హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో(Muncipal elections )కాంగ్రెస్ దౌర్జన్యాలపై మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి(Election Commission) ఫిర్యాదు చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు, కౌన్సిలర్ల దౌర్జన్యం, ఇబ్రహీం పట్నం ఎన్నిక స్టే అంశం పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..116 మున్సిపాలిటీ ,7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి. విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసి, దాడులు చేశారని మండిపడ్డారు. ఎన్నికలు సజావుగా జరగలేదు.
ఇవాళ చైర్మన్ ఎన్నికలో సైతం దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. జనగామలో మహిళా కౌన్సిలర్ చేయి పట్టి లాగారు. వాళ్లకు అనుకూలంగా ఉంటే అనౌన్స్ చేస్తున్నారు. లేదంటే దాడులు, వాయిదాలు వేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘం నామ్ కే వాస్త్ గా ఉంది. ఇబ్రహీంపట్నంలో ఎన్నిక అయ్యాక కోర్టు స్టే అని ఆపారు.
దీనిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు. 30 మున్సిపాలిటీ లో హంగ్ వచ్చినా ఇష్టానుసారంగా ప్రవర్తించారు. పోలీసులను ఉపయోగించి వాళ్లకు అనుకూలంగా ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. గవర్నమెంట్ సంస్థ లాగా ఎన్నికల సంఘం మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.