కరీంనగర్, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ధ్వంసం చేయడంతోపాటు హుజూరాబాద్ ఎమ్మెల్యేపై పాడి కౌశిక్‌రెడ్డిపై దాడికి యత్నించిన ఘటనపై బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ఆగ్రహం పెల్లుబికింది. శుక్రవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలతో హోరెత్తింది. బీజేపీ గుండాగిరీని నిరసిస్తూ అనేక ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. బీజేపీ దాడిని నిరసిస్తూ శనివారం కరీంనగర్ బంద్‌ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆదేశాల మేరకు వేములవాడలో రహదారిపై రాస్తారోకో చేశారు. చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, మేడిపల్లి మండల కేంద్రంలో ధర్నాలు నిర్వహించారు. కథలాపూర్‌లో ధర్నాలు చేయడంతోపాటు పాటుగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలకేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. బీజేపీ దాడికి నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం తలపెట్టిన నగర బంద్‌కు ప్రజలందరూ సహకరించాలని కోరుతూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరీంనగర్ చరిత్రలో మొదటిసారి తన క్యాంపు కార్యాలయంపై దాడి చేసి విష సంస్కృతికి బీజం వేశారని ఆగ్రహించారు. ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. గురువారం తన క్యాంపు కార్యాలయంపై దాడి ఘటనను నిరసిస్తూ శనివారం కరీంనగర్ నగరబంద్కు పిలుపునిస్తున్నామని, దీనికి అన్ని వర్గాల ప్రజలతోపాటు వ్యాపార వాణిజ్య సంస్థలు మద్దతు ఇవ్వాలని కోరారు. బంద్‌లో బీఆర్ఎస్ శ్రేణులందరూ శాంతియుతంగా పాల్గొని సహకరించాలని సూచించారు.