మొగుళ్లపల్లి/చిట్యాల/ పెనుబల్లి (కల్లూరు)/రెబ్బెన, ఆగస్టు 4: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు సకల సౌకర్యాలందించిన గురుకులాలు.. నేడు సీఎం రేవంత్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయి. విద్యార్థులకు కనీస సౌకర్యాలు, సరైన భోజనం అందించకుండా వారిని అనారోగ్యం పాలు చేస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం మొగుళ్లపల్లి, కల్లూరు , రెబ్బెన గురుకులాల్లో ఫుడ్‌పాయిజన్ అయి, 65 మంది అస్వస్థతకు గురై దవాఖానల్లో చికిత్సపొందుతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొరికిశాల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం ఉదయం కిచిడీ తిన్న 31 మంది విద్యార్థినులు కడుపునొప్పితో బాధపడ్డారు. మొగుళ్లపల్లి పీహెచ్సీలో 18 మంది చికిత్స పొందుతుండగా, 13 మందిని అంబులెన్స్‌లో చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, డీఎస్పీ సంపత్‌రావు, సీఐ మల్లేశ్ దవాఖానలో విద్యార్థులను పరామర్శించారు. బాధ్యులైనవారిని వెంటనే శిక్షించాలంటూ దవాఖాన ఎదుట బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టగా.. వారిని పోలీసులు వారిని అరెస్టు చేశారు.
ఖమ్మం జిల్లా కల్లూరులోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థినులు ఆశ్రమ వసతిగృహంలో ఉదయం కిచిడీ తిని పాఠశాలకు వెళ్లిపోయారు. గంట వ్యవధిలోనే వారిలో 30 మంది విద్యార్థినులు సొమ్మసిల్లి పడిపోయారు. ఉపాధ్యాయులు వారిని వెంటనే సీహెచ్‌సీకి తరలించారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఆదివారం స్నేహితుల దినోత్సవంలో పాల్గొన్న విద్యార్థినులు రాత్రి భోజనంచేసి పడుకున్నారు. కొద్దిసేపటికే స్పందన, సంజన, సంకీర్తన తీవ్రఅస్వస్థతకు గురికాగా సిబ్బంది బెల్లంపల్లి దవాఖానకు తరలించారు. సంకీర్తన కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు.