Y Satish Reddy | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజా వ్యతిరేకత, ఉపఎన్నికల భయంతో మతి భ్రమించినట్టుగా అనుమానం కలుగుతోందని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకే ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు ఉప ఎన్నికలు ఎలా వస్తాయని ఆయన మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా చట్టం చేస్తామని కాంగ్రెస్ పార్టీనే స్వయంగా తమ మేనిఫెస్టోలో పెట్టింది. పార్టీ ఫిరాయిస్తే వెంటనే అనర్హత వేటు వేస్తామని మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొంది. కానీ అదే పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలు ఎలా వస్తాయని మాట్లాడుతున్నారు. ఓ వైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ ఫొటోలు కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో కనిపిస్తే వాళ్లే కేసులు పెడుతున్నారు. మరికొందరేమో మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని అంటున్నారు. మీరేమో ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయని మాట్లాడుతున్నారు. కానీ సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయడానికి భయపడుతున్నారు. వాయిదాల మీద వాయిదాలు అడుగుతున్నారు. ఇది మీ భయం కాదా.? అని సతీష్ రెడ్డి ప్రశ్నించారు.
నిజంగానే ఉప ఎన్నికలు రావని మీరు భావిస్తే సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయడానికి ఇన్ని రోజులు ఎందుకు సమయం తీసుకుంటున్నారు.? మీ కాంగ్రెస్ పాలనపై తెలంగాణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మీ బాగోతం బయటపడుతుంది. ఒక్క సీటు కూడా గెలిచే ఛాన్స్ లేదు. ఆ భయం మీకు పట్టుకుంది. అందుకే దాన్నుంచి తప్పించుకునేందుకు తెలంగాణ ప్రజల సొమ్మును తీసుకెళ్లి ఢిల్లీలో లాయర్ల దగ్గర పోస్తున్నారు. దీనికంతటికి మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు అని రేవంత్ రెడ్డిని సతీష్ రెడ్డి హెచ్చరించారు.