హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రైతాంగానికి సీఎం రేవంత్‌రెడ్డి శాపంగా మారారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని, ప్రజాక్షేత్రంలోనే నాలుక చీరేస్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో ఒక సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ప్రభు త్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని మండిపడ్డారు.
మంగళవారం తెలంగాణభవన్‌లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పలువురు నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ అంశం లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతున్నదని విమర్శించారు. కేసీఆర్ పర్యటనకు వెళ్లొచ్చేలోపు గాయత్రి పంపుహౌజ్ నుంచి నీళ్లు ఎందుకు వదిలారని ప్రశ్నించారు. సాగు, తాగునీటిపై కాం గ్రెస్ నేతలు ముఖాముఖి చర్చకు వస్తే తాను సిద్ధమని సవాల్ చేశారు.
డిసెంబర్ నుంచి మార్చి వరకు తుపాకులగూడెం నుంచి 48 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసింది వాస్తవం కాదా? వీటిని ఎందుకు ఎత్తిపోయలేదు? అని ప్రశ్నించారు. ఇందులో అత్యధిక నీరు ప్రాణహిత, మేడిగడ్డ నుంచి వచ్చిందేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో ఉన్న నీటిని ఎలా వాడుకోవాలనే దానిపై ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని మండిపడ్డారు. దేవాదుల ద్వారా 22 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉన్నా, ప్రభుత్వం స్పందించకే సమద్రంలో కలిశాయని ఆవేదన వ్యక్తంచేశారు.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రేవంత్‌రెడ్డి నిస్సిగ్గుగా కేసీఆర్‌పై మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రేవంత్ అన్నం తింటున్నాడా? గడ్డి తింటున్నాడా? బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడ్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ సన్నాసిగా చిల్లరలెకలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో తలసరి ఆదాయం 1.12 లక్షల నుంచి 3.17 లక్షలకు పెరగడం.. విధ్వంసమా? అని సీఎంను ప్రశ్నించారు. రైతులు పంటలను ఎందుకు తగలబెడుతున్నారో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దమ్ముంటే అప్పటి డీజీపీ మహేందర్‌రెడ్డిని, హోంశాఖ కార్యదర్శిని వి చారించాలని సవాల్‌చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఒక సామాజికవర్గాన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రశ్నించారు. తుకుగూడ వెళ్లి తుప్పుపట్టిన మనిషిలా రేవంత్ మాట్లాడారని ఎద్దేవా చేశారు. వరంగల్‌లో కడియం కావ్యకు డిపాజిట్ దక్కదని హెచ్చరించారు. మేయర్ పదవికి గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే పదవికి కడియం శ్రీహరి, దానం నాగేందర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.రేవంత్‌రెడ్డి దొంగల ముఠా నాయకుడని గ్యాదరి కిశోర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఒకరోజు బయటికొస్తేనే కాంగ్రెస్ మంత్రులు ఉలిక్కిపడుతున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో నర్సింహారెడ్డి, తుంగ బాలు పాల్గొన్నారు.