మోర్తాడ్/మాక్లూర్/భిక్కనూరు, జూన్ 17: యూరియా యాప్ను రద్దు చేయకుండా తమను గోస పెడ్తరా అంటూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు పలుచోట్ల ఆందోళనలకు దిగారు. యూరియా యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, పాత పద్ధతిలోనే సరఫరా చేయాలని, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తును సరాఫరా చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. అలాగే, మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లిలో 63వ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నేతలు, అన్నదాతలు ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం రేవంత్రెడ్డి మొదటి నుంచి రైతులను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. రుణమాఫీ సరిగా చేయలే, రైతుభరోసా సరిగా ఇయ్యలే, వానకాలం వచ్చినా రైతుభరోసా ఊసేలేదని విమర్శించారు. పాలన చేతకాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా బు క్ చేసుకుంటే లింక్ అంటగడుతున్నారని, లింక్ వద్దంటే యూరియా ఇస్తలేరని వాపోయారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాగా యూరియా యాప్ను రద్దు చే యాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా భిక్కనూరులో బీఆర్ఎస్ నాయకులు, రైతులు బుధవారం ధర్నాకు దిగారు. ‘కాంగ్రెస్ పోవాలి.. యూరియా కావాలి’ అంటూ నినదించారు. ఏడీఏ అపర్ణ, ఏవో నాగరాజురెడ్డి అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. చాలా మంది వద్ద సాధారణ ఫోన్లే ఉన్నాయని, మరీ వారు ఎలా బుక్ చేసుకోవాలని ప్రశ్నించారు. ఉన్న స్టాక్ కూడా వెంటనే అయిపోతుందని తెలిపారు. యాప్ను రద్దు చేయాలని, పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.