తొర్రూరు, నవంబర్ 25 : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీసీ ఓటు ఒక్కటీ కూడా వేయొద్దని బీఆర్ఎస్, బీసీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 18 మండలాలు ఉండగా 14 మండలాల్లో ఒక్క బీసీ సర్పంచ్ రిజర్వేషన్ కూడా కేటాయించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. బీసీలను వాడుకొని వదిలేసే స్వభావం కాంగ్రెస్ పార్టీకి ఉందని, అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులకు ఓటు వేయకుండా గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలను మోసం చేస్తోందని వారు ఆరోపించారు.
రిజర్వేషన్ విషయంలో బీసీలపై జరిగిన అన్యాయాన్ని ఎండగట్టి బీసీల ఐక్యతను ఈ ఎన్నికల్లో చాటి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్ గౌడ్, పీఎస్ఎస్ డైరెక్టర్ జనార్దన్ రాజు, అంకూస్, మాజీ ఎంపిటిసి పల్లె దేవమ్మ, పల్లె సర్వయ్య, దొనకన కుమారస్వామి, రాగి జగదీశ్, మైబెల్లి, లింగయ్య తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.