హైదరాబాద్/సిటీబ్యూరో/నాంపల్లి కోర్టులు, జూన్ 21 (నమస్తే తెలంగాణ): బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటి ఎదుట బీఆర్ఎస్ నేతలు, విద్యార్థి నాయకులు గర్జించారు. పోచారం కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న సమాచారంతో ఆయన ఇంటికి వెళ్లారు. బీఆర్ఎస్ను ఎందుకు వీడాలనుకుంటున్నారని, కేసీఆర్ ఏం తక్కువ చేశారని శాంతియుతంగానే అడిగేందుకు వెళ్లిన గులాబీ సైనికులపై కాంగ్రెస్ నాయకులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఆ దాడులను ఆపాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడమే కాకుండా బీఆర్ఎస్, విద్యార్థి నేతలనే అరెస్టు చేశారు. దాడులకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయకుండా తమ ఎమ్మెల్యేను కలిసి మాట్లాడేందుకు వెళ్లిన విద్యార్థి నేతలనే అరెస్టు చేయడం దారుణమని, తక్షణమే వారిని విడుదల చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు నివాళులు అర్పించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, ఆయనను కలిసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి పోచారం ఇంటికే వెళ్లారని ప్రచారం మొదలైంది. తమ ఎమ్మెల్యేపై వస్తున్న ప్రచారం నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కలుద్దామని బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలోని పోచారం ఇంటికే బయలుదేరి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ సీనియర్ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఆంజనేయగౌడ్, దూదిమెట్ల బాలరాజు, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, వాసుదేవరెడ్డి, ఓయూ విద్యార్థి నేతలు తుంగబాలు, కడారి స్వామియాదవ్, కే జంగయ్య, సీహెచ్ దర్శయ్య, పార్టీ నేతలు డీ రాజు, వరికుప్పల వాసు, రాజేశ్‌నాయక్ తదితరులు వెళ్లారు.
అప్పటికే ఇంటి వద్ద పెద్దసంఖ్యలో కాంగ్రెస్ నేతలు మోహరించి ఉన్నారు. లోపల సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డితో భేటీ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సహా ఇతర నాయకులు శాంతియుతంగా ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుండగానే వారిని కాంగ్రెస్ నాయకులు అడ్డుకొని పోలీసుల ఎదుటే దాడికి దిగారు. ‘మా ఎమ్మెల్యేను కలిసి మేం మాట్లాడకూడదా? వస్తే దాడులకు దిగుతారా? సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు’ అని అరెస్టు అనంతరం బాల్క సుమన్ తెలిపారు.
బాల్క సుమన్ సహా ఇతర నేతలు పోచారం ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా ‘మీకు ఇక్కడేం పని? ఎందుకొచ్చార్రా.. ‘ఇంకా మీ ఎమ్మెల్యే ఏంట్రా?’ అంటూ కాంగ్రెస్ నాయకులు తీవ్ర దుర్భాషలాడారు. ఈ సమయంలో ఇరుపక్షాల నడుమ తోపులాట, వాగ్వాదం చోటుచేసుకొని ఉద్రిక్తత నెలకొన్నది. బీఆర్ఎస్, విద్యార్థి నేతలపై కాంగ్రెస్ నాయకులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఇదే సమయంలో బాల్క సుమన్, దూదిమెట్ల బాలరాజు తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మిగితా విద్యార్థి నాయకులు పోలీసు వాహనానికి ముందు బైఠాయించారు. వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో మరో విద్యార్థి నాయకుడు రాజేశ్‌నాయక్ కాలికి తీవ్రగాయమైంది. బాల్క సుమన్ సహా 11 మంది బీఆర్ఎస్ పార్టీ, విద్యార్థి నాయకులను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. ఆయా నేతలపై 353, 448 ఐపీసీ, రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి 3వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపర్చారు. అయితే, వారి రిమాండ్‌కు నిరాకరించిన కోర్టు ..రూ.10 వేల చొప్పున ఇద్దరు జమానతుపై ఆ 11 మందికి బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాల్సిందిగా వారిని ఆదేశించింది.