సంగారెడ్డి: రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటే చాలా ఆయా ప్రాంతాల్లో ఉద్యమ పార్టీ నేతలపై పోలీసులు నిర్భందాలు విధింస్తున్నారు. సీఎం రేవంత్ శుక్రవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జహీరాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిచేసిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈనేపథ్యంలోబీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి వారి ఇండ్ల నుంచి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇక గుమ్మడిదల మండలం నల్లవల్లిలో డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న జేఏసీ నాయకులను, బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
సంగారెడ్డి జిల్లాలో కాలుమోపకముందే సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన విమర్శల పాలవుతున్నది. బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన అభివృద్ధి పనులను శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. కేసీఆర్ హయాంలో పూర్తయిన పనులు తాము పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభోత్సవాలకు పూనుకోవడం చర్చనీయాంశం అవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటుతున్నా సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయలేదు. ఇప్పుడు తన పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి రూ.100 కోట్లతో నిర్మించిన నిమ్జ్ రోడ్డు, రూ.100 కోట్లతో జహీరాబాద్ పట్టణంలో నిర్మించిన రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. హుగ్గెళ్లి చౌరస్తాలో మహాత్మ బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఝరాసంగం మండలంలోని మాచునూరులో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఈ పనులన్నీ బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే ప్రారంభమై, పూర్తయినవి కావడం గమనార్హం.