హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల వ్యవహారంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా దొరికిపోయిందని, ఆ తప్పులను కప్పిపుచ్చుకొనేందుకే అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేతలపై అబద్ధాలు వల్లెవేస్తున్నారని మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మీడియా స మావేశంలో వారు మాట్లాడారు. దారి తప్పిన వాసోడిగా మా, కొలంబస్‌లా మారిన సీఎం రేవంత్‌రెడ్డి.. అసెంబ్లీలో దొరికిపోయిన దొంగలా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు.
తన భూములపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, తనకున్న భూముల్లో ఒక ఇంచు కూడా ఇనాం భూమి లేదని జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. 2018, 2023 ఎన్నికల అఫిడవిట్లలో తన ఆస్తులకు సంబంధించిన ప్రతి వివరాలను పారదర్శకంగా వెల్లడించానని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నేతలపై సీఎం చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేశారు. గతంలో కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల భూమి ఉన్నదని ఆరోపించిన రేవంత్‌రెడ్డి, ఇవాళ అసెంబ్లీలో మాత్రం కేసీఆర్ భూమి కొనుగోళ్లపై మాట్లాడి పాత ఆరోపణలన్నీ అవాస్తవమని పరోక్షంగా ఒప్పుకొన్నారని పేర్కొన్నారు. కేసీఆర్ 2008 నుంచే చట్టబద్ధంగా భూమి కొనుగోలు చేశారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, ఉద్యమకారుల భూములను సైతం లాకుంటున్నదని ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ పేరు మీద మొత్తం 67 ఎకరాల విస్తీర్ణం ఉన్నదని చెబుతూనే, అందులోనే 350 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నదని సీఎం మాట్లాడటం అత్యంత హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పాలనతోపాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. సిరిసిల్లలో మాజీ నక్సలైట్ల పునరావాసం కోసం 2002లో అప్పటి ప్రభుత్వం తోట ఆగయ్యకు కేటాయించిన భూమిని ఇప్పుడు సర్కార్ అన్యాయంగా లాకున్నదని ధ్వజమెత్తారు. సిరిసిల్ల ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన రవీందర్‌రావుకు వారసత్వంగా వచ్చిన ఆ స్తులను కూడా సీఎం కబ్జా భూములుగా చిత్రీకరించడం దారుణమన్నారు. ప్రజాగ్రహం నుంచి తప్పించుకొనేందుకే రేవంత్ ఎదురుదాడికి దిగుతున్నదని స్పష్టంచేశారు. విప్ వివేకా నందగౌడ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, చిరుమల్ల రాకేశ్ పాల్గొన్నారు.