హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): చేనేత కార్మికులకు అభయహస్తం అంటూ సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన పథకాలు కొత్తవికావని నేతన్నలు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో అమలైన పథకాలకే పేర్లు మార్చి కొత్త పథకాలంటూ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. అంతేగాక ఆ పథకాల్లోనూ నగదు కోత విధిస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం తెలంగాణ పవర్లూమ్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూరపాటి రమేశ్ మాట్లాడుతూ గతంలో అమలైన చేనేతకు చేయూత పొదుపు పథకాన్ని గత ఆరు నెలలుగా నిలిపివేశారని, అప్పట్లో ఈ పథకం కాలపరిమితి 36 నెలలు ఉండగా దీన్ని 26 నెలలకు తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు.
నేతన్న బీమా పథకాన్ని నేతన్న భద్రతగా మార్చారని తెలిపారు. గతంలో చేనేత కార్మికుడికి సంవత్సరానికి రూ.2000 ఇవ్వగా ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి రూ.18000లకు తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు రెండు చీరల చొప్పున అందజేస్తామని, ఆ చీరలను నేతన్నలతో తయారు చేయించి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి ఆ హామీని మరిచిపోయారని పేర్కొన్నారు.