హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కేంద్ర ప్రభుత్వం వెనకి పంపడం దుర్మార్గమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత డాక్టర్ సీ లక్ష్మారెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. తెలంగాణ నీటి హకులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రా అధికారుల చేతుల్లో పెట్టిందని, చంద్రబాబు ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టుకు లేని అభ్యంతరాలు పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆంధ్రా ప్రయోజనాల కోసం బీజేపీ తెలంగాణను బలిపెడుతున్నదని ఆరోపించారు.
తెలంగాణకు చెందిన ఎనిమిది మంది బీజేపీ, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు చేతులు ముడుచుకొని కూర్చున్నారని, రాష్ట్ర ప్రాజెక్టుల కోసం పార్లమెంట్లో ఒకరు కూడా గళమెత్తడం లేదని విమర్శించారు. కర్ణాటకకు చెందిన ఓ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం.. పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే హైడ్రాలజీ మినహా పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అవసరమైన అన్ని అనుమతులు సాధించామని తెలిపారు. చివరి నిమిషంలో డీపీఆర్‌ను వెనకి పంపడం సరికాదని పేర్కొన్నా రు. కేంద్రం వెంటనే పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను ఆమోదించాలని డిమాండ్ చేశారు. డీపీఆర్ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షంతో కూడిన ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి పంపాలని సూచించా రు. పాలమూరు రైతాంగానికి అన్యా యం జరిగితే సీఎం రేవంత్‌రెడ్డి, కాం గ్రెస్ నేతలు చరిత్రలో శాశ్వత ద్రోహులుగా నిలిచిపోతారని హెచ్చరించారు.