Padi Kaushik Reddy | ప్రైవేటు హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి హ్యాక్ చేయిస్తున్నారని చేసిన ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు దాడి చేస్తారనే అనుమానంతో హైదరాబాద్ కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు నాయకత్వంలో కౌశిక్ రెడ్డికి మద్దతుగా వెయ్యి మందికిపైగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు.
శుక్రవారం బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవడం సిగ్గుచేటు అని కార్యకర్తలు మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి మాట్లాడిన విషయాల్లో తప్పేమీ లేదని వారు పేర్కొన్నారు. ఆయనపై దాడి జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు, అరెస్టులు, దాడులతోనే పరిపాలన కొనసాగిస్తున్నదని విమర్శించారు. ప్రజలు ఈ విధానాలను గమనిస్తున్నారని, భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
**కెసిఆర్ గారు మరియు KTR గారు హరీష్ రావు గారి నాయకత్వం లో కౌశిక్ రెడ్డికి మద్దతుగా వెయ్యిమంది కి పైగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కదిలారు**
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో, ఆయనకు మద్దతుగా… pic.twitter.com/DqimDdTspS
— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) July 26, 2025
భయంతో వెనక్కి తిరిగి వెళ్లిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు
కాగా, కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి కోసం బయల్దేరిన కాంగ్రెస్ కార్యకర్తలు మధ్యలోనే ఆగిపోయినట్లు తెలిసింది. కౌశిక్ రెడ్డికి మద్దతుగా ఆయన ఇంటికి బీఆర్ఎస్ కార్యకర్తలు తండోపతండాలుగా తరలివస్తున్నారనే సమాచారం తెలియడంతో వెనక్కి తిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం.
కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
ఇదిలా ఉండగా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని రాజేంద్రనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
పాడి కౌశిక్ రెడ్డి ఏమన్నారంటే..
ప్రైవేటు హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారిని బ్లాక్మెయిల్ చేయిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్‌రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నట్టు రేవంత్‌రెడ్డి స్వయంగా అంగీకరించారని, కాబట్టి దీనిపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాం డ్ చేశారు. అర్ధరాత్రి వేళ సీఎం రేవంత్‌రెడ్డి ‘మై హోం భుజా’కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ అంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులపై రేవంత్‌రెడ్డి కావాలనే బుర దజల్లుతున్నారని మండిపడ్డారు. 118 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు, ఎమ్మెల్సీల ఫోన్లను రేవంత్ ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన వారి ఫోన్లను కూడా రేవంత్ ట్యాప్ చేయించారని పేర్కొన్నారు.