లో కరీంనగర్-వరంగల్ హైవేపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. వీరికి మద్దతుగా బీఆర్ఎస్, ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి 40 రోజులైనా కాంటా వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రటి ఎండలో పడిగాపులు పడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాస్తారోకోలో తాడికల్ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు మహిపాల్, బీజేపీ నాయకుడు రాములు పాల్గొన్నారు.