హైదరాబాద్, జూల్7 (నమస్తే తెలంగాణ) : ‘కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నరు. కానీ ఎల్ నినో ప్రభావం వల్ల వానలు కురువడం లేదు. గోదావరిలో వరదలు లేవు. అలాంటప్పుడు ఎలా ఎత్తిపోస్తరు?’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వింత మాటలు మాట్లాడారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకే బరాజ్‌లను పూర్తిగా తెరిచిపెట్టామని తెలిపారు. సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు మంగళవారం ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొనసాగింది. సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న డిమాండ్‌ను ఖండించారు. నీటిని నిల్వచేస్తే బరాజ్‌లు కూలిపోతాయని ఎన్డీఎస్ఏ హెచ్చరించిందని, ఆ సూచనల మేరకే బరాజ్‌లను తెరిచిపెట్టామని సమాధానమిచ్చారు. ఎల్ నినో ప్రభావంతో వానలు కురువడం లేదని, గోదావరిలో వరదలే రావడం లేదని, అలాంటప్పుడు నీటిని ఎలా ఎత్తిపోస్తామంటూ అసత్య ప్రచారానికి తెరతీశారు. బరాజ్‌లను పునరుద్ధరిస్తామని, ఆ తర్వాతే నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుందని, అప్పటివరకు వరదలు వచ్చినా దిగువకు జలాలు పోతూనే ఉంటాయని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
కేసీఆర్‌కు ప్రాజెక్టును వారం అప్పగిస్తే నీళ్లు ఎత్తిపోసి చూపుతామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా సీఎం స్పందించారు. కేసీఆర్ కోరితే అసెంబ్లీలో కాళేశ్వరంపై, కన్నెపల్లి పంప్‌హౌస్‌పై ప్రత్యేక చర్చ ఏర్పాటు చేస్తామని, వచ్చి సలహాలివ్వాలని కోరారు. కాళేశ్వరం, కేసీఆర్‌పై గతంలో చేసినట్టే అవే ఆరోపణలకు దిగారు. సాంకేతిక పరీక్షలు చేయలేదని, నాణ్యత పాటించలేదని, అప్పులు చేశారంటూ వల్లెవేశారు. ఎన్డీఎస్ఏ నివేదికలు, ఘో ష్ రిపోర్టులు అంటూ ఏకరువు పెట్టారు. ఆపై ఎన్డీఎస్ఏ సూచనల మేరకే బరాజ్‌లను పునరుద్ధరిస్తామని, ఆ తర్వాతే వినియోగిస్తామని తేల్చిచెప్పారు.
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల బీమాను వర్తింపజేయనున్నామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఇందిరాగాంధీ జయంతి రోజున బీమా పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. మధిరలో 10న రైతు సభ నిర్వహించనున్నామని, రైతు భరోసా నిధులు లక్షల మంది రైతుల మధ్యన విడుదల చేయనున్నామని వెల్లడించారు. తమ ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్నీ నిలుపుదల చేయలేదని, అన్నింటినీ కొనసాగిస్తున్నదని తెలిపారు. అవిగాక కొత్త పథకాలను కూడా అమలు చేస్తున్నదని చెప్పారు.