హైదరాబాద్, అక్టోబరు 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజలపాలిట అసలు కొరివి దయ్యం సీఎం రేవంత్‌రెడ్డేనని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్నివర్గాల పాలిట బూతంలా మారారని విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడానికే సీఎం పదవి రాలేదనే విషయాన్ని రేవంత్ గ్రహించాలని, మాటలు మాని చేతల మీద దృష్టి సారించాలని హితవు పలికారు.
కాంగ్రెస్ పాలనలోనే చెరువులు మాయమయ్యాయని, తొలి నాళ్లలో 70 వేల చెరువులు ఉండగా, 2014 నాటికి 46 వేలకు ఆ సంఖ్య తగ్గిందని తెలిపారు. వీటికి కారణం ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. చెరువులపై దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని పేర్కొన్నారు. చెరువుల ఆక్రమణ, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై ప్రభుత్వం ప్రజలను గందరగోళపరిచే ప్రకటనలు చేస్తున్నదని విమర్శించారు. దసరా పండుగ ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను కష్టపెడుతున్నదని మండిపడ్డారు.
పది నెలలైనా తన మంత్రివర్గాన్ని రేవంత్‌రెడ్డి ఎందుకు విస్తరించలేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి నిధులను రాబట్టడంలో సీఎంగా ఆయన విఫలమయ్యారని విమర్శించారు. రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ధ్వజమెత్తారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ విమర్శించారు.
ఉద్యోగ నియామకాలపై ముఖ్యమంత్రి అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. రేవంత్ ఇప్పటిదాకా ఇచ్చిన ఉద్యోగాలు ఆరు వేలేనని, తప్పుడు మాటలు మాట్లాడిన సీఎం నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాది పాలన పూర్తి కావస్తున్నదని, రెండు లక్షల ఉద్యోగాలు ఏవని ప్రశ్నించారు.