తెలంగాణలో గత రెండు వారాలుగా జరుగుతు న్న పరిణామాలు ఉద్వేగభరితం గా మనముందు కదలాడుతున్నాయి. నాయకులను ఒక పార్టీ, ఆ పార్టీ నాయకత్వం యావత్తు ఎట్లా సొంతం చేసుకుంటుందో తెలిసే అసాధారణ సందర్భాలకు, సన్నివేశాలకు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. పార్టీలో ఒక కార్యకర్త నాయకుడిగా ఎదగడం, ఆ ఎదిగిన నాయకుడు ప్ర జాప్రతినిధిగా రూపాంతరం చెందటం చాలా రాజకీయ పార్టీల్లో జరుగుతుంది. అయితే, బీఆర్ఎస్ ప్రత్యేకం అని ఆచరణ ద్వారా నిరూపించింది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అస్వస్థత, అకాలమరణం నేపథ్యంగా తెలంగాణలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అసాధారణం. ఇప్పుడు జెన్-జీ అని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం కానీ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ దాదాపు రెండు దశాబ్దాల క్రితమే జెన్-జీని సృష్టించారు. అప్పుడు సృష్టించిన వారిలో దివంగత సుదర్శన్‌రెడ్డి ముందు వరుసలో నిలిచే నిఖార్సయిన ఉద్యమకారుడు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి గత నెల 26న అస్వస్థతకు గురికావడం, బీఆర్ఎస్లో కార్యకర్త నుంచి అధినేత కేసీఆర్ వరకు పార్టీ యావత్తు తీవ్ర ఆందోళన చెందింది. ఉద్యమ సహచరుడిని కాపాడుకునేందుకు పార్టీ అధినాయకుడు కేసీఆర్ విశ్వప్రయత్నాలు చేయటం, హనుమకొండలోని ఓ ప్రైవేట్ దవాఖాన నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించే విషయంలో దగ్గరుండీ అన్ని ఏర్పాట్లు చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదేశించారు. కేటీఆర్, హరీశ్‌రావు ఇద్దరూ హనుమకొండకు వెళ్లారు.
వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు దగ్గరుండి తరలించటం తెలిసిందే. సుదర్శన్‌రెడ్డి దవాఖానలో చికిత్స పొందినన్ని రోజులు ఉదయం ఒకరు, సాయంత్రం ఒకరు అన్నట్టుగా వైద్యులతో సంప్రదింపులు జరపటం, పెద్ది కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు మనోధైర్యాన్ని కల్పించేందుకు అహర్నిశలు శ్రమించటం కూడా అందరికీ తెలిసిందే. ఉద్యమ సమయం నుంచి పెద్ది సుదర్శన్‌రెడ్డితో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉన్నవారందరూ ఆయన కోలుకోవాలని ప్రార్థించారు. కానీ, దురదృష్టవశాత్తు గత నెల 30న అర్ధరాత్రి దాటాక సుదర్శన్‌రెడ్డి తుది శ్వాస విడిచారు. పెద్ది కన్నుమూసిన తెల్లారి జులై 31వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం ఉమ్మడి వరంగల్ వైపు కదిలాయి. పెద్ది అంతిమయాత్రకు తండోపతండాలుగా ప్రజానీకం తరలివచ్చారు.
సుదర్శన్‌రెడ్డికి అందుతున్న వైద్యసేవలను అధినేత కేసీఆర్ ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు దవాఖానకు వెళ్లారు. ఎలాగైనాసరే పెద్ది ప్రాణాలు కాపాడాలని వైద్యులను అభ్యర్థించారు. పెద్ది కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చారు. సహచర ఉద్యమకారుడి కోసం అధినేత ఆరాటపడ్డ తీరు అందరి హృదయాలను కదిలించింది. ఆ తర్వాత నర్సంపేట నియోజకవర్గంలోని పెద్ది సుదర్శన్‌రెడ్డి స్వగ్రామం నల్లబెల్లిలోని నివాసానికి చేరుకొని నివాళి అర్పించే సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు అత్యంత ఉద్విగ్నభరితమైనవే కాదు, తీవ్ర గంభీరమైనవి. జయశంకర్ సార్ మహాభినిష్క్రమణ సమయంలో కేసీఆర్ ఎలాంటి విషాదంలోకి వెళ్లిపోయారో పెద్ది సుదర్శన్‌రెడ్డికి నివాళి అర్పించిన అనంతరం నల్లబెల్లిలోని పెద్ది నివాసంలో అలాంటి వాతావరణమే కనిపించింది. ఆత్మగల్ల అధినేత కలిగిన మానవీయ పార్టీ బీఆర్ఎస్ శ్రేణులంతా పెద్ది కుటుంబానికి మనోధైర్యంగా నిలబడ్డారు.
రెండు వారాలుగా యావత్తు వరంగల్ వేదికగా పెద్ది సుదర్శన్‌రెడ్డి చేసిన పోరాటం, ఒక ఎమ్మెల్యేగా నర్సంపేట నియోజకవర్గానికి పెద్ది చూపిన మార్గదర్శనం, ఆ నియోజకవర్గ ప్రజల కోసం తపించిన వైనం.. అందులో భాగస్వాములైనవారి అందరి కండ్ల ముందు కనిపించాయి. రాజకీయ పార్టీల చరిత్రలో పెద్దికి పార్టీ కుటుంబంలా అండగా నిలిచిన ఉదంతం అరుదైన విషయంగా, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్లో చర్చసాగుతున్నది. పార్టీని నమ్ముకొని, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన కార్యకర్తకు పార్టీ యావత్తు ఇచ్చే గౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా పెద్ది అధ్యాయం నిలుస్తుంది. బీఆర్ఎస్ 26 ఏండ్ల ప్రయాణంలో అధినేత కేసీఆర్‌కు దగ్గరైన అత్యంత సన్నిహితుల్లో పెద్ది ముందు వరుసలో ఉంటారు. అదే క్రమంలో అధినేత కేసీఆర్ నమ్మకాన్ని వమ్ముచేయకుండా త్రికరణ శుద్ధిగా పనిచేసిన వారికి దిక్సూచిలా పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎప్పటికీ నిలిచే ఉంటారు. ఉద్యమ సమయంలో పెద్ది పోషించిన పాత్రకు, తాను ఒకేసారి ప్రాతినిధ్యం వహించినప్పటికీ నర్సంపేట నియోజకవర్గ శాశ్వత పురోభివృద్ధికి పెద్ది సుదర్శన్‌రెడ్డి అనుసరించిన వైఖరి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న యువతకు ఆదర్శం. ఇప్పటికే వచ్చిన వారికి కూడా పెద్ది చూపిన పోరాటం, పాలనా విధానాలు మార్గదర్శనం. పెద్ది సుదర్శన్‌రెడ్డి మన మధ్య భౌతికంగా లేకపోయినా బీఆర్ఎస్లో, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్రవేశారు.